మీ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI) ఐడీ ద్వారా ఇకపై బ్యాంకు ఏటీఎంలలో నగదును డిపాజిట్ చేసుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తెలిపింది. కీలక బెంచ్ మార్క్ వడ్డీ రేట్లపై ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 5 వ తేదీ వరకు జరిగింది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. రెపో రేటు (REPO RATE)ను యథాతథంగా 6.5 శాతం వద్ద కొనసాగించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా యూపీఐ ఐడీ (UPI id) తో ఎటీఎం లలో నగదును డిపాజిట్ చేసే సదుపాయాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సదుపాయానికి సంబంధించిన కార్యాచరణ సూచనలు త్వరలో విడుదల చేయనున్నామన్నారు.
యూపీఐ ఐడీ తో, కార్డ్ అవసరం లేకుండానే, ఏటీఎం (ATM) ల నుంచి నగదును విత్ డ్రా చేసుకునే సౌలభ్యాన్ని ఇప్పటికే పలు బ్యాంకులు ప్రారంభించాయి. ఆ విధానం ద్వారా నేర్చుకున్న పాఠాల నుంచి యూపీఐ ద్వారా ఏటీఎంలలో నగదును జమ చేసే విధానాన్ని ప్రారంభిస్తున్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. క్యాష్ డిపాజిట్ మెషీన్లలో (CDM) నగదు డిపాజిట్ చేయడానికి చాలా మంది వినియోగదారులు డెబిట్ కార్డు (Debit card) లను ఉపయోగిస్తున్నారని ఆయన తెలిపారు. ‘‘సీడీఎంలు నగదును హ్యాండిల్ చేయడంలో బ్యాంక్ ఉద్యోగుల పనిభారాన్ని తగ్గించాయి. దాంతో, బ్యాంక్ ల్లో పొడవైన క్యూలను నివారించడం సాధ్యమైంది’’ అని వివరించారు.