Lok Sabha elections 2024: రాహుల్ గాంధీ, ప్రియాంకలను 'అమూల్ బేబీస్' అని ఎద్దేవా చేసిన బీజేపీ సీఎం
17 April 2024, 15:06 IST
Lok Sabha elections 2024: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అమూల్ బేబీస్ అంటూ ఎద్దేవా చేశారు. అస్సాం ప్రజలు అమూల్ బేబీస్ అయిన రాహుల్, ప్రియాంకలను చూడడానికి ఎందుకు వెళ్తారని అస్సాంలో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రశ్నించారు.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ
Assam Elections: అస్సాంలో 2024 లోక్ సభ ఎన్నికల ర్యాలీలో బీజేపీ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను 'అమూల్ బేబీస్' అని అభివర్ణించారు. అస్సాం రాష్ట్ర ప్రజలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలు పాల్గొంటున్న ఎన్నికల ప్రచార సభలకు హాజరు కావడం కంటే కజిరంగా నేషనల్ పార్క్ లో ఉన్న జంతువులను చూడటానికే ఎక్కువ ఇష్టపడతారని అయన వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
అమూల్ బేబీస్..
‘‘గాంధీ కుటుంబానికి చెందిన 'అమూల్ బేబీస్'ను చూసేందుకు అసోం ప్రజలు ఎందుకు వెళ్తారు. ఆ అమూల్ బేబీస్ చూడడానికన్నా వారు.. కజిరంగాకు వెళ్లి పులులు, ఖడ్గమృగాలను చూడటానికి ఇష్టపడతారు’’ అని హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించారు. అస్సాంలోని జోర్హాట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గౌరవ్ గొగోయ్ కు మద్దతుగా ప్రియాంక గాంధీ మంగళవారం రోడ్ షో నిర్వహించిన తర్వాత అస్సాం ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రియాంక రోడ్ షో పై కామెంట్స్
‘‘గాంధీ కుటుంబాన్ని చూసి ఏం లాభం? వారు అమూల్ ప్రచారానికి సరిపోతారు. కాబట్టి వారు అమూల్ బేబీస్. అమూల్ బేబీస్ ను చూడటం కంటే కజిరంగాలో ఖడ్గమృగాలను చూడటం మంచిది’’ అని ఆయన అన్నారు. జోర్హాట్ లో ప్రియాంక వాద్రా రోడ్ షోకు కేవలం 2,000-3,000 మంది వచ్చారని నేను విన్నాను. ప్రియాంక గాంధీని చూసేందుకు ఎవరు వస్తారు? అంతకన్నా కజిరంగా కు వెళ్లి పులులు, ఖడ్గమృగాలను చూడడానికి ప్రజలు ఇష్టపడుతారు' అని సీఎం ఎద్దేవా చేశారు.
బీజేపీ పాలన దారుణం
అంతకుముందు ఏప్రిల్ 16న జోర్హాట్ లో ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు.ఈశాన్య రాష్ట్రాలకు వారి స్వంత ప్రత్యేకమైన సంస్కృతి, చారిత్రక వారసత్వం ఉందని, ఈ వారసత్వంపై బీజేపీ ప్రభుత్వం నిబంధనలు విధిస్తోందని ప్రియాంక విమర్శించారు. దీనికితోడు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ప్రజల జీవితాలను దుర్భరంగా మార్చాయన్నారు.
మూడు విడతల్లో ఎన్నికలు
అసోంలోని 14 లోక్ సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 14 స్థానాలకు గాను 11 స్థానాల్లో పోటీ చేస్తుండగా, దాని మిత్రపక్షాలైన అసోం గణపరిషత్ (ఏజీపీ) రెండు స్థానాల్లో, యూపీపీఎల్ ఒక స్థానంలో పోటీ చేస్తున్నాయి. 2014 లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అస్సాంలోని 14 స్థానాలకు గాను 7 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్, ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) చెరో మూడు స్థానాలను దక్కించుకున్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ తన సీట్ల సంఖ్యను 9కి పెంచుకోగా, కాంగ్రెస్ తన మూడు స్థానాలను నిలబెట్టుకుంది. ఏఐయూడీఎఫ్ ఒక స్థానంలో విజయం సాధించింది.