Techno paints : కలర్ బ్యాంక్స్ టెక్నాలజీని ప్రవేశపెట్టిన టెక్నో పెయింట్స్!
28 August 2023, 13:30 IST
- Techno paints : దేశంలో కలర్ బ్యాంక్స్ టెక్నాలజీ కలిగి ఉన్న పెయింట్ సంస్థలు తక్కువగా ఉన్నాయి. తాజాగా.. ఈ జాబితాలోకి టెక్నో పెయింట్స్ చేరింది. ఆ వివరాలు..
టెక్నో పెయింట్స్ ప్రమోటర్ శ్రీనివాస్ రెడ్డి.
Techno paints : పెయింట్స్ తయారీ, విక్రయంలో ఉన్న టెక్నో పెయింట్స్ సంస్థ.. తాజాగా 'కలర్ బ్యాంక్స్' టెక్నాలజీని ప్రవేశపెట్టింది. భారత్‌లో 5,6 కంపెనీలు మాత్రమే ప్రస్తుతం ఈ సాంకేతికతను వినియోగిస్తున్నాయని సంస్థ చెప్పింది. కంపెనీ ప్రయాణంలో ఇదొక మైలురాయిగా నిలుస్తుందని, దిగ్గజాల సరసన చేరామని టెక్నో పెయింట్స్ పేర్కొంది.
కలర్ బ్యాంక్స్ టెక్నాలజీ అంటే ఏంటీ?
కలర్ బ్యాంక్స్‌తో 3,000 పైచిలుకు రంగులను నిమిషాల్లో కస్టమర్లకు అందించేందుకు వీలవుతుందని టెక్నో పెయింట్స్‌ను ప్రమోట్ చేస్తున్న ఫార్చూన్ గ్రూప్ ఫౌండర్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. స్మార్ట్‌ఫోన్‌తో సైతం కలర్ బ్యాంక్స్‌ను ఆపరేట్ చేయగలిగేలా యాప్‌ను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. తొలుత 1,000 మంది డీలర్ల వద్ద వీటిని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటుడు మహేశ్ బాబు చేరికతో.. మారుమూల పల్లెలకు కూడా తమ కంపెనీ విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కంపెనీ ఉత్పత్తులకు డీలర్ల నుంచి మంచి స్పందన ఉందని చెప్పారు.
22ఏళ్ల సుదీర్ఘ ప్రస్తానం..
Techno paints Color banks technology : 2023 ఆగస్ట్ 25 నాటికి 22 ఏళ్ల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది టెక్నో పెయింట్స్. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడులో కార్యకలాపాలు సాగిస్తోంది. ఇటీవలే మధ్యప్రదేశ్, ఒడిశాలో అడుగుపెట్టింది. సంస్థకు 1,000 మంది డీలర్లు ఉన్నారు. 2024 మార్చికల్లా డీలర్ నెట్‌వర్క్ 3,000లకు చేరుతుందని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ‘2024 మార్చి నాటికి 250 ఎక్స్‌పీరియెన్స్ సెంటర్లను ప్రారంభిస్తున్నాం. వీటిలో 25 కేంద్రాలు ప్రారంభానికి సిద్ధం అవుతున్నాయి. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక్కోటి రానున్నాయి. ఈ సెంటర్లలో కన్‌స్ట్రక్షన్ కెమికల్స్, వుడ్ ఫినిషెస్, స్పెషల్ ఫినిషెస్, పెయింటింగ్ టూల్స్, టైల్స్ అడిటివ్స్, పెయింట్స్, ఇతర ఉత్పత్తులను ప్రదర్శిస్తాం అని స్పష్టం చేశారు.
ఉత్పత్తి ఎప్పటినుంచంటే..
ఈ కంపెనీ రూ.100 కోట్లతో కొత్తగా మూడు ప్లాంట్లను నిర్మిస్తోంది. తెలంగాణలో హైదరాబాద్ సమీపంలోని పాశమైలారం, చేరియాల్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని నడికుడి వద్ద ఇవి ఏర్పాటవుతున్నాయి. అక్టోబరుకల్లా కొత్త కేంద్రాల్లో ఉత్పత్తి ప్రారంభమవుతుందని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ‘జర్మనీ నుంచి అత్యాధునిక మెషినరీ తెప్పిస్తున్నామని, నూతన ప్లాంట్ల చేరికతో వార్షిక ఉత్పత్తి సామర్థ్యం సాల్వెంట్ ఆధారిత పెయింట్స్ 36 లక్షల లీటర్లు, ఎమల్షన్ పెయింట్స్ 120 లక్షల లీటర్లు, పుట్టి 42,000 టన్నులకు చేరుతుందని వివరించారు. ఉత్పత్తులను వేగంగా కస్టమర్లకు చేర్చేందుకు ఇప్పటికే 25 డిపోలు ఏర్పాటయ్యాయని స్పష్టం చేశారు.