తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Crude Oil: క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరగనున్నాయా! ఉత్పత్తిని తగ్గించేందుకు గల్ఫ్ దేశాల నిర్ణయం

Crude Oil: క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరగనున్నాయా! ఉత్పత్తిని తగ్గించేందుకు గల్ఫ్ దేశాల నిర్ణయం

02 April 2023, 23:45 IST

google News
    • Crude Oil Production: చమురు ఉత్పత్తిని తగ్గించేందుకు ఒపెక్ కూటమి దేశాలు నిర్ణయించుకున్నాయి. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వెలువడుతున్నాయి.
Crude Oil: క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరగనున్నాయా!
Crude Oil: క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరగనున్నాయా! (HT_Photo)

Crude Oil: క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరగనున్నాయా!

Crude Oil Production: అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరలు మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సౌదీ అరేబియా నేతృత్వంలోని ఒపెక్+ (OPEC+) దేశాలు మే నుంచి చమురు ఉత్పత్తి(Oil Production)ని తగ్గించేందుకు నిర్ణయించాయి. ఇటీవల క్రూడ్ ధరలు పడుతున్న నేపథ్యంలో ధరల్లో స్థిరత్వం తెచ్చేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి. మే నుంచి ఈ ఏడాది ముగిసే వరకు ప్రస్తుతం కన్నా ప్రతీ రోజు 10 లక్షల కన్నా ఎక్కువ బ్యారెళ్ల ఆయిల్ ఉత్పత్తిని తగ్గించనున్నట్టు ఆదివారం సమావేశం తర్వాత ఒపెక్+ దేశాలు ప్రకటించాయి. దీంతో మార్కెట్‍లో క్రూడ్‍కు డిమాండ్ పెరగనుంది. క్రూడ్ ఆయిల్‍ను అధికంగా దిగుమతి చేసుకుంటున్న ఇండియాపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలపై ఎఫెక్ట్ పడే ఛాన్స్ కూడా ఉండొచ్చు.

సుమారు 12 దేశాలు

Crude Oil Production: ఒపెక్+లోని సౌదీ అరేబియా, కువైట్, అల్జీరియా, ఒమన్ సహా మొత్తంగా 12 దేశాలు ఈ చమురు ఉత్పత్తి కోతకు నిర్ణయించాయి. రష్యా కూడా ప్రొడక్షన్ తగ్గించనుంది. ప్రపంచంలో ఒకానొక అత్యధిక చమురు ఉత్పత్తిదారుగా ఉన్న ఇరాక్ మే 1 నుంచి ఈ ఏడాది చివరి వరకు ప్రతీ రోజు 2,11,000 బ్యారెళ్లను తక్కువగా ఉత్పత్తి చేయనుంది.

సౌదీ అరేబియా.. ఔట్‍పుట్‍పై ప్రతీ రోజు ప్రస్తుతం కన్నా 5,00,000 బ్యారెళ్ల కోత విధించనుంది. ఇక మిగిలిన దేశాలు కూడా మే 1వ తేదీ నుంచి క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్‍ను తగ్గించనున్నాయి.

బ్యారెల్‍పై 10 డాలర్లు పెరగనుందా!

Crude Oil Production: క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిని ప్రతీ రోజు ప్రస్తుతం కన్నా 10 లక్షల బ్యారెళ్లను తగ్గించాలని ఒపెక్ దేశాలు నిర్ణయించటంతో ధరలు పెరుగుతాయని అంచనాలు వెలువడుతున్నాయి. బ్యారెల్ క్రూడ్ ఆయిల్‍పై సుమారు 10 డాలర్ల వరకు ధర అధికం అవుతుందని ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ పికెరింగ్ ఎనర్జీ పార్ట్‌నర్స్ పేర్కొంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‍లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర సుమారు 80 డాలర్ల వద్ద ఉంది.

మరోవైపు, చమురు ఉత్పత్తిని తగ్గించవద్దని అమెరికా సూచించినా ఒపెక్ దేశాలు మాత్రం పట్టించుకోలేదు. కోతకే మొగ్గుచూపాయి. “మార్కెట్‍లో స్థిరత్వం తీసుకొచ్చేందుకు అవసరమైన ముందస్తు జాగ్రత్తలను తీసుకుంటున్నాం” అని యూఐఈ ఎనర్జీ మినిస్టర్ సుహైల్ బిన్ మహమ్మద్ అల్ మజ్రోయీ పేర్కొన్నారు.

కాగా, క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే భారత్‍కు ప్రతికూలంగానే ఉంటుంది. అత్యధికంగా చమురును వివిధ దేశాల నుంచి ఇండియా దిగుమతి చేసుకుంటోంది. క్రూడ్ ఆయిల్ ధర అధికమైతే దేశంలోని ఆయిల్ కంపెనీలపై అదనపు భారం పడుతుంది. దీంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

తదుపరి వ్యాసం