Nanded Express: ఓటర్ల కోసం విశాఖపట్నం రైలుకు గ్రీన్ ఛానల్, సీఈఓ జోక్యంతో ఓటు వేసిన ప్రయాణికులు
15 May 2024, 6:42 IST
- Nanded Express: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వేళ ఓ అనూహ్య ఘటన జరిగింది. ఇక ఓటు వేయలేమని భావించిన ఓటర్లు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకు స్పందించిన ఎన్నికల సంఘం ఏకంగా రైలును గ్రీన్‌ఛానల్ మార్గంలో విశాఖపట్నం చేరుకునేలా చేసింది.
ఓటర్ల కోసం నాందేడ్-విశాఖపట్నం రైలుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం
Nanded Express: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించు కునేందుకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరిన ఓటర్లకు పోలింగ్ రోజు చుక్కలు కనిపించాయి. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్ కావడం, అవి టీవీల్లో ప్రసారం కావడంతో ప్రధాన ఎన్నికల అధికారి స్పందించి రైల్వే అధికారులతో మాట్లాడారు. విజయవాడ, విశాఖ రైల్వే డివిజన్ అధికారుల్ని ఆదేశిండంతో అప్పటికప్పుడు రైలుకు గ్రీన్ ఛానల్ ఏర్పడింది. ఏ అటంకాలు లేకుండా పోలింగ్ సమయానికి ముందే గమ్యాన్ని చేరుకుంది.
షెడ్యూల్ ప్రకారం 20812 నాందేడ్ రైలు 12వ తేదీ రాత్రి 9.30కు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మర్నాడు ఉదయం 10.15కల్లా విశాఖపట్నం చేరుకోవాల్సి ఉంది. నాందేడ్‌లో సాయంత్రం 4.30కు బయల్దేరే రైలు ఐదు గంటల్లో సికింద్రాబాద్ చేరుకోవాల్సి ఉంది. అయితే ఆ రోజు రైలు సాంకేతిక కారణాలతో సికింద్రాబాద్ ఆలస్యంగా చేరుకుంది. రాత్రి 9.30కు రావాల్సిన రైలు మర్నాడు ఉదయం 5.30కు స్టేషన్ నుంచి బయలు దేరింది.
నాందేడ్-విశాఖపట్నం రైలులో విశాఖ వెళ్లి ఓటు వేయడానికి దాదాపు వెయ్యిమంది ప్రయాణికులు బయలుదేరారు. రైలు ప్రయాణంపై సికింద్రాబాద్‌లో ఖచ్చితమైన సమాచారం లేకపోవడంతో పోలింగ్ ముగిసేలోగా గమ్యానికి చేరుకుంటామని భావించారు. అయితే సికింద్రాబాద్‌లో బయలుదేరిన తర్వాత కూడా రైలు ప్రయాణంలో తీవ్రమైన జాప్యం జరగడంతో ప్రయాణికులు విసిగిపోయారు. ముందస్తు సమాచారం లేకపోవడంతో తాము ఓటు వేసే హక్కును కోల్పోతామని ఆందోళన చెందారు.
ఓటు వేయాలనే ఉద్దేశంతో సికింద్రాబాద్ నుంచి బయల్దేరినా సోమవారం మధ్యాహ్నానికి ఖమ్మం సమీపంలోనే ఉండిపోయారు. దీంతో ప్రయాణికులు సోషల్ మీడియాను ఆశ్రయించారు. రైల్వే అధికారులు ముందస్తు సమాచారం ఇచ్చి ఉంటే తాము ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేసుకునే వారిమని ప్రయాణికులు సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడం ఎన్నికల సంఘం దృష్టికి వచ్చింది.
ఓటర్లు పెద్ద సంఖ్యలో నాందేడ్ - విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నారని గుర్తించి వారిని గమ్యస్థానం చేర్చేలా చొరవ చూపారు. రైలు ఆలస్యంగా నడిస్తే పోలింగ్ ముగిసే సమయంలోగా కేంద్రాలకు చేరుకోలేరని గుర్తించి రైలును ఎక్కడా ఆపకుండా విశాఖ పంపేందుకు ఏర్పాట్లుచ చేశారు.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు సెక్షన్లలో పనుల కారణంగా రైలు షెడ్యూల్ కంటే ఆలస్యంగా నడిచింది. సికింద్రాబాద్‌లో ఉదయం 5.30కు బయల్దేరిన తర్వాత కూడా కాజీపేట సెక్షన్‌లో పలు అవంతరాలు ఎదురయ్యాయి. దాదాపు 8 గంటల ఆలస్యంగా నడవడంతో ఓటర్లు ఆందోళన చెందారు. దాదాపు వెయ్యిమంది ప్రయాణికులు విశాఖ వరకు ప్రయాణించాల్సి ఉంది. రైలు తరచూ ఆగిపోతుండటంతో ప్రయాణికుడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టును పలు టీవీ ఛానళ్లు ప్రసారం చేశాయి. తమ ఓటు వేయలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.
రైలు బాగా ఆల స్యంగా నడుస్తోందని ఓటువేసే అవకాశం కోల్పోతామన్న వీడియో ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా దృష్టికి రావడంతో వెంటనే స్పందించారు. విజయవాడ, విశాఖపట్నం డివి జనల్ రైల్వే మేనేజర్లతో మాట్లాడి రైలును సాయంత్రం ఆరుకంటే ముందే విశాఖ చేర్చాలని ఆదేశించారు.
సాయంత్రం 6 గంటలకు పోలింగ్ కేంద్రాలకు చేరుకునే వారికి ఓటు వేసే అవకాశం ఉండటంతో ఆలోపే రైలును విశాఖకు చేర్చాలని సూచించారు. దీంతో ఇద్దరు డీఆర్ఎంలు స్పందించి నాందేడ్-విశాఖపట్నం ఎక్స్ ప్రెస్ ఎక్కడా ఆగకుండా రూట్ క్లియర్ చేశారు. రైలు కోసం ఏకంగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు.
ఈ రైలు విజయవాడ రాదు. ఔటర్‌లోనే నేరుగా విశాఖ వెళ్లిపోతుంది. రాయనపాడు తర్వాత రాజరాజేశ‌్వరిపేట క్రాసింగ్ మీదుగా ప్రయాణిస్తుంది. ఆ తర్వాత ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమ హేంద్రవరం, దువ్వాడల్లో మాత్రమే ఆగింది. రైల్వే పనుల వల్ల ఎక్కడా ఆగకుండా చూశారు.
ఆ రైలుకు ఎక్కడా క్రాసింగ్ లేకుండా నేరుగా ప్రయాణించే అవకాశం కల్పించారు. దీంతో సాయంత్రం 5.15 గంటలకు విశాఖ పట్నం చేరింది. విశాఖలోని ప్రయాణికులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు తగిన సమయం ఉండటంతో తద్వారా పోలింగ్కు సమయం ఉండ టంతో కొందరు ఓటర్లకు పోలింగ్ కేంద్రా లకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కలి గింది. గ్రీన్ ఛానల్ లేకపోతే నాందేడ్ రైలు బహుశా రాత్రి 8 తర్వాత విశాఖపట్నం చేరుకునేదని రైల్వే అధికారులు తెలిపారు.