Financial Preparation: ఈ 5 సూత్రాలు పాటిస్తే హఠాత్తుగా ఉద్యోగం పోయినా ఆర్థిక చింత ఉండదు!
13 November 2022, 23:49 IST
- Preparation for Sudden Job Cut : ప్రస్తుతం ఉద్యోగాల పరిస్థితి గందరగోళంగా ఉంది. చాలా కంపెనీలు ఎంప్లాయిస్‍ను హఠాత్తుగా తీసేస్తున్నాయి. అందుకే ఒకవేళ సడన్‍గా ఉద్యోగం కోల్పోవాల్సి వస్తే.. ఆర్థికంగా ఎలా సిద్ధంగా ఉండాలో ఇక్కడ తెలుసుకోండి.
ప్రతీకాత్మక చిత్రం
Financial Preparation for Sudden Job Cut : టెక్నాలజీ రంగంలో ప్రస్తుతం తీవ్ర అనిశ్చితి కనిపిస్తోంది. ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్లిన ట్విట్టర్ చాలా మంది ఉద్యోగులను తీసేసింది. ప్రముఖ సంస్థ మెటా కూడా సుమారు 11 వేల మంది ఎంప్లాయిస్‍ను తొలగించింది. ఇదే బాటను చాలా సాఫ్ట్ వేర్ కంపెనీలు ఫాలో అయ్యే అవకాశం ఉంది. ఇండియాలో బైజూస్ కూడా ఉద్యోగులను తీసేసింది. చాలా కంపెనీలు కూడా ఎంప్లాయిస్ సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ఈ ఉద్యోగాల కోత మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని రిపోర్ట్ లు వస్తున్నాయి. అయితే హఠాత్తుగా ఉద్యోగం పోతే ఆర్థిక కష్టాలు చుట్టుముడతాయి. అందుకే ముందుగానే ఆర్థికంగా సిద్ధంగా ఉండాలి. ఒకవేళ ఉద్యోగం ప్రమాదంలో ఉందని అనుమానం వస్తే తక్షణమే తప్పకుండా జాగ్రత్త పడాలి. హఠాత్తుగా ఉద్యోగం పోయినా ఆర్థికంగా సిద్ధంగా ఉంటే ఎక్కువగా తిప్పలు ఉండవు. మరి ఏ సూత్రాలు పాటించాలో ఇక్కడ చూడండి..
Financial Preparation for job cut: అత్యవసర నిధి
ఉద్యోగులు ఎప్పుడైనా.. ఆరు నెలలు లేదా ఒక సంవత్సరం వేతనంతో సమానమైన అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఉద్యోగం పోతే వెంటనే ఆర్థిక కష్టాల్లో పడకుండా ఈ డబ్బును వినియోగించుకోవచ్చు. మరో జాబ్ వెతుక్కునేంత వరకు కొన్ని నెలలు ఈ మొత్తం సహాయపడుతుంది. అవసరమైనప్పుడు సులభంగా విత్‍డ్రా చేసుకునేలా ఈ అత్యవసర నిధిని సేవింగ్స్ అకౌంట్‍లో భద్రపరుచుకోవడం మంచిది.
Financial Preparation for job cut: హెల్త్ ఇన్సూరెన్స్
ఉద్యోగం చేసే కంపెనీ కల్పించే హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఆధారపడడం కూడా పూర్తిగా సరైనది కాదు. దీనికి ముఖ్య కారణం ఉద్యోగాల కోత. ఒకవేళ ఉద్యోగం పోతే ఆ సంస్థ ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ ను కూడా మీరు కోల్పోతారు. అప్పుడు ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వస్తే మీ చేతి నుంచి డబ్బు కట్టాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి మీకు మరిన్ని ఆర్థిక కష్టాలను తెచ్చి పెట్టే అవకాశం ఉంటుంది. అందుకే మీరు సొంతంగా కుటుంబానికి ఆరోగ్య బీమాను తీసుకుంటే మంచిది.
Financial Preparation for job cut: బడ్జెట్ రూపొందించుకోవడం
నెలవారీ ఖర్చులన్నింటికీ బడ్జెట్ రూపొందించుకోవడం మర్చిపోకూడదు. దేనికి ఎంత ఖర్చవుతుందనే విషయాన్ని కచ్చితంగా తెలుకోవాలి. బడ్జెట్‍ను తయారు చేసుకోవాలి. అవసరాలకు తగ్గట్టుగా ఎలా మార్చుకోవచ్చో ఓ అంచనాకు రావాలి. ఆహారం, బిల్స్, ఈఎంఐ లాంటివి తప్పనిసరి. వీటిని అనుసరించి నెల ఖర్చులపై ఓ నిర్ణయానికి రావాలి.
Financial Preparation for job cut: దుబారా వద్దు
మీకు ఉద్యోగం ఉన్నప్పుడు కొంత మొత్తాన్ని కచ్చితంగా ఆదా చేసుకోవాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దుబారా ఖర్చులు చేయకపోవడం మంచిది. ఎక్కువగా బయట తినడం, అధిక సంఖ్యలో సినిమాలు చూడడం, ఎక్కువ మ్యాగజీన్లు తీసుకోవడం లాంటి దుబారా ఖర్చులు ఉంటే వాటిని తగ్గించుకోవాలి. ప్రస్తుతం పరిస్థితులు అత్యవసరంగా ఉండడంతో ఎక్కువగా ఆదాపై దృష్టి సారించాలి. అలాగే పెట్టుబడులకు దూరంగా ఉండి.. సేవింగ్స్ ఖాతాలో ఎమర్జెన్సీ నిధిని పెంచుకోవడం మంచిది.
Financial Preparation for job cut: రుణాలు అసలు వద్దు
ఉద్యోగం ప్రమాదంలో ఉందనిపిస్తే.. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డుపై రుణాలు అసలు తీసుకోకూడదు. ఈ లోన్స్ స్వల్ప కాలిక ఉపశమనం ఇస్తాయి, కానీ సుదీర్ఘంగా భారంగా తయారవుతాయి. ఎందుకంటే ఇలాంటి రుణాల వడ్డీ రేట్లు అధికంగా ఉంటాయి.