World Wide Web Day: ఈ రోజు ఇంటర్నెట్ కు ద్వారాలు తెరుచుకున్న.. ‘వరల్డ్ వైడ్ వెబ్ డే’.. మరి మీ బ్రౌజర్ సేఫేనా?
01 August 2023, 18:17 IST
World Wide Web Day: ప్రతీ సంవత్సరం ఆగస్ట్ 1వ తేదీని వరల్డ్ వైడ్ వెబ్ డే (World Wide Web Day) గా పరిగణిస్తారు. ఈ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ (WWW)’ దినోత్సవం సందర్భంగా మనం రెగ్యులర్ గా వాడే వెబ్ బ్రౌజర్ ను సేఫ్ గా ఉంచుకోవడం ఎలాగో ఈ టిప్స్ ద్వారా తెలుసుకుందాం..
ప్రతీకాత్మక చిత్రం
World Wide Web Day: డిజిటల్ ప్రపంచానికి ద్వారాలు తీసిన వరల్డ్ వైడ్ వెబ్ తొలిసారిగా 1991, ఆగస్ట్ 1న ప్రజల్లోకి వచ్చింది. నాటి నుంచి దీన్ని కోట్లాది మంది ప్రజలు దీని సేవలను పొందుతున్నారు. అన్ని రంగాల, అన్ని వర్గాల, అన్ని సమూహాల, అన్ని దేశాల, అన్ని వృత్తుల ప్రజలకు నాటి నుంచి ఈ వరల్డ్ వైడ్ వెబ్ (WWW) సేవలను అందిస్తూనే ఉంది. అందువల్ల ఆగస్ట్ 1 వ తేదీని వరల్డ్ వైడ్ వెబ్ డే (World Wide Web Day) గా పరిగణిస్తారు.
ఎవరు రూపొందించారు?
ఈవరల్డ్ వైడ్ వెబ్ (WWW) ను 1989 లో బ్రిటిష్ కంప్యూటర్ సైంటిస్ట్ టిమ్ బెర్నర్స్ లీ (Tim Berners-Lee) యూనివర్సల్ లింక్డ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ గా రూపొందించాడు. ఇందులో బ్రౌజర్స్ ద్వారా వెబ్ సర్వర్స్ నుంచి డిజిటల్ సమాచారం మనకు అందుతుంది. కాల క్రమేణా, ఇది మరింత అప్ డేట్ అవుతూ, మనిషి నిత్య జీవితంలో భాగంగా మారింది. అంతేకాదు, దీనివల్ల కొత్త నేర విభాగమైన సైబర్ క్రైమ్స్ కు తెరలేచింది.
ఈ టిప్స్ తో మీ బ్రౌజర్ సేఫ్
- సైబర్ క్రిమినల్స్ నుంచి మన డేటా, మన డబ్బు, మన వ్యక్తిగత వివరాల సేఫ్ గా ఉండాలంటే ఈ టిప్స్ ను ఫాలో కావడం మంచిది.
- బ్రౌజర్లను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తుండాలి. హ్యాకర్లు బ్రౌజర్ల ప్రొగ్రామింగ్ లో లూప్ హోల్స్ ను గుర్తించి, వాటి ద్వారా మన సమాచారాన్ని తెలుసుకుంటారు. మన డేటాపై అధికారం పొందుతారు. అలా జరగకుండా ఉండాలంటే, ఎప్పటికప్పుడు మన బ్రౌజర్లను అప్ డేట్ చేస్తుండాలి.
- అనవసర కుకీలను తొలగిస్తుండాలి. మీ సిస్టమ్ బ్రౌజర్ లోని కుకీలను ఎప్పటికప్పుడు తొలగిస్తుండాలి. మీరు బ్రౌజ్ చేసిన సైట్స్ కు సంబంధించిన సమాచారం ఉన్న ఫైల్స్ ఈ కుకీస్. వీటి ద్వారా మన బ్రౌజింగ్ డేటానే కాకుండా, ఇతర వ్యక్తిగత సమాచారం తెలిసిపోతుంది. అందువల్ల ఎప్పటికప్పుడు బ్రౌజర్ సెట్టింగ్స్ ద్వారా అనవసర కుకీలను తొలగిస్తుండాలి.
- వీపీఎన్ లను వాడాలి. వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్ (VPN) లను ఉపయోగించడం ద్వారా మన డేటాను సేఫ్ గా ఉంచుకోవచ్చు. రిమోట్ సర్వర్లను ఉపయోగించే, ఈ జియో లాక్డ్ వీపీఎన్ లు.. యూజర్లు తమ లొకేషన్, ఇతర వివరాలను గోప్యంగా ఉంచుకునే వీలు కల్పిస్తాయి. యూజర్ల సెర్చ్ హిస్టరీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు తెలియకుండా జాగ్రత్త పడ్తాయి.
- ఎక్స్ టెన్షన్లను జాగ్రత్తగా ఇన్ స్టాల్ చేసుకోవాలి. బ్రౌజర్ ఎక్స్ టెన్షన్లు యూజర్ కు చాలా ఉపయోగకరం. కానీ బ్రౌజర ఎక్స్ టెన్షన్ స్టోర్ లో లేని ఎక్స్ టెన్షన్లను ఇన్ స్టాల్ చేసుకోవడం చాలా ప్రమాదకరం. వాటి ద్వారా ప్రమాదకర మాల్వేర్ మీ సిస్టమ్ లోకి జొరబడే అవకాశముంది.
- యాంటి వైరస్ సాఫ్ట్ వేర్ తప్పనిసరిగా ఇన్ స్టాల్ చేసుకోవాలి. ప్రమాదకరమైన లింక్స్ ను క్లిక్ చేసిన సమయంలో వాటి ద్వారా ప్రమాదకర మాల్వేర్, వైరస్ మీ సిస్టమ్ లోకి జొరబడే అవకాశముంది. వాటి నుంచి మీ సిస్టమ్ ను, డేటాను, బ్రౌజర్ ను కాపాడేందుకు యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ ను ఇన్ స్టాల్ చేసుకోవడం మంచిది.