Parakala Fight: పరకాలలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్,ఓట్ల లెక్కలు వేసుకుంటూ కొట్టుకున్న ఇరువర్గాల నాయకులు
14 May 2024, 6:20 IST
- Parakala Fight: లోక్ సభ ఎన్నికల వేళ హనుమకొండ జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య యుద్దం నడిచింది. పరకాల నియోజకవర్గ కేంద్రానికి సమీపంలో ఉన్న నాగారం గ్రామంలో స్థానిక నాయకుల మధ్య మొదలైన గొడవ, చిలికి చిలికి గాలి వానగా మారింది.
పరకాలలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య ఉద్రిక్తత
Parakala Fight: బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారంటూ గులాబీ పార్టీ శ్రేణులు స్టేషన్ ఎదుట బైఠాయించారు. బీఆర్‌ఎస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వచ్చి సర్దిచెప్పినా కార్యకర్తలు వినకుండా స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగడంతో పరకాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని పరకాల మండలం నాగారంలో సోమవారం సాయంత్రం పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. పోలింగ్ జరుగుతున్నంత సేపు ఆ సెంటర్ సమీపంలోనే ఉన్న కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు ఓటింగ్ సమయం ముగిసిన తరువాత నాగారం గ్రామానికి చెందిన ఓ ఇంటి వద్ద కూర్చొని ఓట్ల లెక్కలేసుకుంటున్నారు.
ఇంతలోనే అక్కడికి వచ్చి కాంగ్రెస్ నేతలు చేరుకోగా.. ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇరువర్గాల మధ్య మాటలు తారస్థాయికి చేరుకోవడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు బీఆర్ఎస్ నేతలపై దాడికి దిగారు. పక్కనే ఉన్న కర్రలతో ఇష్టారీతిన చితక బాదారు. కాగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి.. బీఆర్ఎస్కు చెందిన చిట్టిరెడ్డి రత్నాకర్ రెడ్డి, గుండెబోయిన నాగయ్య, గుండె వేణు, శ్రీనివాస్ లపై దాడికి పాల్పడినట్లు బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
పరకాల స్టేషన్ ఎదుట తీవ్ర ఉద్రిక్తత
నాగారంలో ఇరువర్గాల గొడవ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీయగా.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు అక్కడి నుంచి పరకాల పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. కాంగ్రెస్ నేతలు తమపై దాడి చేశారని పేర్కొంటూ, వారిపై యాక్షన్ తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అప్పటికే ఎలక్షన్ ఈవీఎంల తరలింపులో నిమగ్నమై పోలీసులు ఉండటంతో తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. పెద్ద ఎత్తున స్టేషన్ కు చేరుకుని అక్కడే బైఠాయించారు. కాంగ్రెస్ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి రోడ్డుపైనే బైఠాయించడంతో పరకాల బస్టాండ్ సమీపంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
దాదాపు గంట పాటు ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో పరకాల పీఎస్ ఎదుట తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పోలీసు బలగాలు అక్కడకు చేరుకుని బీఆర్ఎస్ నేతలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తరువాత ట్రాఫిక్ క్లియర్ చేసి, పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడేందుకని బీఆర్ఎస్ శ్రేణుల్లో కొందరిని స్టేషన్ లోపలికి తీసుకెళ్లారు.
ఆందోళనకు దిగిన మాజీ ఎమ్మెల్యే చల్లా
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫైటింగ్ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సోమవారం సాయంత్రం సమయంలో పరకాల స్టేషన్ కు చేరుకున్నారు. అక్కడే ఆందోళన చేపట్టి తమ కార్యకర్తలపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అప్పటికే చీకటి పడగా, స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నేతల ఆందోళనతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది.
దాడి విషయాన్ని పరకాల పోలీసులు లైట్ తీసుకున్నారని, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎన్నికల కోడ్ ఉన్నందున కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు. కానీ బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. నిందితులను అరెస్టు చేసేంత వరకు పోలీస్ స్టేషన్ లోనే కూర్చుంటామని అక్కడే బైఠాయించి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.
చల్లాపై కార్యకర్తల గుస్సా
ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో పరకాల సీఐ రవిరాజు కల్పించుకుని తామంతా ఈవీఎంల తరలింపులో బిజీగా ఉన్నామని, ఈవీఎంలు వరంగల్ ఏనుమాములకు చేర వేసిన అనంతరం నిందితులను అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు. అయినా నిందితులను అరెస్ట్ చేసేంత వరకు తాము అక్కడి నుంచి కదిలేదే లేదని బీఆర్ఎస్ కార్యకర్తలు భీష్మించుకు కూర్చున్నారు.
దీంతో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.. తాను, మాజీ మంత్రి దయాకర్ రావుతో కలిసి సీపీని కలుస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో మేమంతా బీఆర్ఎస్ కోసం పనిచేస్తూ మీకోసం ఉంటే మీరు వెళ్లిపోవడమేంటని బీఆర్ఎస్ శ్రేణులు ధర్మారెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాగే వ్యవహరిస్తే బీఆర్ఎస్ కు మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. దీంతో వెనక్కి తగ్గిన చల్లా ధర్మారెడ్డి కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం పోలీసులు సర్ది చెప్పగా.. ఆందోళన తాత్కాలికంగా విరమించారు.
బీఆర్ఎస్ నేతల ఆందోళనతో దాదాపు మూడు గంటల పాటు పరకాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. కాంగ్రెస్ నేతలు, పోలీసుల తీరుపై వరంగల్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎన్ నాయకులు రెడీ అవుతున్నారు. ఈ మేరకు మంగళవారం సీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. ఓట్ల విషయంలో జరిగిన గొడవతో పరకాలలో రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమనగా.. ఈ ఘటన ఎంతవరకు దారి తీస్తుందో చూడాలి.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)