తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ceo Ap Meena: నాలుగు దశల్లో దేశంలోనే అత్యధికం.. ఏపీలో82శాతం పోలింగ్‌ నమోదు.. పట్టణ ప్రాంతాల్లో పెరిగిన ఓటింగ్

CEO AP Meena: నాలుగు దశల్లో దేశంలోనే అత్యధికం.. ఏపీలో82శాతం పోలింగ్‌ నమోదు.. పట్టణ ప్రాంతాల్లో పెరిగిన ఓటింగ్

Sarath chandra.B HT Telugu

15 May 2024, 14:17 IST

google News
    • CEO AP Meena: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌‌లో ఆంధ్రప్రదేశ్‌ కొత్త రికార్డు సృష్టించింది. దీంతో నాలుగు దశల్లో  దేశంలోనే అత్యధికంగా ఏపీలో పోలింగ్ నమోదైంది. 
దేశంలోనే అత్యధికంగా ఏపీలో పోలింగ్, 82శాతం పోలింగ్ నమోదు
దేశంలోనే అత్యధికంగా ఏపీలో పోలింగ్, 82శాతం పోలింగ్ నమోదు (Photo Source DD News Andhra )

దేశంలోనే అత్యధికంగా ఏపీలో పోలింగ్, 82శాతం పోలింగ్ నమోదు

CEO AP Meena: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రికార్డు నమోదైంది. నాలుగుదశల పోలింగ్‌లో దేశంలోనే అత్యధికంగా పోలింగ్ నమోదైంది. ఏపీలో మొత్తం 4,13,33,702 మంది ఓటర్లు ఉండగా, వారిలో  3,33,40,560మంది 25 పార్లమెంటు నియోజక వర్గాలకు ఓటు వేసినట్టు చెప్పారు. 175 అసెంబ్లీ నియోజక వర్గాలకు  3,33,40,333 ఓట్లు పోలైనట్టు సీఈఓ ప్రకటించారు. 

పార్లమెంటు నియోజక వర్గాలలో 227 ఓట్లు ఎక్కువ వచ్చాయని, వారు అసెంబ్లీకి ఓటు వేయలేదన్నారు. ఈవిఎంలలో జరిగిన  పోలింగ్‌లో మొత్తం 80.66 పోలింగ్ జరిగిందన్నారు.

రాష్ట్రంలో  పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఎన్నికల విధుల్లో ఉన్న  4.44లక్షల  ఓట్లు పోలయ్యాయని, వీరితో వృ ద్ధులు, వికలాంగులు, హోమ్‌ ఓటింగ్‌ వేసిన వారిని కలిపితే మొత్తం 4.97లక్షల మంది ఓటు వేశారని చెప్పారు.  ఈవిఎంలో ఓటు వేసిన వారితో కలిపితే మొత్తం ఏపీలో 81.81 శాతం పోలింగ్ జరిగిందని చెప్పారు. దాదాపుగా 82శాతం పోలింగ్‌ నమోదైందని వివరించారు. దేశంలో జరిగిన నాలుగు దశల్లోనే అత్యధికంగా ఏపీలో పోలింగ్ జరిగిందన్నారు. 

2019లో పోలిస్తే  పోస్టల్‌ బ్యాలెట్లు కూడా రెట్టింపు అయ్యాయని చెప్పారు.గతంలో 56వేల పోస్టల్ బ్యాలెట్లు రిజెక్ట్ అయ్యాయని ఈసారి అలా జరగకుండా చూశామన్నారు.

ఉదయం నుంచి ఉత్సాహంగా పోలింగ్…

రాష్ట్రంలో జరిగిన పోలింగ్‌లో  పెద్ద సంఖ్యలో ఓటర్లు ఎన్నికల్లో పాల్గొన్నారని సీఈఓ మీనా తెలిపారు. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్‌ ముగియాల్సి ఉన్నా ఆరు తర్వాత పెద్ద సంఖ్యలో ఓటర్లు కేంద్రాల్లో ఉన్నారన్నారు. సాయంత్రం నాలుగు తర్వాత మళ్లీ ఓటర్ల సంఖ్య పెరిగినట్టు చెప్పారు. రాష్ట్రంలో  5600కేంద్రాల్లో 1200 ఓట్ల కంటే ఎక్కువ ఉన్నాయని చెప్పారు. చాలా చోట్ల సాయంత్రం ఆరు తర్వాత పోలింగ్ జరిగిందన్నారు. చివరి పోలింగ్ కేంద్రంలో మరుసటి రోజు తెల్లవారుజాము 2గంటల వరకు పోలింగ్ జరిగిందన్నారు. ఈవిఎంలను అప్పగించేసరికి ఆలస్యం అయ్యిందన్నారు.

కొన్ని చోట్ల వాతావరణ సమస్యలు, పోలింగ్ ఆలస్యం కావడం, కోనసీమ, శ్రీకాకుళంలో వర్షాల వల్ల మరుసటి రోజు తెల్లవారుజాము వరకు పోలింగ్ జరిగిందన్నారు. ఎన్నికలు పూర్తైన తర్వాత అబ్జర్వర్లు రీ పోల్ చేయాలో వద్దో నిర్ణయించిన తర్వాత తుది గణంకాలు ఖరారు చేసినట్టు చెప్పారు. ఈవిఎంలను పగులగొట్టిన చోట కూడా వెంటనే పోలింగ్ కొనసాగించినట్టు చెప్పారు. 

రాష్ట్రంలో ఎక్కడా అబ్జర్వర్లు రీ పోలింగ్‌ కు సిఫార్సు చేయలేదన్నారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు కేంద్రాలకు చెందిన  ఈవిఎంలను స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపరిచినట్టు చెప్పారు. 

రాష్ట్ర వ్యాప్తంగా  33లోకేషన్స్‌లో స్ట్రాంగ్‌ రూమ్‌లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 350 స్ట్రాంగ్‌ రూమ్‌లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అసెంబ్లీకి వేరుగా లోక్‌సభకు వేరుగా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సాంకేతిక సమస్య వల్ల పోలింగ్ శాతం వెల్లడిలో జాప్యం జరిగిందన్నారు. 

2019లో ఏపీలో  79.77 శాతం పోలింగ్‌ జరిగిందన్నారు.గతంతో పోలిస్తే ఈవిఎంలో 1శాతం ఎక్కువ నమోదైందన్నారు. 2019 లో 3,07,70,000 వచ్చాయని, 2024లో 3.33కోట్ల ఓట్లు పోలైనట్టు చెప్పారు.  ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో  పురుషులు 1.64కోట్లు మంది, 1.69కోట్ల మహిళలు, 1017 థర్డ్‌ జెండర్ ఓట్లు ఉన్నారన్నారు. 

అక్కడే అత్యధికం…

రాష్ట్రంలో ప్రకాశం జిల్లా దర్శిలో 90.99అత్యధికంగా పోలింగ్ జరిగిందని మీనా చెప్పారు. పార్లమెంటులో నియోజక వర్గాల్లో ఒంగోలు 87.06 శాతం నమోదైందన్నారు.

అసెంబ్లీలో తిరుపతిలో అతి తక్కువగా 62.32శాతం పోలింగ్ జరిగిందని మీనా చెప్పారు. 2019లో 65.9శాతం పోలింగ్ జరిగిందని, బోగస్ ఓట్లను బాగా కంట్రోల్ చేయడంతో అక్కడ పోలింగ్ తగ్గిందన్నారు.

విశాఖ పార్లమెంటులో అతి తక్కువగా 71.11శాతం పోలింగ్ నమోదైందన్నారు. 2019లో విశాఖలో 67శాతం మాత్రమే పోలింగ్ జరిగిందన్నారు.

హింసాత్మక చర్యలపై ఉక్కుపాదం…

పోలింగ్‌ తర్వాత జరుగుతున్న హింసాత్మక ఘటనల్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నట్టు సీఈఓ చెప్పారు. పోలింగ్‌ తర్వాత తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, నరసరావు పేటల్లో చాలా ఘటనలు జరిగాయని, మంగళవారం నుంచి డీజీపీతో సంప్రదింపులు చేస్తున్నట్టు చెప్పారు. ఎన్నికల సంఘంతో చర్చించిన తర్వాత నాలుగు చోట్ల 144 సెక్షన్ విధించి, అదనపు బలగాలను తరలించినట్టు చెప్పారు. స్థానిక పరిస్థితుల్ని అదుపులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు.

ఇప్పటి వరకు జరిగిన ఘటనలకు అభ్యర్థులే కారణమని గుర్తించామని, వారిపై కేసులు పెడుతున్నామని, వారిని నిర్బంధించాలని ఆదేశించినట్టు చెప్పారు. అల్లర్లకు కారణమైన వారిని వెంటనే గుర్తించాలని ఆదేశించినట్టు చెప్పారు.

ఓటర్ల కోసం రైలుకు గ్రీన్‌ ఛానల్…

విశాఖలో ఓటు హక్కును వినియోగించుకోడానికి వస్తున్న ప్రయాణికుల కోసం దేశంలో తొలిసారి గ్రీన్ ఛానల్‌ రైలును నడిపిపట్టు సీఈఓ తెలిపారు. నాందేడ్ విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను ఎక్కడా ఆగకుండా సాయంత్రం 5.27కల్లా విశాఖ చేర్చినట్టు సీఈఓ చెప్పారు. కంట్రోల్‌ రూమ్‌లో వార్తలు చూసి అడిషనల్ సీఈఓ కోటేశ్వరరావు విజయవాడ, విశాఖ డిఆర్‌ఎంలతో మాట్లాడి నేరుగా రైలును విశాఖ చేర్చినట్టు చెప్పారు. 

ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల విధుల్లో ఉన్న ఏపీ ప్రత్యేక సాయుధ బలగాల సిబ్బందికి ప్రత్యేక సెలవు మంజూరు చేయించి వారికి అలవెన్సులు చెల్లించి ఓటు హక్కును వినియోగించుకోడానికి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి ఇప్పించినట్టు సీఈఓ చెప్పారు. వారంతా మహారాష్ట్రలో ఎన్నికల విధుల్లో ఉన్నా నేరుగా పోలింగ్‌కు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు.

తదుపరి వ్యాసం