TCS Q2 results : 8.3శాతం పెరిగిన టీసీఎస్ లాభాలు!
10 October 2022, 17:21 IST
TCS Q2 results 2022 : టీసీఎస్ క్యూ2 త్రైమాసిక ఫలితాలు విడుదలయ్యాయి. నెట్ ప్రాఫిట్లో 8.3శాతం పెరిగింది.
టీసీఎస్ క్యూ2 ఫలితాలు విడుదల
TCS Q2 results : దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్).. సోమవారం క్యూ2 ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికానికి.. టీసీఎస్ కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ 8.3శాతం వృద్ధి చెంది(8.3శాతం).. రూ. 10,431కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో టీసీఎస్ నెట్ ప్రాఫిట్ రూ. 9,624కోట్లుగా నమోదైంది.
టీసీఎస్ కన్సాలిడేటెడ్ రెవెన్యూ 18శాతం వృద్ధి చెంది రూ. 55,309కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో అది రూ. 46,867కోట్లుగా ఉంది.
'ఆర్డర్ బుక్ బలంగా ఉంది..'
TCS Q2 results 2022 : ఇక కంపెనీ ఆర్డర్ బుక్ 8.1బిలియన్ డాలర్లుగా ఉంది. క్యూ2 ఫలితాలతో పాటు ఫైనల్ డివిడెండ్‌ను కూడా ప్రకటించింది టీసీఎస్. షేరుకు రూ. 8 డివిడెండ్ ఇస్తున్నట్టు పేర్కొంది.
"మా సేవలకు డిమాండ్ బలంగా ఉంది. పరిశ్రమలోని అన్ని విభాగాల్లో మేము శక్తివంతమైన ఫలితాలను నమోదు చేశాము. మా ఆర్డర్ బుక్ కూడా బాగానే ఉంది. గ్రోత్ ట్రాన్స్ఫార్మేషన్ ఇనీషియేటివ్స్, క్లౌడ్ మైగ్రేషన్, ఔట్సోర్సింగ్ ఏంగేజ్మెంట్తో ఆర్డర్ బుక్ శక్తివంతంగా మారింది," అని టీసీఎస్ సీఈఓ, ఎండీ రాజేశ్ గోపీనాథన్ వెల్లడించారు.
2023 ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో టీసీఎస్ కన్సాలిడేటెడ్ ప్యాట్ రూ. 9,478కోట్లకు పెరిగింది. కన్సాలిడెటెడ్ రెవన్యూ రూ. 52,758కోట్లకు చేరింది.
సోమవారం ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి టీసీఎస్ షేరు ధర దాదాపు 2శాతం పెరిగి రూ. 3,121 వద్ద స్థిరపడింది.
ఐటీ సెక్టార్లో గత కొంతకాలంగా అనిశ్చితి నెలకొంది. టీసీఎస్ త్రైమాసిక ఫలితాల ఆధారంగా ఇతర ఐటీ సంస్థ ప్రదర్శనను అంచనా వేస్తూ ఉంటారు. అందువల్ల టీసీఎస్ త్రైమాసిక ఫలితాలు కీలకంగా మారాయి.