Multibagger Stocks : మంచి లాభాలు తెచ్చిపెట్టే మల్టీబ్యాగర్ స్టాక్స్‌ను ముందుగానే ఎలా గుర్తించాలి?
19 August 2024, 22:25 IST
- Multibagger Stocks : స్టాక్ మార్కెట్లో మల్టీబ్యాగర్ స్టాక్స్ గురించి ఎప్పుడూ వింటుంటాం. అయితే చాలా మంది స్టాక్స్ మల్టీబ్యాగర్‌గా అయిన తర్వాత పెట్టుబడులు పెడతారు. అప్పుడు పెద్దగా ప్రయోజనం ఉండదు. ముందుగానే వాటిని గుర్తిస్తే మీకు మంచి రాబడులు వస్తాయి. ఎలా గుర్తించాలో తెలుసుకోండి.
ముందుగానే మల్టీబ్యాగర్ స్టాక్స్ గుర్తించడం ఎలా
తక్కువ సమయంలో కొన్ని స్టాక్స్ ఎక్కువ రాబడిని ఇస్తాయి. ఊహించని విధంగా షేర్ ధర పెరుగుతుంది. తక్కువ కాలంలో స్టాక్ ప్రస్తుత విలువ కంటే వంద రేట్లు అధికంగా రిటర్న్ తెచ్చే వాటిని మల్టీబ్యాగర్ స్టాక్స్ అంటారు. అయితే ఈ స్టాక్ వృద్ధి చెందక ముందే గుర్తించిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. మల్టీబ్యాగర్‌గా మారిన తర్వాత పెట్టుబడులు పెడతారు. కానీ అప్పుడు పెద్దగా ఫలితం ఉండదు. మల్టీబ్యాగర్ స్టాక్‌లను గుర్తించడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.
స్టాక్ మార్కెట్లో మల్టీబ్యాగర్ స్టాక్స్ చాలానే చూస్తున్నాం. బాగా పెరిగిన తర్వాత చాలా మంది ఈ స్టాక్‌లపై శ్రద్ధ చూపుతారు. అయితే గ్రోత్ రన్ ప్రారంభంలో ఈ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసిన వారికి అందరికంటే ఎక్కువ లాభం వస్తుంది. అటువంటి మల్టీబ్యాగర్ స్టాక్‌లను పెరుగుదల ప్రారంభ దశలో గుర్తించాలి. అయితే ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి. మల్టీబ్యాగర్ స్టాక్‌లను గుర్తించగలిగినప్పటికీ, వాటిలో పెట్టుబడి పెట్టడం వలన నిర్దిష్ట రాబడి లభిస్తుందని ఎటువంటి హామీ లేదు. మీరు మినిమమ్ రిస్క్ తీసుకొని పెట్టుబడి పెట్టాలి.
మీరు స్టాక్స్ సాంకేతిక అంశాలను గమనించడం నేర్చుకోవాలి. PE నిష్పత్తి (Price to Earnings Ratio), PB నిష్పత్తి (Price to Book Ration) మీరు చూడవలసిన కొలమానాలు. వీటిని పరిశీలిస్తూ ఉండాలి. వీటి మీద ఆధారపడి రానున్న రోజుల్లో షేరు ధర పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
దేశంలో ఏయే రంగాల్లో వృద్ధి సామర్థ్యం ఎక్కువగా ఉందో గమనించండి. తయారీ, ఆటోమొబైల్, ఎఫ్‌ఎంసిజి, ఎలక్ట్రానిక్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ మొదలైన వృద్ధి రంగాలను షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. అందులో గ్రోత్ ఉన్న స్టాక్ మీద పరిశోధన చేయాలి. ఆ కంపెనీల్లో పెట్టుబడి పెట్టాలి. అవి భవిష్యత్తులో మల్టీబ్యాగర్ స్టాక్స్‌గా మారుతాయి.
స్టాక్ సాంకేతిక కొలమానాలు ఎంత ముఖ్యమైనవో కంపెనీ ఆర్థిక గణాంకాలు కూడా అంతే ముఖ్యమైనవి. మీరు కంపెనీ ఆర్థిక నేపథ్యాన్ని చెక్ చేయండి. సంస్థ ఆర్థిక పరిస్థితి, పనితీరు సంవత్సరాలుగా ఎలా ఉందో గమనించాలి. ఆదాయం ఎంత పెరుగుతోంది, ఆ ఆదాయంలో ఎంత నికర లాభం ఉంది, ఎంత అప్పు వచ్చింది తదితర అంశాలను లెక్కలు వేసుకోవాలి.
కంపెనీని ఎంత లోతుగా అధ్యయనం చేసినప్పటికీ వివిధ కారణాల వల్ల ఆశించిన విధంగా అభివృద్ధి చెందకపోవచ్చు. కంపెనీలు ఊహించని విధంగా విఫలమైన ఉదాహరణలు చాలా ఉంటాయి. పెట్టుబడిదారులు ఎల్లప్పుడూ ఈ విషయాన్ని ఉంచుకోవాలి. స్టాక్ మార్కెట్ రిస్క్‌తో కూడుకున్నది. స్టాక్ కొన్నిసార్లు ఊహించని విధంగా పెరగవచ్చు. మరికొన్ని సార్లు అనుకోనంతగా పతనం కావొచ్చు.