KCR Election Campaign : రైతుబంధు కావాలా..? రాబందు కాంగ్రెస్ కావాలా...? - కేసీఆర్
17 November 2023, 11:11 IST
- Telangana Assembly Election 2023: ఈ ఎన్నికల్లో ఆలోచించి ప్రజలు ఓట్లు వేయాలని కోరారు కేసీఆర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ సభలో మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ ఏం చేసిందో మీ కళ్ల ముందే ఉందన్నారు. ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వొద్దని... మరోసారి బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
Telangana Assembly Election 2023: ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరింత స్పీడ్ పెంచారు. బుధవారం ఒకే రోజు నాలుగు సభలకు హాజరైన ఆయన… ఇవాళ కూడా నాలుగు సభలు ఉన్నాయి. ఇందులో భాగంగా తొలుత ఆదిలాబాద్ ప్రజాశీర్వాద సభకు హాజరయ్యారు కేసీఆర్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన…. బీఆర్ఎస్ చరిత్ర ఎంటో ప్రజలకు తెలుసని… అలాంటి పార్టీకే పట్టం కట్టాలని కోరారు. రైతుబంధు కావాలా…? రాబంధు కాంగ్రెస్ కావాలా అనేది ఆలోచించాలని అన్నారు.
ఆదిలాబాద్ లో సీఎం కేసీఆర్ ప్రసంగం:
- ఆదిలాబాద్ లో చైతన్యం ఎక్కువగా ఉంటుంది. ఎన్నికలు వస్తుంటాయి. పోతూ ఉంటాయి. ఓటు అనేది వజ్రాయుధం. ఆ ఓటు అనేది ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందుకే అషామాషీగా తీసుకొని ఓటు వేయవద్దు. మన గురించి మంచి ఆలోచించే పార్టీకే ఓటేయ్యాలి.
- ఎన్నికల్లో పార్టీ తరపున అభ్యర్థులు ఉంటారు. కేవలం అభ్యర్థి గుణగనాలు మాత్రమే చూడకుండా… ఆ అభ్యర్థి వెనక ఉన్న పార్టీ విధానమేంటి..? ప్రజల పట్ల వారి దృక్పథం ఏంటనేది చూడాలి…?
- బీఆర్ఎస్ పార్టీ చరిత్ర ఎంటో మీకు తెలుసు. గత పదేళ్లుగా మనమే అధికారంలోకి ఉన్నాం. గతంలో ఉన్న కరెంట్, రైతాంగం, ఆత్మహత్యలు వంటి అనేక సమస్యలు ఉండేవి. వాటిపై లోతుగా మథనం చేసి ముందుకెళ్లాం. సంక్షేమాన్ని ప్రధానంగా తీసుకున్నాం. పెన్షన్ల పెంపుతో పాటు అనేక కార్యక్రమాలను చేపట్టాం.
- రైతుల గురించి ఎక్కడా లేని విధంగా కార్యక్రమాలు తీసుకున్నాం. నీటి తీరువాలు లేకుండా చేశాం. బకాయిలన్నింటిని బీఆర్ఎస్ సర్కార్ రద్దు చేసింది. ఆదిలాబాద్ లో కూడా చేశాం. వ్యవసాయ స్థిరీకరణ కోసం చర్యలు తీసుకున్నాం. ఉచిత కరెంట్ తో పాటు రైతుబంధును ఇస్తున్నాం. రైతు చనిపోతే వారంలోపే బీమాను కూడా అందజేస్తున్నాం.
- తెలంగాణ గురించి ప్రతి విషయం తెలుసు కాబట్టి నిర్ణయాలు తీసుకున్నాం. కానీ ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... రైతుబంధు ఇచ్చి దుబారా చేస్తున్నాడు అంటూ మాట్లాడుతున్నాడు. ఈ విషయంపై మీరు ఆలోచించాలి. రైతుబంధు ఉండాలంటే ఇక్కడ జోగు రామన్న గెలవాలి. రైతుబంధును కూడా పెంచబోతున్నాం. పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ.... 24 గంటల కరెంట్ వేస్ట్ అని.. 3 గంటల కరెంట్ చాలు అని చెబుతున్నాడు. 24 గంటల కరెంట్ ఉండాలంటే జోగు రామన్ననే గెలిపించాలి.
- యుద్ధం చేసే వాళ్లకే కత్తిని ఇవ్వాలి. అలాంటి పార్టీలకే అవకాశం ఇవ్వాలి.
- రైతుల భూములు ఆగం కావొద్దని... ధరణిని తీసుకువచ్చాం. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తామని చెబుతున్నారు. యాజమాన్యపు హక్కులను పూర్తిగా మీకే ఇచ్చిన బీఆర్ఎస్ ను వదులుకుంటారా అనేది ఆలోంచించాలి. రాహుల్ గాంధీ కూడా ధరణిపై మాట్లాడుతుండు. ధరణిని తీసివేస్తే రైతుబంధు డబ్బులు ఎలా వస్తాయి..? రైతుబీమాతో పాటు ధాన్యం కొనుగోళ్లు డబ్బులు కూడా ధరణి ద్వారానే వస్తున్నాయి. మళ్లీ పంచాయితీలు తీసుకువచ్చేలా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. ధరణి తీసివస్తే మళ్లీ లంచాలు ఇచ్చే పరిస్థితి వస్తుంది.
- 10 హెచ్ పీ మోటర్లు అని మాట్లాడుతున్నారు. మరీ అవి ఎవరు కొనివ్వాలి...? అందుకే రైతన్నలు ఆలోచించాలి. 15 ఏండ్లు కాంగ్రెస్ కష్టపెడితే కష్టపడి తెలంగాణను సాధించా. ఇప్పుడిప్పుడే దరికి తీసుకువస్తున్నాం. మళ్లీ వీళ్లు వస్తే వెనకబడిపోతాం. వీటిపై ఆలోచన చేసి... గ్రామాల్లో కూడా చర్చ పెట్టండి. కరెంట్ కావాలా..? కాంగ్రెస్ కావాలా...? రైతుబంధు కావాలా లేక రాబంధు కాంగ్రెస్ కావాలా..? అనేది ఆలోచించాలి.
-తెలంగాణకు బీజేపీ ఏం చేసింది..? 157 కాలేజీలు ఏర్పాటు చేస్తే తెలంగాణకు కనీసం ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదు. నవోదయ స్కూలును కూడా కేటాయించలేదు. అలాంటి పార్టీలకు ఒక్క ఓటు కూడా వేయవద్దు. బీజేపీకి ఓటు వేస్తే వేస్ట్ అవుతుంది.
- చనాఖా కొరటా కాలువను తీసుకువచ్చిన వ్యక్తి జోగు రామన్న. రాబోయే రోజుల్లోనే నీళ్లు వస్తాయి. జోగు రామన్నను మంచి మెజార్టీతో గెలిపించాలి. ఇక్కడి ప్రజల కోసం ఎన్నో చేశాడు. మరింత అభివృద్ధి కావాలంటే జోగు రామన్నతోనే అవుతుంది.
-హిందూ, ముస్లింలు అనేది తేడా లేకుండా ఇక్కడ బ్రతుకుతున్నాం. ఇప్పుడు కూడా కలిసిమెలిసి ఉండాలి. మతపిచ్చి ఉన్న బీజేపీకి బుద్ధి చెప్పాలి.
-రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే హవా. కేంద్రంలో కీలకం అవుతాం. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కు అండగా నిలవాలి.