Rupay prepaid forex cards: ఇక బ్యాంక్స్ రూపే ప్రి పెయిడ్ ఫారెక్స్ కార్డ్స్ ఇష్యూ చేయొచ్చు
08 June 2023, 12:38 IST
- బ్యాంక్ లు రూపే ప్రి పెయడ్ ఫారెక్స్ కార్డ్స్ ను జారీ చేయడానికి ఆర్బీఐ అనుమతించింది. ఈ విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గురువారం వెల్లడించారు.
ప్రతీకాత్మక చిత్రం
భారత్ లోని బ్యాంకులు జారీ చేస్తున్న రూపే క్రెడిట్, డెబిట్ కార్డులకు విదేశాల్లో ఆమోదం పెరుగుతోందని ఆర్బీఐ (RBI) గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. ఇక బ్యాంక్ లు రూపే ప్రి పెయడ్ ఫారెక్స్ కార్డ్స్ ను జారీ చేయడాన్ని కూడా అనుమతిస్తున్నామన్నారు. దాంతో, రూపే కార్డుల విస్తృతి అంతర్జాతీయంగా మరింత పెరుగుతుందన్నారు. ఆర్బీఐ మానిటరీ పాలసీలో మార్పులను ప్రకటిస్తున్న సందర్భంగా ఆయన ఈ విషయాలను వెల్లడించారు.
పేమెంట్ ఆప్షన్స్ పెరుగుతాయి..
భారత్ లోని బ్యాంక్ లు రూపే ప్రిపెయిడ్ ఫారెక్స్ కార్డులను జారీ చేయడం వల్ల విదేశాల్లో పర్యటిస్తున్న భారతీయుల పేమెంట్ ఆప్షన్స్ పెరుగుతాయన్నారు. కాగా, మానిటరీ పాలసీ ప్రకటన సందర్భంగా ఆర్బీఐ రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఆర్బీఐ దేశంలోని ఇతర బ్యాంకులకు ఇచ్చే రుణాలపై పొందే వడ్డీ రేటును రెపో రేటు అంటారు. ద్రవ్యోల్బణంలో ప్రమాదకర స్థాయిలో లేకపోవడం, గత కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణం తగ్గుతుండడం.. తదితర కారణాల వల్ల రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయకూడదని ఆర్బీఐ నిర్ణయించింది. రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చని ఆర్థిక రంగా నిపుణులు కూడా అంచనా వేశారు. ద్రవ్యోల్బణం ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాలు సహా, చాలా దేశాలను వేధిస్తున్న ప్రధాన సమస్య. భారత్ మాత్రం ఈ సమస్యను విజయవంతంగా ఎదుర్కొంటోంది. మే 2022 నుంచి రెపో రేటును ఆర్బీఐ సుమారు 250 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. దాంతో, ప్రస్తుతం ఆర్బీఐ రెపో రేటు 6.5% గా ఉంది.