East Godavari Result: తూర్పు గోదావరిలో టీడీపీ కూటమి హవా, గెలుపు దిశగా ఎన్డీఏ అభ్యర్థులు
04 June 2024, 10:41 IST
- East Godavari Result: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గోదావరి జిల్లాలో టీడీపీ కూటమి హవా కొనసాగుతోంది. ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీ కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలో దూసుకు వెళుతున్న టీడీపీ, జనసేన అభ్యర్థులు
East Godavari Result: గోదావరి జిల్లాలో టీడీపీ కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యతలో ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న మొత్తం 34 స్థానాల్లో కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. తూర్పు గోదావరిలో 12 స‌్థానాల్లో టీడీపీ, ఐదు స్థానాల్లో జనసేన, రెండు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో కూడా ఇదే రకమైన పరిస్థితులు ఉన్నాయి.
రాష్ట్రంలో అత్యధిక స్థానాలున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ కూటమి హవా కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్, అలాగే మొదటి రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపులో టీడీపీ కూటమి ముందంజలో ఉంది. అధికార వైసీపీకి ఇది పెద్ద నష్టమేనని చెప్పాలి.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 19 స్థానాల్లో 17 స్థానాల్లో టీడీపీ కూటమి ఆధిక్యంలో ఉంది. కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం, తుని, పత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం, అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు, కొత్తపేట, పి.గన్నవరం, రామచంద్రాపురం, మండపేట, అనపర్తి, రాజమండ్రి సిటీ, రాజమండి రూరల్, రాజానగరం, రంపచోడవరం నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 17 స్థానాల్లో టీడీపీ కూటమి ఆధిక్యంలో ఉండగా, అనపర్తి, రంపచోడవరం నియోజకవర్గాల్లో వైసీపీ ముందంజలో ఉంది.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న మూడు లోక్‌సభ స్థానాల్లో కూడా కూటమి ముందంజలో ఉంది. కాకినాడ, అమలాపురం, రాజమండ్రిలో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాకినాడలో జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, అమలాపురంలో టీడీపీ అభ్యర్థి గంటి హరీష్, రాజమండ్రిలో బిజెపి అభ్యర్థి పురందేశ్వరి ముందంజలో ఉన్నారు.
ఈ జిల్లాల్లో గత ఎన్నికల్లో 19 అసెంబ్లీ స్థానాలకు గానూ వైసీపీ 14 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. టీడీపీ నాలుగు స్థానాలను గెలవగా, జనసేన ఒక్క స్థానంలో గెలిచింది. టీడీపీ తరపున పెద్దాపురంలో అప్పటి హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మండపేటలో వేగళ్ల జోగేశ్వరరావు, రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి భవాని, రాజమండ్రి రూరల్ బుచ్చయ్య చౌదరి గెలిచారు. ఈసారి ఆ స్థానాలతో పాటు కాకినాడ సిటీ, తుని, జగ్గంపేట, పత్తిపాడు, కొత్తపేట, రామచంద్రాపురం, ముమ్మిడివరం, అమలాపురం స్థానాలను గెలుచుకునేందుకు సిద్ధంగా ఉంది.
జనసేన రాజోలులో గెలిచింది. ఈసారి ఆ స్థానంతో పాటు పిఠాపురం, కాకినాడ రూరల్, రాజానగరం, పి.గన్నవరంలో కూడా గెలిచేందుకు సిద్ధంగా ఉంది. అలాగే గత ఎన్నికల్లో 14 స్థానాలు గెలుచుకున్న వైసీపీ, ఈసారి అనపర్తి, రంపచోడవరం రెండు స్థానాల్లోనే ఆధిక్యత కొనసాగుతుంది.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)