తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Tdp Polling Agents: పుంగనూరులో టీడీపీ ఏజెంట్ల కిడ్నాప్, ఈసీ జోక్యంతో విడిపించిన పోలీసులు

TDP Polling Agents: పుంగనూరులో టీడీపీ ఏజెంట్ల కిడ్నాప్, ఈసీ జోక్యంతో విడిపించిన పోలీసులు

Sarath chandra.B HT Telugu

13 May 2024, 10:28 IST

google News
    • TDP Polling Agents: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. చిత్తూరు, పల్నాడు జిల్లాల్లో మినహా మిగిలిన జిల్లాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 
టీడీపీ పోలింగ్ ఏజెంట్లపై దాడులపై చంద్రబాబు ఆగ్రహం
టీడీపీ పోలింగ్ ఏజెంట్లపై దాడులపై చంద్రబాబు ఆగ్రహం

టీడీపీ పోలింగ్ ఏజెంట్లపై దాడులపై చంద్రబాబు ఆగ్రహం

TDP Polling Agents: చిత్తూరు జిల్లా పీలేరులో ముగ్గురు ఏజెంట్లను కిడ్నాప్‌ చేశారంటూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. టీడీపీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లోకి చేరుకోలేని ప్రాంతంలో వదిలారని ఎన్నికల సంఘం దృష్టికి పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు.

అన్నమయ్య జిల్లా కేంద్రంలోని క పోలింగ్‌ కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ ఏజెంట్‌పై దాడి చేసి వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు వారిని చెదరగొట్టారు.

పల్నాడు జిల్లా రెంట చింతల మండలం రెంటాలలో ఇద్దరు తెదేపా ఏజెంట్లపై వైకాపా వర్గీయులు దాడి చేశారు. ఈ ఘటనలో వారికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారి స్థానంలో మరో ఇద్దరు ఏజెంట్లను అధికారులు అనుమతించారు. మాక్‌ పోలింగ్‌ పూర్తయిన తర్వాత.. రెగ్యులర్‌ పోలింగ్‌ ప్రారంభిస్తున్న క్రమంలో వైసీపీ ఏజెంట్లు టీడీపీ ఏజెంట్లపై దాడి చేశారు.

ఈసీ ఆగ్రహం

పోలింగ్‌ ప్రారంభానికి ముందే పల్నాడులో గొడవలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. అవసరమైతే అదనపు బలగాలను తరలించేలా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించింది.

చిత్తూరు జిల్లాలో జరిగిన ఘటనల నేపథ‌్యంలో చర్యలు చేపట్టాలని ఈసీ పోలీసుల్ని ఆదేశించింది. కిడ్నాపైన టీడీపీ ఏజెంట్లను గుర్తించి వారిని విధులకు హాజరు పరిచారు.

రాష్ట్రవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజక వర్గం సదుం మండలం బోరకమందలో టీడీపీకి చెందిన ముగ్గురు ఏజెంట్లు కిడ్నాప్ అయినట్లు వచ్చిన ఆరోపణపై జిల్లా ఎన్నికల యంత్రాంగం తో పాటు పోలీసుల యంత్రాంగం వెంటనే స్పందించడం జరిగిందని రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు.

కిడ్నాప్‌కు గురైన టీడీపీ ఏజెంట్లను పోలీసులు పీలేరులో గుర్తించారు. వారిని వెంటనే విధులకు వారు ఏజెంట్లుగా ఉన్న పోలింగ్ స్టేషన్లకు తరలించారు. సదుం మండలం బోరకమందలో 188, 189,199 కేంద్రాల తెదేపా ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న సమయంలో వైసీపీ నాయకులు కిడ్నాప్ చేశారని టీడీపీ జిల్లా ఇన్ ఛార్జి జగన్ మోహన్ రాజు చేసిన ఫిర్యాదు పై పోలీసులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకున్నారని సీఈఓ తెలిపారు. వారిని ఎవరు కిడ్నాప్ చేశారు అనే అంశాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, దర్యాప్తు అనంతము నిజానిజాలు తెలుస్తాయని తెలిపారు.

రాష్ట్రంలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్...

మాక్ పోల్ అనంతరం రాష్ట్రములో ఉదయం 7.00 గంటల నుంచి ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటుచేసిన మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలలో పట్టిష్టమైన పోలీసు భద్రత మధ్య ఎటువంటి అవాంఛనీయ సంఘటనకు తావు లేకుండా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని సీఈఓ మీనా చెప్పారు. అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించినా నైపుణ్యం గల BEL ఇంజనీర్ల సహకారంతో సెక్టార్ అధికారులు రిజర్వులో ఉన్న ఈవీఎంలను ఏర్పాటు చేయడంతో ఆయా పోలింగ్ స్టేషన్లో కూడా ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పారు.

వైసీపీ దాడులపై చంద్రబాబు ఆగ్రహం…

పుంగనూరు, మాచర్ల పోలింగ్ లో వైసీపీ అరాచకాలని ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుని వెళ్లామని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే మా కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు. రౌడీయిజం, గూండాయిజంతో రెచ్చిపోతే ఊరుకునేది లేదని, ఎలక్షన్ కమిషన్, పోలీసులు పోలింగ్ సజావుగా జరిగేలా చూడాలన్నారు.

అంతకు ముందు ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉండవల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రానికి సతీమణి భువనేశ్వరితో కలిసి చేరుకొని ఓటు వేశారు. నారా లోకేశ్‌, ఆయన సతీమణి బ్రాహ్మణి అదే పోలింగ్‌ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. ఓటు వేసేందుకు జనం చూపిస్తున్న చొరవ మరువలేనిదన్నారు. ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవని తెలిపారు. భవిష్యత్తును తీర్చిదిద్దేవి ఈ ఎన్నికలే అని ప్రజలు గుర్తించారన్నారు.

''ఓటు మీ జీవితాన్ని మారుస్తుంది. భావితరాల భవిష్యత్తుకు పునాదులు వేస్తుంది. విదేశాలతో పాటు, ఇతర రాష్ట్రాల్లోని తెలుగు వారు కూడా ఓటు వేసేందుకు వస్తున్నారు. పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో దాడులపై ఈసీకి ఫిర్యాదు చేశామని చంద్రబాబు చెప్పారు.

తదుపరి వ్యాసం