గాజు పగిలితే సైకిల్ పంచరవుద్ది.. పొత్తు ధర్మం పాటిస్తేనే గమ్యం చేరువవుద్ది
20 March 2024, 14:46 IST
- ‘పొత్తు పెట్టుకోవడంతోనే సరిపోదు. ఆ పొత్తు ఫలప్రదం కావడానికి కూడా కృషి చేయాలి. పొత్తు ధర్మం పాటించకుండా ఎవరికి వారే యమునాతీరే అన్నట్టు వ్యవహరిస్తే మొదటికే మోసపోవడం ఖాయం..’ - ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ రీసెర్చర్ ఐవీ మురళీకృష్ణ విశ్లేషణాత్మక వ్యాసం
పల్నాడులో జరిగిన సభలో ప్రధాన మంత్రి మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్
రాజకీయాల్లో ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా ఉండడానికి పొత్తులు పెట్టుకోవడం సర్వసాధారణం. భాగస్వామ్య పార్టీల మధ్య పొత్తు లక్ష్యం నెరవేరాలంటే ఒకరిపై ఒకరికి విశ్వాసం కలిగేలా వ్యవహరించాలి. క్షేత్రస్థాయిలోని నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా సాగేలా అగ్రనాయకత్వం చర్యలు తీసుకోవాలి. పొత్తు పెట్టుకోవడంతోనే సరిపోదు. ఆ పొత్తు ఫలప్రదం కావడానికి కూడా కృషి చేయాలి. పొత్తు ధర్మం పాటించకుండా ఎవరికి వారే యమునాతీరే అన్నట్టు వ్యవహరిస్తే మొదటికే మోసపోవడం ఖాయం.
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ సర్కార్‌ను గద్దె దింపాలనే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ చొరవ తీసుకొని జనసేన, టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కోసం కృషి చేసి విజయవంతం అయ్యారు. చంద్రబాబు నాయుడు జైలుపాలు కావడంతో అనిశ్చితి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న టీడీపీకి జనసేనాని పొత్తు ప్రకటన ఊపిరి పోసింది. మూడు పార్టీల మధ్య పొత్తుకు కీలకపాత్ర పోషించిన పవన్ కల్యాణ్ కూటమిలో ఇబ్బందులు కలకుండా ఉండేందుకు త్యాగాలు కూడా చేశారు. చివరి దశలో కూడా మూడు అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానాన్ని జనసేన వదులుకుంది.
పొత్తులో భాగంగా పవన్ కల్యాణ్ 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీకి సిద్ధమవడంతో ఆయన సొంత పార్టీ నుండి, కాపు సామాజిక వర్గం నుండి పలు విమర్శలు ఎదుర్కొన్నారు. కాపు సామాజిక వర్గం పెద్దలమంటూ చెప్పుకునే నేతలు కూడా పవన్ కాపులకు అన్యాయం చేశారన్నా ఆయన సహనంతోనే ఉన్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న వైఎస్‌ఆర్‌సీపీ కూడా పవన్ కల్యాణ్ ప్యాకేజీ కోసం కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబుకు తాకట్టుపెట్టి తక్కువ స్థానాలు తీసుకున్నారని వ్యాఖ్యానిస్తూ పొత్తును విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తోంది.
బలహీనతగా భావిస్తున్నారా?
ఎంత ఒత్తిడి, విమర్శలొచ్చినా జగన్మోహన్‌రెడ్డి ఓటమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతుంటే కూటమిలో కీలక పాత్ర పోషించాల్సిన టీడీపీ మాత్రం దీన్ని బలహీనంగా తీసుకుంటోంది. జనసేన, బీజేపీ ఓటు బ్యాంకు తమకు బదిలీ కావాలని కోరుకుంటున్న టీడీపీ అదే సమయమంలో తమ ఓటు బ్యాంకు ఆ రెండు పార్టీలకు కూడా బదిలీ అయ్యేలా కృషి చేయడం లేదు.
పొత్తుతో అధికారం ఖాయమనే ధీమా మూడు పార్టీలలో ఉన్నా, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య సీట్ల పంపకంపై అవగాహన వచ్చినా నియోజకవర్గాల్లో సఖ్యత కుదరడం లేదు. ప్రధానంగా జనసేన, బీజేపీ పోటీ చేసే నియోజకవర్గాల్లో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో సహకరించడం లేదు. తెలుగుదేశం అధిష్టానం వారిని హెడ్‌క్వార్టర్స్‌కు పిలిపించి మాట్లాడుతున్నా క్షేత్రస్థాయిల్లో మాత్రం అసంతృప్తులు కొనసాగుతునే ఉన్నాయి.
చర్చల పేరుతో కంటితుడుపు చర్యలు తీసుకునే బదులు సీనియర్ నేతలతో ఒక కమిటీ వేసి ఆ నేతలను అనిశ్చితి ఉన్న నియోజకవర్గాలకు పంపి అందరితో చర్చించి పార్టీ ఓటు బ్యాంకులోని చివరి ఓటు సైతం మిత్రపక్షాలకు పడేటట్టు కృషి చేయాలి.
నలభై సంవత్సరాల రాజకీయ అనుభవమున్న చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశానికి పొత్తు ధర్మాన్ని విస్మరించిన చరిత్ర ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకొని మహాకూటమిని ఏర్పాటు చేసిన టీడీపీ అతి తెలివిగా వ్యవహరించడంతో కూటమి ఓడిపోయింది.
మిత్రపక్షాలు పోటీ చేసిన స్థానాల్లో తెలుగుదేశం శ్రేణులు సహకరించకుండా వెన్నుపోటు పొడవడంతో టీఆర్‌ఎస్, కమ్యూనిస్టు అభ్యర్థులు ఓడిపోయారు. పొత్తు పెట్టుకున్న పార్టీలకు తెలుగుదేశం ఓట్లు సంపూర్ణంగా బదిలీ కాకపోవడంతో మహాకూటమి అపజయాన్ని మూటగట్టుకుంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే తిరిగి అవే ఘటనలు పునరావృత్తమయినా ఆశ్చర్యం లేదు.
ఓట్ల బదిలీ జరిగితేనే
రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం అగ్రనాయకత్వంతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు గుర్తుంచుకోవాల్సిన ప్రధానాంశం పొత్తులో భాగంగా పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరిగితేనే కూటమి లక్ష్యం ఫలప్రదం అవుతుంది. టీడీపీ ఓట్లు 30 నుండి 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన, బీజేపీ పార్టీలకు బదిలీ కావాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో దాదాపు 140 అసెంబ్లీ స్థానాల్లో ఈ రెండు పార్టీల ఓట్లు టీడీపీకి పడాల్సిన ఆవశ్యకత ఉంది. పొత్తులో భాగస్వాములైన జనసేన, బీజేపీ పార్టీలకు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కనీసం 7 నుండి 10 శాతం ఓట్లున్నాయి. అదే ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కేవలం జనసేనకే 15 నుండి 25 శాతం ఓటు బ్యాంకుంది. అధికారం కోసం కలలు కంటున్న తెలుగుదేశం రాబోయే ఎన్నికల్లో జనసేన, బీజేపీ కింగ్‌మేకర్లనే వాస్తవాన్ని గుర్తించాలి.
గత ఫలితాలు గమనించారా?
2014, 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను శాస్త్రీయంగా పరిశీలిస్తే పొత్తు ధర్మం పాటించడం ఎంత అవసరమో తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన టీడీపీ, బీజేపీ కూటమికి జనసేన మద్దతిచ్చినప్పుడు వచ్చిన ఓట్ల శాతం 2019లో మూడు పార్టీలు విడివిడిగా బరిలోకి దిగినప్పుడు వచ్చిన ఓట్ల శాతాలను కలిపితే దాదాపు సమానం. 2014లో టీడీపీ, బీజేపీ కూటమికి 46.63 శాతం వచ్చాయి. 2019లో టీడీపీ, బీజేపీ, జనసేన విడివిడిగా పోటీ చేయగా టీడీపీకి 39.26 శాతం, జనసేనకు 5.15 శాతం, బీజేపీకి 0.84 శాతం ఓట్లు వచ్చాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే పొత్తులో భాగంగా మూడు పార్టీల మధ్య ఓట్ల బదిలీ ఎంత కీలకమో తెలుస్తోంది. ఓట్ల బదిలీలో ప్రధానంగా టీడీపీ చొరవ తీసుకోకపోతే మూడు పార్టీలు నష్ట పోవడం ఖాయం.
తారతమ్యాలు ఉంటే అంతే సంగతులు
పొత్తు పెట్టుకున్నప్పుడు చిన్న పెద్ద అనే తారతమ్యాలు ఉండకూడదు. ప్రతిష్టకు పోకూడదు. ఎవరితోనైనా చర్చించాలన్నా, సయోధ్య కుదుర్చుకోవాలన్నా స్థాయి విభేదాలుండకూడదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో నక్సలైట్లతో చర్చించినప్పుడు, కేంద్ర ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల ఉగ్రవాదులతో చర్చలు జరిపినప్పుడు వారికి సమప్రాధాన్యతిచ్చిన అంశాన్ని ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. క్రీడల్లో ఉన్నట్టు పొత్తుల్లో కూడా నియమ నిబంధనలుంటాయి. వీటిని ఏ పక్షం అతిక్రమించినా నష్ట పోవడం ఖాయం.
తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు సహనంతో ఉండాల్సిన అవసరం ఉంది. పొత్తులో భాగంగా అవకాశం కోల్పోయిన టీడీపీ నేతలు నియోజకవర్గాల్లో కార్యకర్తలతో నిరసనలు చేయిస్తూ ప్రోత్సహిస్తున్నారు. జనసేన, బీజేపీ పోటీ చేస్తున్న చోట్ల టీడీపీ వర్గీయుల నిరసనలతో పోలిస్తే టీడీపీ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో జనసేన, బీజేపీ వారు చేస్తున్న నిరసనలు చాలా తక్కువగా ఉన్నాయని టీడీపీ అగ్రనాయకత్వం గ్రహించాలి. పొత్తులో సమాన మర్యాద, గౌరవం ఇవ్వకపోతే ప్రత్యర్థులకు అస్త్రాలు అందించడమే.
పొత్తు ధర్మం విస్మరిస్తే ఎలా ఉంటుందో ఇటీవల జరిగిన ఘటనలనే ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. పొత్తు ఖాయమయ్యాక చంద్రబాబు ఏకపక్షంగా రెండు స్థానాల్లో అభ్యర్థులను నియమించడంతో పార్టీలో వచ్చిన ఒత్తిడితో పవన్ కల్యాణ్ కూడా జనసేన పోటీ చేసే రెండు స్థానాలను ప్రకటించాల్సి వచ్చింది. కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు అని టీడీపీ యువ నేత నారా లోకేశ్ ప్రకటించినా పవన్ కల్యాణ్ ఎంతో సహనంతో వ్యవహరించి కూటమిలో విభేదాలు బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. ఈ అనుభవాలతో గుణపాఠాలు నేర్వాల్సిన తెలుగుదేశం పట్టనట్టు వ్యవహరిస్తే అందరూ నష్ట పోవాల్సి వస్తుంది.
రాజమండ్రి రూరల్ టికెట్ ఆశించిన జనసేన నేత కందుల దుర్గేష్ జనసేనాని పవన్ నిర్ణయానికి కట్టుబడి రాజమండ్రి రూరల్ బదులు నిడదవోలు నుండి పోటీకి సిద్ధమయ్యారు. నిడదవోలులో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు జనసేన అభ్యర్థి దుర్గేష్ విజయానికి సంపూర్ణంగా సహకరిస్తానని, ఇక్కడ జనసేన గెలుపు తన గెలుపే అని ప్రకటించారు. ఈ రెండు ఉదాహరణలు పొత్తు ధర్మానికి ఆదర్శంగా నిలిచాయి. దీన్ని కూటమిలోని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. టికెట్ ఆశించి భంపగడ్డ నేతలు ప్రతిపదాన్ని ఆచితూచి మాట్లాడకపోతే ప్రత్యర్థులకు అవకాశం కల్పించినట్టే అని కూటమిలోని పార్టీ నేతలు గ్రహించాలి.
అద్దాల మేడలో ఉన్న టీడీపీ పొత్తు ధర్మం పాటించడంలో చొరవ తీసుకోకుండా రాళ్లు వేయించుకోకూడదు. పెద్ద పార్టీ అయిన తెలుగుదేశం పెద్దన్న పాత్ర పోషిస్తూ మరింత మందిని కలుపుకుపోతూ కూటమిని విస్తృతపర్చేందుకు యత్నించాలి. చేతులు కాలక ఆకులు పట్టుకున్నట్టు కాకుండా కూటమిలో పార్టీల మధ్య సమాచారం లోపం లేకుండా ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ సమస్యలను మొగ్గలోనే తుంచేస్తే మంచిది. పొత్తులో పెద్దన్న పాత్ర పోషించే వారు ఎక్కడ నెగ్గాలో అని కాకుండా ఎక్కడ తగ్గాలో తెలుసుకుంటే పొత్తులు ఫలప్రదం అవుతాయి.
- ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,
రీసెర్చర్, పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ,
Email: peoplespulse.hyd@gmail.com
(డిస్‌క్లెయిమర్: వ్యాసంలో తెలియపరిచిన అభిప్రాయాలు, విశ్లేషణలు రచయిత వ్యక్తిగతం. హిందుస్తాన్ టైమ్స్ వి కావు.)