RBI Monetary Policy: రెపో రేటును మళ్లీ పెంచిన ఆర్‌బీఐ.. ఈఎంఐలపై ప్రభావం!
08 February 2023, 11:03 IST
- RBI Monetary Policy - Repo Rate Hike: రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది ఆర్బీఐ. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే చర్యల్లో భాగంగా కీలక వడ్డీరేటును మరోసారి అధికం చేసింది.
RBI Monetary Policy: రెపో రేటును మళ్లీ పెంచిన ఆర్‌బీఐ.. ఈఎంఐలపై ప్రభావం!
RBI Monetary Policy - Repo Rate Hike: రెపో రేటును మరోసారి అధికం చేసింది భారతీయ రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank Of India - RBI). రెపో రేటును మరో 25 బేసిస్ పాయింట్లు (0.25శాతం) పెంచింది. దీంతో రెపో రేటు 6.50 శాతానికి చేరింది. ఈ విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (Monetary Policy Committee) సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను ఆయన నేడు (ఫిబ్రవరి 8, బుధవారం) ప్రకటించారు. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు (25 bps - 0.25%) పెంచుతున్నామని చెప్పారు. ఇది తక్షణమే అమలులోకి వస్తుందని వెల్లడించారు. దీంతో రెపో రేటు 6.25 శాతం నుంచి 6.50 శాతానికి చేరింది. ఈ రేటును ఆర్బీఐ పెంచడం ఇది వరుసగా ఆరోసారి. గతేడాది మే నుంచి ఆర్బీఐ విడతల తారీగా 250 బేసిస్ పాయింట్ల రెపో రేటును పెంచింది. అంటే 2.5 శాతం వడ్డీ రేటు అధికమై ప్రస్తుతం 6.50 శాతానికి చేరింది. అలాగే, 2023-24 ఆర్థిక సంవత్సర జీడీపీ (GDP) వృద్ధి 6.4 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు శక్తికాంత దాస్ నేడు వెల్లడించారు.
అంచనాల మేరకే..
RBI Monetary Policy - Repo Rate Hike: చివరగా గతేడాది డిసెంబర్‌లో రెపో రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచింది ఆర్బీఐ. అంతకు ముందు గత మూడుసార్లు చెరో 50 పాయింట్లను అధికం చేసింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పలుమార్లు చెప్పారు. అయితే గతేడాది డిసెంబర్ నాటికి రిటైల్ ద్రవ్యోల్బణం 5.72 శాతానికి దిగి వచ్చింది. దీంతో రెపో రేటు పెంపును ఆర్బీఐ తగ్గిస్తుందని అంచనాలు వెలువడ్డాయి. అందుకు అనుగుణంగా ఈసారి రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది ఆర్బీఐ.
మీ ఈఎంఐలపై ఎఫెక్ట్ ఇలా..
వాణిజ్య బ్యాంకులన్నీ ఆర్బీఐ వద్ద రుణాలు తీసుకుంటాయి. ఈ రుణాలపై రెపో రేటు ప్రకారం బ్యాంకులు ఆర్బీఐకు వడ్డీ చెల్లించాలి. రెపో రేటు పెరిగితే ఎక్కువ వడ్డీని ఆర్బీఐకు బ్యాంకులు చెల్లించాల్సి వస్తుంది. ఆ భారాన్ని బ్యాంకులు.. కస్టమర్లపై వేస్తాయి. తమ వద్ద లోన్లు తీసుకున్న వారిపై ఆ అదనపు భారాన్ని మోపుతాయి. దీంతో రుణగ్రహీతలు.. బ్యాంకులకు కడుతున్న ఈఎంఐల మొత్తం అధికం అయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఈఎంఐ మొత్తాన్ని పెంచకుండా రుణ చెల్లింపు వ్యవధిని బ్యాంకులు పెంచుతుంటాయి. ఏదో విధంగా రెపో రేటు వల్ల పడే అదనపు భారాన్ని లోన్లు తీసుకున్న వారికి బదిలీ చేసేందుకే బ్యాంకులు మొగ్గుచూపుతుంటాయి.