Nalgonda Congress: నల్లగొండలో తేలని టిక్కెట్ల పంచాయితీ, అయినా ఆగని చేరికలు
Nalgonda Congress:నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఎక్కడి గొడవలు అక్కడే ఉన్నా, టిక్కెట్ల పంచాయితీ తేలకపోయినా కొత్త వారు పార్టీలో చేరుతూనే ఉన్నారు. పాతవారికి టిక్కెట్లు దక్కుతాయో లేదోననే ఉత్కంఠ కొనసాగుతుండగానే కొత్త వారు క్యూ కడుతున్నారు.
Nalgonda Congress: కాంగ్రెస్‌లో కొత్త జోష్ కనిపిస్తోంది. రెండు రోజుల పాటు హైదరాబాద్ లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ( సీడబ్ల్యూసీ ) సమావేశాలు, అనంతరం జరిగిన భారీ బహిరంగ సభ విజయవంతం కావడంతో ఆ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఎక్కువ జన సమీకరణ జరగాలని భావించినా.. హైదరాబాద్ కు దగ్గరగా ఉన్న మండలాల నుంచి మినహా పెద్దగా కదలింది లేదు ముఖ్యంగా పార్టీలో ఉన్న కుమ్ములాటలు, రానున్న ఎన్నికల్లో అసలు ఎవరికి టికెట్ వస్తుందో ఇదమిద్దంగా తెలియక పోవడంతో భారీగా తరలించాలని, దానికోసం ఖర్చు పెట్టుకోవాలన్న ఆలోచనకు దూరంగా ఉన్నారు. ఈ కారణంగానే ఆదివారం సాయంత్రం తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభకు అనుకున్నంత స్థాయిలో జిల్లా నుంచి జనాన్ని సమీకరించలేదని చెబుతున్నారు.
మారు బయట పడిన గ్రూపు విభేదాలు…
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంటు నియోజకవర్గాలు కాంగ్రెస్ చేతిలోనే ఉన్నాయి. దీంతో ఈ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో జనాన్ని సమీకరించాలని పార్టీ నాయకత్వం భావించినా, ఎక్కడికక్కడ ఉన్న గొడవలు, బహుళ నాయకత్వం, టికెట్ ఆశావహులు ఎక్కువగా ఉండడం వంటి కారణాలో ఎవరికి వారు వెనక్కి తగ్గారని సమాచారం.
వాస్తవానికి హైదరాబాద్ కు సరిహద్దుగా ఉన్న భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలోని దగ్గరి మండలాల నుంచి ఎక్కువ సంఖ్యలో జనాన్ని తరలించాలని భావించారు. మెజారిటీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కువ మంది నాయకులు ఉండడంతో కనీసం పోటీలు పడి సమీకరిస్తారని కూడా అంచనా వేశారు.
వాస్తవంలో నియోజకవర్గానికి రెండు వేల మందిని కూడా సమీకరించలేదని చెబుతున్నారు. దీనికంతటికీ ఇంకా టికెట్ వ్యవహారం తేలకపోవడమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.ఎవరికి వారు తమ దగ్గరి అనుచరులను మాత్రమే వెంట తీసుకువెళ్లారని అంటున్నారు. అంతే కాకుండా ఖర్చులు కూడా నాయకులను భయ పెట్టాయని విశ్లేషిస్తున్నారు.
ఎక్కడికక్కడ .. గ్రూపులు…
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ గ్రూపులు తయారయ్యాయి. అగ్నికి ఆజ్యం పోసినట్లు కొందరు సీనియర్ నాయకులు సైతం తమ వర్గాలను, అనుచరులును పెంచుకునేందుక గ్రూపులను పెంచి పోషిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఆలేరు, కోదాడ, హుజూర్ నగర్, నాగార్జున సాగర్, మినహా మిగిలిన తొమ్మిది చోట్ల గ్రూపులు తయరయ్యాయి.
పార్టీలో ఉన్న నేతలతోనే టికెట్లకు పోటీ ఎక్కుగా ఉందని భావిస్తున్న తరుణంలో కొత్త వారు వచ్చి చేరుతుండడం, వీరిని కొందరు సీనియర్ నాయకులు తెస్తుండడంతో కొత్త పంచాయితీలు మొదలవుతున్నాయి. భువనగిరి నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్షుడు పార్టీ మారాక, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అనుచరులు రామాంజనేయులు గౌడ్, శివరాజ్ గౌడ్ లను అభయం ఇచ్చారు.
రెండు రోజుల కిందట జిట్టా బాక్రిష్ణారెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేరడమైతే అన్ కండీషనల్ అని చెబుతున్నా.. జిట్టా కూడా టికెట్ ఆశిస్తున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో ఇప్పటికే అద్దంకి దయాకర్ ఉండగా, పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఆర్.దామోదర్ రెడ్డి దగ్గరి అనుచరుడు గుడిపాటి నర్సయ్యలు ఉన్నారు. గుడిపాటి నర్సయ్య 2009 ఎన్నికల్లో పోటీ చేయగా, అద్దంకి దయాకర్ వరసగా 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేశారు.
ఇపుడు వీరిద్దరూ టికెట్ ఆశిస్తుండగా, బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఆ పార్టీ నాయకుడు మందుల సామేలును కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీలోకి తీసుకువచ్చారు. ఆయనా టికెట్ ఆశిస్తుండడం గమనార్హం. ఇక దేవరకొండలో బాలూనాయక్, కిషన్ నాయక్, బిల్యానాయక్ ల గ్రూపులు ఉన్నాయి. మిర్యాలగూడెంలో బత్తుల లక్ష్మారెడ్డి (బి.ఎల్.ఆర్), కుందూరు రఘవీర్ రెడ్డి, గ్రూపులు కొనసాగుతున్నాయి.
మునుగోడులో పాల్వాయి స్రవంతీరెడ్డి, చలమల క్రిష్ణారెడ్డి, పున్న కైలాస్ నేత గుంపులు ఉన్నాయి. నల్లగొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తానే అభ్యర్థి అని అనుకుంటున్నా.. ఆయన సమక్షంలోనే పార్టీలో చేరిన దుబ్బాక నర్సింహారెడ్డి, సైదులు గౌడ్ వర్గాలు ఉండనే ఉన్నాయి. నకిరేకల్ నియోజకవర్గంలో నాలుగు గ్రూపులు కనిపిస్తుండగా, వేముల వీరేశం పార్టీలో చేరితో అయిదో గ్రూపు తయారు కావడం కచ్చితంగా జరగబోయే పరిణామం. సూర్యాపేటలో మాజీ మంత్రి ఆర్.దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి వర్గాలు ఉన్నాయి. ఈ గ్రూపుల గొడవలు రేపటి ఎన్నికల్లో ఎలాంటి ప్రతికూల ఫలితాలకు దారితీస్తాయోనన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్లగొండht