తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Communists Unity: వామపక్షాల ఐక్యత ఒట్టిమాటే.. పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం చెరోదారి!

Communists Unity: వామపక్షాల ఐక్యత ఒట్టిమాటే.. పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం చెరోదారి!

HT Telugu Desk HT Telugu

01 April 2024, 9:48 IST

    • Communists Unity: ఖమ్మంలో కమ్యూనిస్టు  పార్టీల నడుమ పొత్తు  సాధ్యం కానట్లే కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు చర్చలు జరపడం ఏదో ఒక సాకుతో విడిపోవడం ఆ పార్టీలకు ఆనవాయితీగా మారింది.
వామపక్షాల ఐక్యత ఒట్టిమాటేనా (ప్రతీకాత్మక చిత్రం)
వామపక్షాల ఐక్యత ఒట్టిమాటేనా (ప్రతీకాత్మక చిత్రం)

వామపక్షాల ఐక్యత ఒట్టిమాటేనా (ప్రతీకాత్మక చిత్రం)

Communists Unity: Khammam కమ్యూనిస్టు Communist పార్టీల మధ్య మధ్య పొత్తు పొసగక ఇతర పార్టీలతో పొత్తులకు పాకులాడుతున్న పరిస్థితి అనివార్యంగా మారింది. ఎన్నికల వేళ పొత్తు కోసం వెతుకులాడే లెఫ్ట్ పార్టీలు పార్లమెంటు ఎన్నికల వేళ కూడా దిక్కుతోచని స్థితిలో పడ్డాయి.

ట్రెండింగ్ వార్తలు

Fact Check: హైదరాబాద్‌‌‌లో రిగ్గింగ్ జరిగినట్టు చూపుతున్న వీడియో నిజమేనా?

TDP BJP Alliance: చంద్రబాబు భయమే నిజమైందా? బీజేపీతో పొత్తుకు తలొగ్గింది ఇందుకేనా?

Mamata Banerjee: ‘కేంద్రంలో ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతిస్తాం’: మమతా బెనర్జీ

Factcheck: ఇండియా టుడే, టైమ్స్ నౌ సహా సంస్థలు ఎటువంటి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయలేదు

గతమెంతో ఘనంగా వెలిగిన ఆ పార్టీలు స్వయం కృతాపరాధంతో వైభవాన్ని కోల్పోయి చెల్లా చెదురుగా పయనం సాగిస్తున్నాయి. సీపీఐ పార్టీ మొన్నటి ఎన్నికల్లో తెలివిగా కాంగ్రెస్ Congress తో పొత్తు పెట్టుకుని వ్యూహాత్మకంగా వ్యవహరించగా, పంతానికి పోయిన సీపీఎం CPM మాత్రం మళ్లీ చారిత్రక తప్పిదాన్నే చేసింది.

ఇరు పక్షాలు కలిసి పోటీ చేసే విషయంలో వీరి నడుమ సయోధ్య కుదరకపోవడం గమనార్హం. తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లోనూ వామ పక్ష కూటములు చెరో దారిలో పయనించబోతున్నట్లు స్పష్టమవుతోంది.

లోక్ సభ ఎన్నికల్లో వామ పక్షాలు విడివిడిగానే పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏ ఎన్నికలు వచ్చినా వామపక్షాలు కలిసి పోటీ చేయాలని పలు సందర్భాలో ప్రకటించడం సాధారణమైపోయింది అలా జరిపిన చర్చలు కొన్ని రాజకీయ సమీకరణాల వల్ల చెదిరిపోతున్నాయి.

చివరకు ఐక్యత కోల్పోయి వేర్వేరుగా పోటీ చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడు కూడా దాదాపు అదే పరిస్థితి ఉత్పన్నం కాబోతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకప్పుడు ఖమ్మం, భద్రాచలం ఎంపీ స్థానాల్లో స్వతంత్రంగా గెలుపొందిన చరిత్ర కలిగిన వామపక్షాలు ఇప్పుడు ఒంటరిగా పోటీ చేసేందుకు ముందుకు రాలేకపోతున్నాయి.

తాజాగా జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లోCPI సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు స్థానాల్లో పోటీ చేయాలని భావించింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని కలిసి పని చేసిన సిపిఐ ఈ ఎన్నికల్లో కూడా వారితో పొత్తును కొనసాగించాలనే ఉద్దేశ్యంతో ఆ పార్టీ బలమైన ఐదు స్థానాలను కాంగ్రెస్ పార్టీ ముందు ప్రతిపాదన పెట్టింది. ఆ ఐదింటిలో ఒక స్థానాన్ని కోరుతోంది.

పొత్తు విషయంలో టిపిసిసి అధ్యక్షుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపా మున్షితో పలు మార్లు ఈ విషయమై చర్చించారు. నల్లగొండ, ఖమ్మం, భువనగిరి, వరంగల్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాల్లో ఒక స్థానాన్ని తమకు కేటాయించాలని సిపిఐ ప్రతిపాదించింది.

ఇందులో నల్లగొండ, పెద్దపల్లి స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్ధులను ప్రకటించింది. ఇక మిగిలిన స్థానాల్లో కనీసం ఒక సీటైనా తమకు కేటాయించాలని సిపిఐ.. కాంగ్రెస్ పార్టీని బలంగా కోరుతోంది. ఖమ్మం స్థానాన్ని కేటాయిస్తే సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణను బరిలోకి దించాలనే ఆలోచన చేసింది.

2014 ఎన్నికల్లో మహా కూటమి తరుపున ఖమ్మం నుంచి నారాయణ పోటీ చేసిన విషయం తెలిసిందే. కనీసం ఒక సీటునైనా ఈ ఎన్నికల్లో కేటాయించాలని సిపిఐ కేంద్ర కమిటి ఏఐసిసి నేతలతో సైతం చర్చలు జరిపింది. అయితే సీట్ల కేటాయింపునకు ఏఐసిసి స్థాయిలో సుముఖంగా లేన్నట్లు తేలింది.

ఒంటరి పోరుకు సమాలోచన..

ఇండియా కూటమిలో ఉన్న సిపిఐ పార్టీకి దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా సీట్లను కేటాయించకపోవడం గమనార్హం. దీంతో ఒంటరిగా పోటీకి దిగే విషయమై ఆ పార్టీ సమాలోచన చేస్తోంది. అయితే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఒంటరిగా పోటీ చేయలేని పరిస్థితిని కూడా నెమరువేసుకుంటోంది.

నేడో రేపో జరిగే సిపిఐ కేంద్ర కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు కుదరకపోతే మాత్రం పోటీ చేయాలని కేంద్ర కమిటి ఆదేశిస్తే ఖమ్మం లేక నల్లగొండలో పోటీ చేసే అంశంపై పరిశీలిస్తున్నారు.

సీపీఎం పరిస్థితి అగమ్యగోచరం..

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ పార్టీ కాంగ్రెస్ తో జతకడితే సీపీఎం మాత్రం ఒంటరిగా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 19 స్థానాల్లో పోటీ చేసి ఆ పార్టీ డిపాజిట్లు కూడా దక్కక ఘోర పరాభావాన్ని చవిచూసింది.

ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సైతం పాలేరులో పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారు. ఆయన సొంత గ్రామంలోనూ చెప్పుకోదగ్గ ఓట్లు పడకపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. తాజాగా జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కూడా సిపిఎం ఒంటరిగానే బరిలోకి దిగుతోంది.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భువనగిరి ఎంపి స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. భువనగిరి జిల్లా సిపిఎం కార్యదర్శి జహాంగిర్ ను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఈ స్థానంలో తమకు మద్దతు ఇవ్వాలని సిపిఎం పార్టీ సిపిఐ రాష్ట్ర కమిటీకి లేఖ కూడా రాసింది.

మిగిలిన స్థానాల్లో బిజెపికి వ్యతిరేకంగా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా గెలిచే అభ్యర్ధులకు అంటే కాంగ్రెస్ కు గాని లేక బిఆర్ఎస్ కు గాని పరోక్షంగా మద్దతు ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఒకప్పుడు ఖమ్మం, భద్రాచలం ఎంపీ స్థానాల నుంచి సిపిఐ, సిపిఎం పార్టీలు పలు మార్లు గెలుపొందిన ఘన చరిత్ర ఉంది. అనేక చారిత్రిక తప్పిదాలతో ఆ పార్టీలు తమ ప్రాభవాన్ని కోల్పోతూ వచ్చాయి.

ఈ పరిస్థితితో ఆ పార్టీలు ఇప్పుడు ఒంటరిగా పోటీ చేయడానికి కూడా జంకుతున్న దుస్థితిని ఎదుర్కొంటున్నాయి. 1996లో ఖమ్మం నుంచి సిపిఎం అభ్యర్థిగా తమ్మినేని వీరభద్రం, 2004లో భద్రాచలం నుంచి ఎం బాబురావు ఎంపీలుగా గెలుపొంది ఆ పార్టీలను గౌరవప్రదమైన పొజిషన్ లో ఉంచారు.

భద్రాచలం నుంచి 1984, 1996,1998 మూడు పర్యాయాలు సీపీఐ అభ్యర్థిగా సోడే రామయ్య గెలుపొందిన సమయంలో ఆ పార్టీకి జిల్లాలో సముచిత స్థానం ఉండేది. కానీ ఇప్పుడు ప్రాభవం కోల్పోయి ఎన్నికల్లో పోటీకి వెనుకాడుతున్న దుస్థితిలోకి వామ పక్షాలు దిగజారాయి. ఫలితంగా కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న ఖమ్మం జిల్లా మెల్లగా జారిపోయి కాంగ్రెస్ చేతిలోకి వచ్చి చేరింది.

(రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి)

తదుపరి వ్యాసం