Luxury Cars to launch this Year: లగ్జరీ కారు కొనాలనుకుంటున్నారా! ఈ ఏడాది ఇండియాలో లాంచ్ కానున్న టాప్-5 మోడళ్లు ఇవే
03 April 2023, 16:11 IST
- Top Luxury Cars to launch this Year: ఈ ఏడాది చాలా లగ్జరీ కార్లు ఇండియాలో అడుగుపెట్టనున్నాయి. వాటిలో టాప్-5 ఇవే.
Luxury Cars to launch this Year: లగ్జరీ కారు కొనాలనుకుంటున్నారా! ఈ ఏడాది ఇండియాలో లాంచ్ కానున్న టాప్-5 మోడళ్లు ఇవే (Photo: HT Auto)
Top-5 Luxury Cars to launch this Year: భారత మార్కెట్‍లోకి నయా కార్లు ఈ ఏడాది వెల్లువలా రానున్నాయి. ఇందులో భాగంగానే అనేక లగ్జరీ కార్లు దేశంలో లాంచ్ కానున్నాయి. రెండేళ్లుగా భారత్‍లో విలాసవంతమైన కార్ల (Luxury Cars) సేల్స్ పెరుగుతుండటంతో.. కంపెనీలు కూడా కొత్త మోడళ్లను తెచ్చేందుకు ఉత్సాహంగా ఉన్నాయి. దీంతో ఈ ఏడాది చాలా కార్లు భారత్‍లో అడుగుపెట్టనున్నాయి. కాగా, ఈ సంవత్సరం ఇండియాలో లాంచ్ కానున్న టాప్-5 లగ్జరీ ఎస్‍యూవీలు ఏవో ఇక్కడ చూడండి.
మెర్సెడెజ్ జీఎల్‍సీ (Mercedes GLC)
ఈ ఏడాది ఇండియా మార్కెట్‍లో ఏకంగా 10 కొత్త మోడళ్లను లాంచ్ చేయాలని లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సెడెజ్ నిర్ణయించుకుంది. ఈ క్రమలోనే సరికొత్త జీఎల్‍సీ ఫేస్‍లిఫ్ట్ ఎస్‍యూవీని తీసుకురానుంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‍లో ఈ వెర్షన్ అందుబాటులో ఉండగా.. ఈ ఏడాది ఇండియాలో లాంచ్ చేయనుంది. ప్రస్తుత జీఎల్‍సీ కంటే ఈ నయా జీఎస్‍సీ ఫేస్‍లిఫ్ట్ వెర్షన్ కారు ఎన్నో కొత్త ఫీచర్లు, అప్‍డేట్లను కలిగి ఉంటుంది. రెండు వేరియంట్లలో ఈ నయా మోడల్ రానుంది. 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉంటుంది. జీఎల్‍సీ ప్రస్తుత మోడల్ ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.61.99 లక్షలుగా ఉంది. ఈ ఏడాది రానున్న 2023 మెర్సెడెజ్ జీఎల్‍సీ ధర కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
వోల్వో సీ40 రీచార్జ్ (Volvo C40 Recharge)
స్వీడన్‍కు చెందిన లగ్జరీ కార్ మేకర్ వోల్వో.. ఈ ఏడాది ఇండియాలో వోల్వో సీ40 రీచార్జ్ లగ్జరీ ఎస్‍యూవీని లాంచ్ చేయనుంది. రెండు విభిన్న వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 482 కిలోమీటర్లు ప్రయాణించేలా రేంజ్‍తో ఈ లగ్జరీ కారు రానుంది. 238 hp పీక్ పవర్‌ను ఈ కారు మోటార్ జనరేట్ చేస్తుంది. ఇక మరో టాప్ ఎండ్ వేరియంట్ 508 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. ప్రస్తుతం వోల్వో నుంచి ఇండియాలో ఎక్స్40 రీచార్జ్ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ అందుబాటులో ఉంది. ప్రస్తుతం దీని ప్రారంభ ధర రూ.56.90లక్షలుగా ఉంది.
లెక్సస్ ఆర్ఎక్స్ (Lexus RX)
2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శితమైన లెక్సస్ ఆర్ఎక్స్ లగ్జరీ ఎస్‍యూవీ ఇండియాలో ఈ సంవత్సరమే లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ ఎస్‍యూవీ బుకింగ్స్ మొదలయ్యాయి. ఆర్ఎక్స్ 350హెచ్ లగ్జరీ హైబ్రిడ్, ఆర్ఎక్స్ 500హెచ్ ఎఫ్-స్పోర్ట్ పర్ఫార్మెన్స్ పవర్ ట్రైన్స్ వేరియంట్లలో ఈ లగ్జరీ కారు లాంచ్ కానుంది. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగానికి టాప్ ఎండ్ వేరియంట్ 6.2 సెకన్లలో యాక్సలరేట్ అవుతుంది.
లంబోర్ఘినీ ఉరుస్ ఎస్ (Lamborghini Urus S)
ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘినీ.. భారత్‍లో ఉరుస్ ఎస్ సూపర్ ఎస్‍యూవీని లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ లైనప్‍లో స్టాండర్డ్ మోడళ్లను ఈ ఉరుస్ ఎస్ భర్తీ చేయనుంది. లంబోర్ఘినీ ఉరుస్ ఎస్.. ఏప్రిల్ 13న భారత్‍లో అడుగుపెట్టనుంది. ప్రస్తుతం ఉన్న స్టాండర్డ్ ఉరుస్ కన్నా.. ఈ ఉరుస్ ఎస్ పవర్‌ఫుల్‍గా ఉంటుంది. ట్విన్ టర్బో చార్జ్డ్ 4.0-లీటర్ వీ8 ఇంజిన్‍ను ఈ కారు కలిగి ఉంటుంది. 0 నుంచి 100 kmph వేగానికి కేవలం 3.5 సెకన్లలోనే యాక్సలరేట్ అవుతుంది.
ఆడి క్యూ8 ఈ-ట్రాన్ (Audi Q8 e-tron)
క్యూ8 ఈ-ట్రాన్ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీని ఈ ఏడాది భారత మార్కెట్‍లో ప్రముఖ సంస్థ ఆడి విడుదల చేయనుంది. గతేడాది గ్లోబల్‍గా విడుదలైన ఈ కారు.. ఈ సంవత్సరం ఇండియాలో లాంచ్ కానుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 600 కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా రేంజ్ ఉండే 106 kWh బ్యాటరీతో ఈ కారు రానుంది.