తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Upi Transactions: ఏప్రిల్ లో తగ్గిన యూపీఐ ట్రాన్సాక్షన్స్; నగదు లావాదేవీలు పెరిగాయా?

UPI transactions: ఏప్రిల్ లో తగ్గిన యూపీఐ ట్రాన్సాక్షన్స్; నగదు లావాదేవీలు పెరిగాయా?

HT Telugu Desk HT Telugu

02 May 2024, 17:59 IST

  • UPI transactions: ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో భారతదేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లో ప్రధానమైన యూపీఐ ట్రాన్సాక్షన్స్ తగ్గాయి. యూపీఐ లావాదేవీల సంఖ్యతో పాటు యూపీఐ లావాదేవీల ద్వారా జరిగిన నగదు మొత్తం కూడా తగ్గింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

UPI transactions: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీల పరిమాణం ఏప్రిల్ నెలలో రూ.19.78 లక్షల కోట్ల నుంచి రూ.19.64 లక్షల కోట్లకు తగ్గింది. లావాదేవీల సంఖ్య పరంగా చూస్తే, ఈ సంఖ్య మార్చిలో 13.44 బిలియన్లు ఉండగా, ఏప్రిల్ నెలలో 13.30 బిలియన్లకు పడిపోయింది. గత ఏడాది ఏప్రిల్ తో పోల్చితే లావాదేవీల సంఖ్య 50 శాతం పెరగ్గా, మొత్తం లావాదేవీల సంఖ్య 40 శాతం పెరిగింది. మార్చి నెలలో లావాదేవీ విలువ అంతకు ముందు నెలతో పోలిస్తే 8 శాతం పెరిగి రూ.19.78 లక్షల కోట్లకు చేరింది.

విదేశాల్లో కూడా..

భారతదేశంతో పాటు, శ్రీలంక, మారిషస్, ఫ్రాన్స్, యూఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్ తో సహా అనేక దేశాల్లో యూపీఐ (UPI) ని ఉపయోగించవచ్చు. నమీబియాలో యూపీఐ లాంటి రియల్ టైమ్ పేమెంట్ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో సహాయపడటానికి ఎన్పీసీఐ (NPCI) ఇటీవల బ్యాంక్ ఆఫ్ నమీబియాతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది.

ఎన్పీసీఐ మార్కెట్ వాటాకు పరిమితి?

ఇదిలావుండగా, పేమెంట్ కంపెనీల మార్కెట్ వాటాపై 30 శాతం పరిమితిని అమలు చేయాలన్న నిర్ణయాన్ని ఎన్పీసీఐ పునఃసమీక్షించే అవకాశం ఉంది. మార్చిలో, ఎన్పీసీఐ (NPCI) కొత్త యూపీఐ ప్లేయర్లతో సమావేశమై యూపీఐ సిస్టమ్ ను ఎలా అభివృద్ధి చెందవచ్చో చర్చించింది. థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్లపై 30 శాతం వాల్యూమ్ పరిమితిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2022 నవంబర్లో ప్రతిపాదించింది. రెండేళ్లలో తమ మార్కెట్ వాటాను 30 శాతానికి పరిమితం చేయాలని యూపీఐ (UPI) కంపెనీలను కోరింది. యూపీఐ ద్వారా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ (PPI) ఆధారిత మర్చంట్ ట్రాన్సాక్షన్లపై గత ఏడాది ఎన్పీసీఐ ఇంటర్ఛేంజ్ ఫీజును అమల్లోకి తెచ్చింది.

100 బిలియన్లు దాటింది..

2024 ఆర్థిక సంవత్సరంలో యూపీఐ లావాదేవీలు 100 బిలియన్లు దాటి 131 బిలియన్లకు చేరుకోవడం ఇదే తొలిసారి. 2023 ఆర్థిక సంవత్సరంలో 84 బిలియన్ లావాదేవీలు జరిగాయి. 2024 మార్చిలో లావాదేవీల పరిమాణం 55 శాతం పెరిగి 13.44 బిలియన్లకు చేరుకుంది.

తదుపరి వ్యాసం