Tata Sierra EV: 2025 లో టాటా సియెర్రా ఈవీ లాంచ్; ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ పూర్తి విశేషాలు..
27 November 2024, 18:33 IST
Tata Sierra EV: గతంలో వాహన వినియోగదారులకు చిరపరిచితమైన టాటా సియెర్రా ఇప్పుడు మరో రూపంలో తిరిగి వస్తోంది. మొదట సియెర్రాను టాటా సంస్థ 1991 లో లాంచ్ చేసింది. ఇప్పుడు 2025 లో ఎలక్ట్రిక్ వెహికల్ గా తిరిగి వస్తోంది. ఇందులో 450-550 కిమీల పరిధిని అందించే రెండు బ్యాటరీ ఆప్షన్స్ ఉండవచ్చు.
2025 లో టాటా సియెర్రా ఈవీ లాంచ్
Tata Sierra EV: ఒరిజినల్ టాటా సియెర్రా 1991 లో మొదటి ఆఫ్-రోడ్ ఎస్ యూవీగా మార్కెట్లోకి వచ్చింది. ఇది ఇప్పుడు పూర్తిగా కొత్త, ఆధునీకరించిన అవతారంలో ఎలక్ట్రిక్ వాహనంగా తిరిగి జీవం పోసుకుంటోంది. టాటా సియెర్రా ఈవీ 2025 ద్వితీయార్థంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అంతకు ముందు దీనిని భారత్ మొబిలిటీ ఎక్స్ పో 2025లో ప్రొడక్ట్ రూపంలో ప్రదర్శించనున్నారు. రాబోయే హారియర్ ఈవీతో పాటు, టాటా మోటార్స్ (tata motors) ఈవీ పోర్ట్ఫోలియోలో తదుపరి దశలో సియెర్రా కీలక భాగంగా ఉండబోతోంది. ఇప్పటి వరకు ఈ కారును 2020, 2023 ఆటో ఎక్స్ పోలో కాన్సెప్ట్ రూపంలో రెండుసార్లు ప్రదర్శించారు. అలాగే, టాటా మోటార్స్ ఈవీ మోడల్ లాంచ్ అయిన వెంటనే ఐసిఇ ఆధారిత మోడల్ ను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. టాటా సియెర్రా ఈవీ లోని హైలైట్స్ గురించి తెలుసుకుందాం
టాటా సియెర్రా ఈవీ: డిజైన్
టాటా సియెర్రా ఈవీ ఒరిజినల్ మోడల్ క్లాసిక్ బాక్సీ సిల్హౌట్ ను నిలుపుకుంటుంది. ఇది ఐదు డోర్ల వర్షన్ గా వస్తుంది. ముందు భాగంలో సొగసైన ఎల్ఈడీ లైట్ స్ట్రిప్ ఉంటుంది. ఇది కారు మొత్తం వెడల్పును కవర్ చేస్తుంది. ఫ్రంట్ ఎండ్ స్ప్లిట్ హెడ్ ల్యాంప్ లను కలిగి ఉంటుంది. సిల్వర్ ఫినిష్ స్కిడ్ ప్లేట్లతో కూడిన బ్లాక్ బంపర్లు, డ్యూయల్-టోన్ రూఫ్ కలిగి ఉంటుంది. టాటా మోటార్స్ ప్రస్తుత డిజైన్ సౌందర్యానికి అనుగుణంగా దీనిని తయారు చేస్తున్నారు. ఇందులో ప్రత్యేకమైన పనోరమిక్ రియర్ విండో ప్యాన్ ను తీసుకువస్తున్నారు. ఇది ఒరిజినల్ మోడల్ లాగా ఫిక్స్ డ్ విండో కాదు. ఈ కారులో ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. సియెర్రా వెనుక భాగంలో వెడల్పాటి, బాక్సీ ఫెండర్లతో పాటు టెయిల్ లైట్ల కోసం సొగసైన ఎల్ఈడి స్ట్రిప్, రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్ కింద రాప్ రౌండ్ రియర్ విండోపేన్ ఉంటాయి.
టాటా సియెర్రా ఈవీ: ఇంటీరియర్ మరియు ఫీచర్లు
కొత్త సియెర్రా సమగ్ర శ్రేణి ఫీచర్లను అందిస్తుంది. ఇందులో వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీని అనుమతించే పెద్ద 12.3-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ ఉంటుంది. డ్యూయల్ స్క్రీన్ డిస్ ప్లేలో ఇన్ఫోటైన్ మెంట్ తో ఇంటిగ్రేట్ చేసి ఉన్న పూర్తి డిజిటల్ క్లస్టర్ ను కూడా డ్రైవర్ పొందే అవకాశం ఉంది. వైర్ లెస్ ఛార్జింగ్ ప్యాడ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ తో పాటు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ప్రీమియం లెథరెట్ అప్ హోల్ స్టరీ ఇంటీరియర్ ఎక్స్ పెక్టేషన్స్ లో ఉన్నాయి. టాటా సియెర్రా అనేక రకాల భద్రతా ఫీచర్లతో కూడిన లెవల్ -2 ఎడిఎఎస్ సూట్ ను కూడా పొందే అవకాశం ఉంది.
టాటా సియెర్రా ఈవీ: పవర్ ట్రెయిన్ ఎంపికలు
టాటా సియెర్రా ఈవీ (Tata Sierra EV) స్పెసిఫికేషన్లను ఇప్పటివరకు వెల్లడించలేదు. అయితే, ఇది కొత్త యాక్టి.ఈవి ఆర్కిటెక్చర్ పై నిర్మించబడుతుందని తెలుస్తోంది. 2020 ఆటో ఎక్స్ పో లో సియెర్రా ఈవీ కాన్సెప్ట్ ను మొదటిసారి ప్రదర్శించినప్పుడు, ఇది ఆల్ట్రోజ్ హ్యాచ్ బ్యాక్ కు మద్దతు ఇచ్చే ఆల్ఫా ప్లాట్ఫామ్ పై నిర్మించబడింది. ఇప్పుడు పంచ్ ఈవీతో అరంగేట్రం చేసిన టాటా జెన్ 2 ప్లాట్ ఫామ్ ను ఉపయోగించుకోవాలని భావిస్తోంది. దీనితో, టాటా సియెర్రా ఈవి 45 కిలోవాట్ల, 55 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఎంపికలను పొందవచ్చు. వేరియంట్ ను బట్టి, ఇది 450-550 కిలోమీటర్ల సింగిల్ ఛార్జ్ పరిధిని అందిస్తుంది.