Meta’s gender pay gap: ఫేస్ బుక్ కంపెనీ ‘మెటా’లోనూ మహిళలపై వివక్షే..
09 March 2023, 17:10 IST
- Meta’s gender pay gap: సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్ బుక్ (Facebook), వాట్సాప్ (whatsapp) ల యాజమాన్య సంస్థ మెటా (Meta) లో కూడా మహిళలపై వివక్ష కొనసాగుతోంది. మెటా లోని మహిళా ఉద్యోగులకు, సాటి పురుష ఉద్యోగుల కన్నా తక్కువ వేతనం లభిస్తోంది.
ప్రతీకాత్మక చిత్రం
Meta’s gender pay gap: ప్రముఖ టెక్నాలజీ కంపెనీ మెటా (Meta) తన మహిళాఉద్యోగులపై వివక్ష చూపుతోంది. సమాన హోదాలో ఉన్న పురుష ఉద్యోగుల కన్నా మహిళా ఉద్యోగులకు తక్కువ వేతనం ఇస్తోంది.
Meta’s gender pay gap: 8 వేల మంది ఉద్యోగినులు
బిజినెస్ ఇన్ సైడర్ ప్రకటించిన వివరాల ప్రకారం.. యూకే (UK), ఐర్లాండ్ (Ireland) ల్లోని తమ మహిళాఉద్యోగులకు మెటా (Meta) పురుష ఉద్యోగుల కన్నా తక్కువ వేతనం, తక్కువ బోనస్ ఇస్తోంది. డిసెంబర్ 2022 నాటికి యూకేలో సుమారు 5 వేల మంది, ఐర్లాండ్ లో సుమారు 3 వేల మంది.. మొత్తం 8 వేల మంది మహిళలు ఈ రెండు దేశాల్లో మెటా (Meta) లో ఉద్యగం చేస్తున్నారు. మొత్తం మెటాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ఇది సుమారు 10%.
Meta’s gender pay gap in Ireland: ఐర్లండ్ లో ఎక్కువ..
ఐర్లండ్ (Ireland) లోని మెటా (Meta) కార్యాలయంలో సమాన హోదా కలిగిన పురుష ఉద్యోగుల కన్నా మహిళా ఉద్యోగులు 15.7% తక్కువ వేతనం పొందుతున్నారు. బోనస్ విషయానికి వస్తే, ఈ తేడా మరింత ఎక్కువ. పురుష ఉద్యోగుల కన్నా ఐర్లండ్ (Ireland) లో మహిళా ఉద్యోగులు సగటున 43.3% తక్కువ బోనస్ పొందుతున్నారు.
Meta’s gender pay gap in UK: యూకేలో తక్కువ..
యూకే (UK) లో ఈ వివక్ష ఐర్లండ్ (Ireland) తో పోలిస్తే, కొంతవరకు తక్కువగానే ఉంది. యూకేలోని మెటా (Meta) కార్యాలయాల్లో పని చేసే మహిళలు, పురుష ఉద్యోగుల కన్నా సగటున 2.1% తక్కువ వేతనం పొందుతున్నారు. అలాగే, యూకేలోని మెటా కార్యాలయాల్లో పని చేసే మహిళలు, పురుష ఉద్యోగుల కన్నా సగటున 34.8% తక్కువ బోనస్ పొందుతున్నారు. 2018 సంవత్సరంలో ఫేస్ బుక్ (Facebook) లో ఉన్న వివక్షతో పోలిస్తే, 2022 లో మరింత ఎక్కువ వివక్ష కనిపిస్తోంది. 2018లో ఫేస్ బుక్ మహిళా ఉద్యోగులు తమ పురుష సహోద్యోగులతో పోలిస్తే, కేవలం 0.9% తక్కువ వేతనం పొందారు. అది 2022కి వచ్చే సరికి 2.1 శాతానికి పెరిగింది. బిజినెస్ ఇన్ సైడర్ కథనం ప్రకారం.. మెటా (Meta) లో సగటు బేస్ సాలరీ సంవత్సరానికి 1.5 లక్షల డాలర్లు. అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ. 1.22 కోట్లు.