Top Law Colleges : దేశంలో టాప్ లా కాలేజీలు.. క్లాట్ తర్వాత ఇక్కడ అడ్మిషన్ వస్తే లైఫ్ మారిపోతుంది!
02 December 2024, 6:09 IST
- CLAT 2025 : దేశవ్యాప్తంగా కామన్ లా ఎంట్రన్స్ టెస్ట్(CLAT 2025) పరీక్ష డిసెంబర్ 1, 2024న జరిగింది. మీరు లా పరీక్ష రాసినా లేదా న్యాయశాస్త్రం చదవాలనుకుంటే భారతదేశంలోని టాప్ లా కాలేజీ గురించి తెలుసుకోండి.
టాప్ లా కాలేజీలు
న్యాయ విద్యా కళాశాలల్లో అడ్మిషన్ల కోసం క్లాట్ 2025 పరీక్ష డిసెంబర్ 1న రాశారు. ఇక ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అభ్యర్థులు ఏ కాలేజీ ఎంచుకోవాలో సందిగ్ధంలో ఉంటే మీ కోసం కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. క్లాట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా మీరు దేశంలోని టాప్ కాలేజీలో సీటు సంపాదించవచ్చు. ఆ లిస్టు ఏంటో ఓసారి చూద్దాం..
నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా, బెంగళూరు
ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ 2024లో బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా (ఎన్ఎల్ఎస్ఐయూ) దేశంలోనే టాప్ లా కాలేజీగా నిలిచింది. ఇక్కడ బీఏ ఎల్‌ఎల్‌బీ ఆనర్స్ నుంచి ఎల్‌ఎల్‌ఎం, మాస్టర్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (ఎంపీపీ), డాక్టరేట్ కూడా చేయవచ్చు. ఇక్కడ మీకు మంచి ఫ్యాకల్టీ, ప్లేస్ మెంట్స్ లభిస్తాయి.
నేషనల్ లా యూనివర్శిటీ (ఢిల్లీ)
2024 సంవత్సరానికి భారతదేశంలోని ఉత్తమ న్యాయ విశ్వవిద్యాలయాల ఎన్ఐఆర్ఎఫ్ జాబితాలో రెండో స్థానంలో ఉంది. నేషనల్ లా యూనివర్శిటీ(ఎన్ఎల్‌యూ) న్యాయశాస్త్రంలో ఉన్నత స్థాయి విద్యను అందించడంలో ప్రసిద్ధి చెందింది. ఈ విశ్వవిద్యాలయం అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు అందిస్తుంది. న్యాయ విద్యలో స్థిరపడాలనుకునేవారికి ఈ కాలేజీ బెస్ట్.
నల్సార్ యూనివర్శిటీ ఆఫ్ లా, హైదరాబాద్
భారతదేశంలో 2024 సంవత్సరానికి ఉత్తమ న్యాయ విశ్వవిద్యాలయాల ఎన్ఐఆర్ఎఫ్ జాబితాలో మూడో స్థానాన్ని పొందింది. ఈ విశ్వవిద్యాలయం భారతదేశంలోని ప్రధాన న్యాయ విశ్వవిద్యాలయాలలో ఒకటిగా ఉంది. ఈ విశ్వవిద్యాలయం బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో అధ్యయనాలతో పాటు వివిధ రకాల అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ లను అందిస్తుంది.
వెస్ట్ బెంగాల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యుడీషియల్ సైన్స్
2024 సంవత్సరానికి గాను ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో ఉత్తమ న్యాయ విశ్వవిద్యాలయాల జాబితాలో వెస్ట్ బెంగాల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యుడీషియల్ సైన్స్, కోల్‌కతా డబ్ల్యూబీఎన్యూజేఎస్ 4వ స్థానంలో నిలిచింది. న్యాయశాస్త్రంలో పట్టు సాధించాలనే అభ్యర్థులకు ఈ కాలేజీ కూడా మంచి ఆప్షన్. చట్టపరమైన సమస్యలను పరిష్కరించే అత్యాధునిక పరిశోధనలో పాల్గొనడానికి ఈ విశ్వవిద్యాలయం ప్రోత్సహిస్తుంది.
పుణే లా స్కూల్
ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ 2024లో సింబయాసిస్ లా స్కూల్ పుణే 74.62 స్కోరుతో ఐదో స్థానంలో నిలిచింది. ఇక్కడ నుంచి ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం చదువుకోవచ్చు.