BJP Mla Candidates: ఏపీలో ఇంకా తేలని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు.. కొనసాగుతున్న కసరత్తు…
27 March 2024, 10:15 IST
- BJP Mla Candidates: ఏపీలో టీడీపీ-జనసేనతో బీజేపీకి ఎన్నికల పొత్తు కుదిరినా పోటీ చేసే అభ్యర్థుల్ని ఖరారు చేయడం మాత్రం కత్తిమీద సాములా మారింది. రోజుల తరబడి అభ్యర్థుల ఎంపికపై బీజేపీ రాష్ట్ర పార్టీతో పాటు కేంద్ర పార్టీ కసరత్తు చేస్తూనే ఉంది.
ఏపీలో కొలిక్కి రాని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక
BJP Mla Candidates: ఎన్నికల్లో బీజేపీ పోటీ చేేసే అసెంబ్లీ స్ధానాలు కొలిక్కి వచ్చినా అభ్యర్థుల ఎంపిక మాత్రం జాప్యం జరుగుతోంది. ముందుగా నిర్ణయించిన స్థానాల్లో ఒకటి రెండు స్థానాల్లో మార్పులు జరగొచ్చని ప్రచారం జరుగుతోంది. ఒకటి రెండు స్ధానాలలో అభ్యర్ధుల మార్పు తప్పదని బీజేపీ నేతల్లో ప్రచారం జరుగుతోంది.
బీజేపీ BJP తరపున అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల్లో దాదాపుగా ఖరారైన పేర్లలో ఎచ్చెర్లలో NER విద్యాసంస్ధల అధినేత నడికుడితి ఈశ్వరరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. విశాఖ నార్త్ Visakha North నియోజక వర్గానికి విష్ణుకుమార్ రాజు Vishnukumar Raju ( క్షత్రియ), పాడేరు (ఎస్టీ) రిజర్వుడు నియోజక వర్గంలో ఉమా మహేశ్వరరావు, అనపర్తిలో సోము వీర్రాజు (కాపు) Somu Veerraju, కైకలూరులో తపన చౌదరి లేదా కామినేని శ్రీనివాస్ ( కమ్మ) Kamineni Srinivas లకు టిక్కెట్ దక్కే అవకాశాలు ఉన్నాయి.
కామినేని శ్రీనివాస్‌కు 75ఏళ్ల వయసు నిబంధన అటంకంగా మారితే తపన చౌదరికి అవకాశం దక్కొచ్చు. నర్సాపురం బదులు ఏలూరు పార్లమెంటు నియోజక వర్గం కోసం బీజేపీ పట్టుబట్టిన టీడీపీ సుముఖత వ్యక్తం చేయకపోవడంతో తపన చౌదరి అవకాశం కోల్పోయారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
విజయవాడ వెస్ట్ నియోజక వర్గంలో సుజనా చౌదరి పేరు దాదాపుగా ఖరారు చేశారు. చివరి నిమిషంలో మార్పులు చేర్పులు జరిగితే తప్ప సుజనా పోటీ చేయడం ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
ఆదోనిలో బిసి-బోయ వర్గానికి చెందిన పార్ధ డెంటల్ అధినేత పార్ధసారధి, ధర్మవరంలో వరదాపురం సూరి లేదా సత్యకుమార్ యాదవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బద్వేలు ఎస్సీ రిజర్వుడు స్థానంలో పనతల సురేష్ పేరు ఉంది. గత ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేశారు. జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
మరోవైపు అనపర్తి అసెంబ్లీ నుంచి పోటీ చేయడానికి సోము వీర్రాజు విముఖత చూపుతున్నారు. దీంతో సస్పెన్స్ కొనసాగుతోంది. విజయవాడ వెస్ట్ సీటుకోసం చివరి నిమిషంలో తెరపైకి సుజనా చౌదరి పేరుతో పాటు పురిగెళ్ల రఘురామ్ పేరును తెచ్చారు. ఇద్దరిలో సుజనాకే అవకాశాలు మెండుగా ఉన్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు.
సీనియర్లకు లోక్‌సభ ఆశలు గల్లంతు….
బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో సీనియర్ల పేర్లు గల్లంతయ్యాయి. జివిఎల్ నరసింహరావు, పివిఎన్ మాధవ్, సోము వీర్రాజు, విష్ణువర్దన్ రెడ్డి, సత్యకుమార్ వంటి వారికి అవకాశం దక్కలేదు.
కొత్తపల్లి గీత, సిఎం రమేష్ వంటి వారిపై పలు అభియోగాలు ఉన్నా ఎంపీ టిక్కెట్లు దక్కాయి. నర్సాపురంనుంచి రఘురామకృష్ణంరాజుకి భంగపాటు తప్పలేదు. ఢిల్లీలో బీజేపీ కార్యాలయం చుట్టూ తిరిగినా రఘురామకు కనీసం అపాయింట్ మెంట్ దొరకలేదని ప్రచారం జరుగుతోంది.
జివిఎల్, పివిఎన్ మాధవ్, సోము వీర్రాజు, సత్యకుమార్, విష్ణు వర్దన్ రెడ్డి లాంటి సీనియర్లకి టిక్కెట్లు దక్కలేదు. కడప జిల్లాకు చెందిన సిఎం రమేష్‌కు అనకాపల్లి సీటు కేటాయించడంపై సీనియర్లలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
రాజమండ్రి టిక్కెట్ సోము వీర్రాజు ఆశించినా అది పురందేశ్వరికి దక్కింది. విశాఖపట్నం నుంచి పోటీ చేయాలని భావించినా దానిని వదులుకోడానికి టీడీపీ సుముఖంగా లేకపోవడంతో ఆమె రాజమండ్రి తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరి సిఎంగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డికి రాజంపేట టిక్కెట్ లభించింది. గత ఏడాది పార్టీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డికి రాజంపేట సీటును కేటాయించారు. దీంతో రాజంపేట సీటుపై ఆశలు పెట్టుకున్న సీనియర్ నేత సత్యకుమార్‌కు నిరాశ తప్పలేదు. తిరుపతి లోక్‌సభ టిక్కెట్‌ను గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ దక్కించుకున్నారు.