Swiggy IPO : స్విగ్గీ ఐపీఓ- సబ్స్క్రిప్షన్ డేట్, ప్రైజ్ బ్యాండ్ వివరాలివే..
29 October 2024, 6:07 IST
Swiggy IPO date : స్విగ్గీ ఐపీఓకి సంబంధించిన ప్రైజ్ బ్యాండ్, సబ్స్క్రిప్షన్ డేట్‌తో పాటు మరిన్ని వివరాలు అందుబాటులోకి వచ్చాయి. స్విగ్గీ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌కి ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే…
స్విగ్గీ ఐపీఓ- సబ్స్క్రిప్షన్ డేట్, ప్రైజ్ బ్యాండ్ వివరాలివే..
మచ్ అవైటెడ్ స్విగ్గీ ఐపీఓకి సంబంధించిన మరిన్ని వివరాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ నవంబర్ 6న మొదలై, నవంబర్ 8న ముగుస్తుంది. ఈ ఐపీఓ ద్వారా స్విగ్గీ సంస్థ రూ. 11,300 కోట్లను సమీకరించనుంది. పలు నివేదికల ప్రకారం స్విగ్గీ ఐపీఓ ప్రైజ్ బ్యాండ్ రూ. 371 నుంచి రూ. 390 మధ్యలో ఉంటుంది.
నవంబర్ 5న స్విగ్గీ ఐపీఓ యాంకర్ ఇన్వెస్టర్లకు ఒక్కరోజు బిడ్డింగ్ అవకాశం లభిస్తుందని అధికారులు తెలిపారు.
నవంబర్ 8 తర్వాత ఐపీఓ అలాట్మెంట్, స్విగ్గీ లిస్టింగ్ డేట్స్‌పై క్లారిటీ రావాల్సి ఉంది.
భారత క్యాపిటల్ మార్కెట్లోకి ప్రవేశించనున్న అత్యంత విలువైన న్యూ జనరేషన్ వినియోగదారుల బ్రాండ్లలో స్విగ్గీ ఒకటి. రూ.11,300 కోట్ల ఐపీఓలో రూ.4,500 కోట్ల విలువైన షేర్ల తాజా ఇష్యూ, రూ.6,800 కోట్ల విలువ గల ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ఉన్నాయి.
యాక్సెల్ ఇండియా IV (మారిషస్) లిమిటెడ్, అపోలెట్టో ఆసియా లిమిటెడ్, ఆల్ఫా వేవ్ వెంచర్స్, ఎల్పీ, కోట్యూపీఈ ఆసియా ఎలెవన్ ఎల్ఎల్సీ, డీఎస్టీ యూరో ఏషియా వి బివి, ఎలివేషన్ క్యాపిటల్ వీ లిమిటెడ్, ఇన్స్పైర్డ్ ఎలైట్ ఇన్వెస్ట్ మెంట్స్ లిమిటెడ్, ఎంఐహెచ్ ఇండియా ఫుడ్ హోల్డింగ్స్ బీవీ, నార్వెస్ట్ వెంచర్ పార్ట్ నర్స్ 7-ఎ మారిషస్, టెన్సెంట్ క్లౌడ్ యూరప్ బీవీలు ఆఫర్ ఫర్ సేల్‌లో పాల్గొననున్నాయి.
స్విగ్గీ ఐపీఓ ద్వారా యాక్సెల్, ఎలివేషన్ క్యాపిటల్, నార్వెస్ట్ వెంచర్స్ వంటి ప్రారంభ పెట్టుబడిదారులు తాము అమ్ముతున్న షేర్లపై 35 రెట్ల వరకు రాబడిని సాధించనుండగా, సాఫ్ట్‌బ్యాంక్ ఎలాంటి వాటను విక్రయించడం లేదని తెలుస్తోంది.
తాజా ఇష్యూ ద్వారా రూ.137.41 కోట్లను అనుబంధ సంస్థ స్కూట్సీkి రుణాలు చెల్లించేందుకు వినియోగించనున్నట్లు స్విగ్గీ ఐపీఓ పత్రాల ద్వారా వెల్లడైంది. క్విక్ కామర్స్ రంగంలో స్కూట్సీ డార్క్ స్టోర్ నెట్ వర్క్‌ను విస్తరించేందుకు రూ.982.40 కోట్లు, డార్క్ స్టోర్స్ ఏర్పాటుకు రూ.559.10 కోట్లు, లీజు లేదా లైసెన్స్ చెల్లింపుల కోసం రూ.423.30 కోట్లు కేటాయించారు.
టెక్నాలజీ, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ.586.20 కోట్లు, బ్రాండ్ మార్కెటింగ్, బిజినెస్ ప్రమోషన్ కోసం రూ.929.50 కోట్లు, ఇనార్గానిక్ గ్రోత్, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం నిధులను కేటాయించాలని కంపెనీ యోచిస్తోంది.
స్విగ్గీ వాల్యుయేషన్..
2014లో స్థాపించిన స్విగ్గీ విలువ ఈ ఏడాది ఏప్రిల్ నాటికి దాదాపు 13 బిలియన్ డాలర్లుగా! మార్చి 31, 2023 నాటికి దాని వార్షిక ఆదాయం 1.09 బిలియన్ డాలర్లకు చేరుకుందని, ఇందులో 4,700 మందికి పైగా ఉపాధి పొందుతున్నారని గ్లోబల్ స్టార్టప్ డేటా ప్లాట్‌ఫామ్ ట్రాక్సన్ తెలిపింది.
స్విగ్గీకి ప్రధాన పోటీదారుగా నిలిచిన జొమాటో ఇప్పటికే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యింది. 2021లో బ్లాక్‌బస్టర్ ఐపీఓ ద్వారా మార్కెట్లోకి అడుగుపెట్టిన జొమాటో షేరు ధర, సోమవారం ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి రూ. 254 గా నిలిచింది.
మరి స్విగ్గీ లిస్టింగ్ ఎలా జరుగుతుందో చూడాలి.