ECI Ban on Ads: ఎన్నికల ప్రకటనలపై ఈసీ కొరడా..
15 November 2023, 9:29 IST
- ECI Ban on Ads: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించిన రాజకీయ పార్టీల ఎలక్ట్రానిక్ మీడియా ప్రకటనలపై ఎన్నికల సంఘం కొరడా జుళిపించింది. పలు పార్టీల ప్రకటనలకు ఇచ్చిన అనుమతులు రద్దు చేసింది.
సీఈవో వికాస్ రాజ్
ECI Ban on Ads: నిబంధనలు ఉల్లంఘించిన పలు రాజకీయ పార్టీల వీడియో ప్రకటనలకు జారీ చేసిన అనుమతులు రద్దు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
అనుమతులు రద్దు చేసిన ప్రకటనల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన 6 వీడియోలు, బీజేపీ రూపొందించిన 5 వీడియోలు, బీఆర్‌ఎస్ తయారు చేసిన 4 వీడియోలను మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) నిబంధనలకు విరుద్ధంగా రూపొందించారని, అనుమతులు రాకముందే సోషల్ మీడియాలో ప్రచారం చేశారని గుర్తించారు.
కాంగ్రెస్ పార్టీ రూపొందించిన పలు ప్రకటనలపై బిఆర్‌ఎస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీంతో ప్రచారంలో ఉన్న ప్రకటనలను కమిటీ మరోసారి పరిశీలించి అభ్యంతరకరంగా ఉన్న ప్రకటనలకు జారీ చేసిన అనుమతులు రద్దు చేశారు. తక్షణమే టెలికాస్టింగ్ నిలిపివేయాలని సీఈవో వికాస్‌రాజ్ ఆదేశించారు.
ఈసీ నిషేధించిన ప్రకటనలను ఆయా చానెళ్లు వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్‌పై, బీఆర్‌ఎస్‌పై అభ్యంతరకరంగా ప్రకటనలు రూపొదించారంటూ బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి సోమవారం ఫిర్యాదు చేసింది. దీంతో ప్రకటనలు పరిశీలించిన ఎన్నికల సంఘం వాటిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ఎన్నికల ప్రకటనల వీడియోలపై అభ్యంతరం చెబుతూ బీఆర్‌ఎస్ ప్రధానకార్యదర్శి భరత్‌కుమార్ నేతృత్వంలో పార్టీ లీగల్‌సెల్ బృందం సోమవారం సీఈవో వికాస్‌రాజ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) నిబంధనలకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ఎన్నికల ప్రకటనలను టీవీ చానళ్లలో ప్రసారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.
ఎంసీఎంసీకి ఒకటి చూపించి, టీవీలలో ప్రసారం అయ్యేవి వేరొకటి అని ఆరోపించారు. గతంలో ఫిర్యాదు చేసినప్పుడు సదరు ప్రకటనలను నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చిందని, అవి అమలు కావడవంలేదని తెలిపింది. టీవీ చానళ్లలో ఇంకా కొనసాగుతున్నాయని ఫిర్యాదు చేయడంతో ఈసీ అన్ని రాజకీయ ప్రకటనలను మరోమారు సమీక్షించింది. ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తున్న ప్రకటనల్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రకటన తర్వాత అమలులోకి వచ్చిన నిబంధనల ప్రకారం ఆయా రాజకీయ పార్టీలు ప్రచారం చేసుకోవడానికి రాష్ట్ర స్థాయి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అనుమతి మంజూరు చేస్తుందని, వాటిని యథాతథంగా ఉపయోగించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
అయితే రాజకీయ పార్టీలు అనుమతి పొందని ప్రకటనలను యూట్యూబ్‌తో పాటు ఇతర వేదికలలో కూడా ప్రచారం చేస్తున్నట్లు ఎన్నికల సంఘం దృష్టికి వచ్చిందని తెలిపారు. వీటిపై ఎన్నికల సంఘం ఈనెల 8, 9, 10 తేదీల్లో వివిధ రాజకీయ పార్టీలతో మూడు సమావేశాలు నిర్వహించిందని, ఈ సమావేశాల్లో ప్రచార, ప్రచార అనుమతి (ధ్రువీకరణ/ సర్టిఫికేషన్) పొందడానికి మార్గదర్శకాలను క్షుణ్ణంగా వివరించామన్నారు.
అనుమతుల్లేని ప్రకటనల ద్వారా తలెత్తే సమస్యలను కూడా తెలిపామన్నారు. ఎన్నికల సంఘం సూచనలను, మార్గదర్శకాలను అనుసరిస్తామని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు హామీ ఇచ్చారని గుర్తు చేశారు.రాజకీయ పార్టీలు విడుదల చేసే ప్రకటనలను ప్రసారం చేయడానికి ముందు అనుమతి పొందిన ప్రకటనలేనా కాదా అనేది మీడియా సరిచూసుకోవాలని సీఈఓ సూచించారు.
ఎన్నికల నియమావళి ప్రకారం అనుమతి పొందని అంశాల ప్రసారాలను నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తామని వికాస్‌రాజ్ తెలిపారు. రాజకీయ పార్టీలు విడుదల చేసే ప్రకటనలకు అనుమతి ధ్రువీకరణ ఇవ్వడం అనేది నిరంతర ప్రక్రియని వివరించారు. ఏ రాజకీయ పార్టీ అయినా, అభ్యర్థి అయినా రాష్ట్ర, జిల్లా స్థాయిలో అనుమతి ధ్రువీకరణ కోసం మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీకి ప్రకటనలను పంపుకోవచ్చునని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఈసీ అనుమతి నిరాకరించిన ప్రకటనల్లో బీజేపీ డబుల్ బెడ్రూం, దొంగ చేతికి తాళం, రైతు, నేతి బీరకాయ, పేనుకు పెత్తనం వంటి ప్రకటనలు ఉన్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ రూపొందించిన దేఖ్ లేంగే (తెలుగు పాట), మొదటి ఓటు ఎవరికి (వీడియో ప్రకటన), రైతుల అండదండ- కేసీఆర్ (వీడియో ప్రకటన), కల్యాణలక్ష్మి ప్రకటనలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్న పలు ప్రకటనలపై ఆంక్షలు విధించారు.