తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Vijayashanti : బీజేపీకి బిగ్ షాక్, కాంగ్రెస్ లోకి విజయశాంతి!

Vijayashanti : బీజేపీకి బిగ్ షాక్, కాంగ్రెస్ లోకి విజయశాంతి!

11 November 2023, 16:56 IST

google News
    • Vijayashanti : మాజీ ఎంపీ విజయశాంతి బీజేపీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఆమె త్వరలో కాంగ్రెస్ లో చేరనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత మల్లు రవి ప్రకటించారు.
విజయశాంతి
విజయశాంతి

విజయశాంతి

Vijayashanti : తెలంగాణలో బీజేపీ భారీ షాక్ తగలనుంది. బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ లో చేరనున్నారు. విజయశాంతి కాంగ్రెస్ లోకి వస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి ప్రకటించారు. రేపో, మాపో విజయశాంతి కాంగ్రెస్ చేరతారన్నారు. గత కొంత కాలంగా విజయశాంతి బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా కార్యక్రమాలకు కూడా ఆమె హాజరకావడంలేదు. దీంతో బీజేపీ అధిష్టానంపై ఆమె అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె పార్టీ మారతారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుండగా... తాజాగా మల్లు రవి ప్రకటనతో ఇది ఖరారైంది. అయితే దీనిపై విజయశాంతి ఇంకా స్పందించలేదు.

సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోకి వచ్చిన విజయశాంతి మొదట్లో బీజేపీకి మద్దతుదారుగా ఉన్నారు. ఆ తర్వాత బీజేపీకి స్టార్‌ క్యాంపెయినర్‌గా వ్యవహరించారు. మొదట్లో పరోక్ష రాజకీయాల్లో కీలకంగా ఉన్న విజయశాంతి.. 1998లో బీజేపీలో చేరారు. 1999 లోక్ సభ ఎన్నికల్లో కడప లోక్‌సభ స్థానం నుంచి సోనియా గాంధీపై పోటీ చేయాలనుకున్నారు విజయశాంతి. అయితే సోనియా గాంధీ బళ్లారి నుంచి పోటీ చేయడంతో... విజయశాంతి పోటీ నుంచి తప్పుకున్నారు.

2009 వరకు బీజేపీలో ఉన్న విజయశాంతి... ఆ తర్వాత తల్లీ తెలంగాణ పేరుతో సొంత పార్టీని పెట్టారు. ఆ తర్వాత కేసీఆర్ పిలుపు మేరకు ఆ పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. 2009లో మెదక్‌ లోక్ సభ స్థానానికి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం కేసీఆర్‌తో విభేదాల రావడంతో 2014లో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్‌ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌లో స్టార్‌ క్యాంపెయినర్‌, ఎన్నికల ప్రచార కమిటీ సలహాదారుగా పనిచేశారు. అయితే 2020లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి మళ్లీ బీజేపీలో చేరారు. ఆమె మళ్లీ కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలుస్తోంది.

తదుపరి వ్యాసం