Samsung New 5G Phones: సామ్‍సంగ్ గెలాక్సీ ఏ54 5జీ, ఏ34 5జీ ఫస్ట్ సేల్ మొదలు: అదిరిపోయే ఆఫర్లు
23 March 2023, 12:41 IST
Samsung Galaxy A54 5G, Samsung Galaxy A35 5G: ఇటీవల లాంచ్ అయిన సామ్‍సంగ్ గెలాక్సీ ఏ54 5జీ, గెలాక్సీ ఏ34 5జీ ఫోన్లు తొలిసారి సేల్‍కు వచ్చాయి. ఈ సందర్భంగా కొన్ని ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
Samsung New 5G Phones: సామ్‍సంగ్ గెలాక్సీ ఏ54 5జీ, ఏ34 5జీ ఫస్ట్ సేల్ మొదలు (Photo: Samsung)
సామ్‍సంగ్ గెలాక్సీ ఏ54 5జీ (Samsung Galaxy A54 5G), సామ్‍సంగ్ గెలాక్సీ ఏ43 5జీ (Samsung Galaxy A34 5G) ఫోన్లు ఇండియాలో తొలిసారి సేల్‍కు వచ్చాయి. నేడు (మార్చి 23) ఈ మొబైళ్ల సేల్ ప్రారంభమైంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే సూపర్ అమోలెడ్ డిస్‍ప్లేలను ఈ రెండు ఫోన్లు కలిగి ఉన్నాయి. వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ57 రేటింగ్ ఉంటుంది. ఇక ఫస్ట్ సేల్ సందర్భంగా గెలాక్సీ ఏ54 5జీ, గెలాక్సీ ఏ34 5జీ మొబైళ్లపై సామ్‍సంగ్ ప్రత్యేక పరిమిత కాల ఆఫర్లను ఇస్తోంది. ఈ ఫోన్ల ధరలు, ఆఫర్లు, సేల్, స్పెసిఫికేషన్ల వివరాలు ఇవే.
సామ్‍సంగ్ గెలాక్సీ ఏ54 5జీ, గెలాక్సీ ఏ34 5జీ ధర, సేల్
Samsung Galaxy A54 5G, Samsung Galaxy A34 5G: సామ్‍సంగ్ గెలాక్సీ ఏ54 5జీ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ.38,999గా ఉంది. 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ టాప్ వేరియంట్ రూ.40,999 ధరతో వచ్చింది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఉన్న సామ్‍సంగ్ గెలాక్సీ ఏ34 బేస్ మోడల్ ధర రూ.30,999, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ఉన్న వేరియంట్ ధర రూ.32,999గా ఉంది. సామ్‍సంగ్ అధికారి వెబ్‍సైట్‍లో ఈ మొబైళ్లు సేల్‍కు వచ్చాయి. ఫ్లిప్‍కార్ట్ (Flipkart) ప్రీ-ఆర్డర్స్ షురూ అయ్యాయి. రిటైల్ స్టోర్లలోనూ ఈఫోన్‍లను కొనుగోలు చేయవచ్చు.
ఆఫర్లు
Samsung Galaxy A54 5G, Galaxy A34 5G: తొలి సేల్ సందర్భంగా గెలాక్సీ ఏ54 5జీ, గెలాక్సీ ఏ34 5జీ కొనుగోలుపై ఆఫర్లను ప్రకటించింది సామ్‍సంగ్.
- ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డుతో ఈ ఫోన్‍లను కొంటే రూ.3,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది.
- రూ.5,999 విలువైన గెలాక్సీ బడ్స్ లైవ్ టీడబ్ల్యూఎస్‍ను ఈ మొబైళ్లతో పాటు కొనుగోలు చేస్తే రూ.999కే దక్కించుకోవచ్చు.
- 25వాట్ల చార్జర్ ఉచితంగా పొందవచ్చు.
- నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉంటుంది.
- సామ్‍సంగ్ వెబ్‍సైట్‍లో కొంటే రూ.1000 షాప్ వెల్‍కమ్ వౌచర్ లభిస్తుంది.
ఈ ఆఫర్లు మార్చి 24వ తేదీ అర్ధరాత్రి వరకు ఉంటాయని సామ్‍సంగ్ పేర్కొంది.
సామ్‍సంగ్ గెలాక్సీ ఏ54 5జీ, గెలాక్సీ ఏ34 5జీ స్పెసిఫికేషన్లు
6.4 ఇంచుల సూపర్ అమోలెడ్ డిస్‍ప్లేను సామ్‍సంగ్ గెలాక్సీ ఏ54 5జీ (Samsung Galaxy A54 5G) కలిగి ఉంది. 6.6 ఇంచుల సూపర్ అమోలెడ్ డిస్‍ప్లేతో గెలాక్సీ ఏ34 5జీ (, Samsung Galaxy A34 5G) వస్తోంది. ఈ రెండు ఫోన్‍ల స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది. గెలాక్సీ ఏ54 5జీ ఫోన్‍లో ఎగ్జినోస్ 1380 ప్రాసెసర్ ఉండగా.. డైమన్సిటీ 1080 ప్రాసెసర్‌తో గెలాక్సీ ఏ34 5జీ వస్తోంది. రెండు మొబైళ్లు ఆండ్రాయిడ్ 13 ఆధారిత వన్ యూఐ 5.1 ఆపరేటింగ్ సిస్టమ్‍తో అడుగుపెట్టాయి.
సామ్‍సంగ్ గెలాక్సీ ఏ54 వెనుక 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 5 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తోంది. సామ్‍సంగ్ గెలాక్సీ ఏ34 వెనుక 48 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు ఉన్నాయి. 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఈ ఫోన్‍కు పొందుపరిచింది సామ్‍సంగ్. ఇక ఈ రెండు మొబైళ్లకు వెనుక ఉన్న ప్రైమరీ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)కు సపోర్ట్ చేస్తుంది.
సామ్‍సంగ్ గెలాక్సీ ఏ54 5జీ, గెలాక్సీ ఏ34 5జీ ఫోన్‍లలో 5,000mAh బ్యాటరీ ఉంటుంది. 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తాయి. అయితే రిటైల్ బాక్సులో చార్జర్ ఉండదు. ఈ ఫోన్‍లకు డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉండే స్టీరియో స్పీకర్లు ఉంటాయి. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ67 రేటింగ్ ఉంటుంది.