Lucid electric SUV: ల్యూసిడ్ కొత్త ఎలక్ట్రిక్, 7 సీటర్ ఎస్ యూ వీ ‘గ్రావిటీ’; రేంజ్ 700 కిమీలు
17 November 2023, 18:43 IST
- Lucid electric SUV: అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి సంస్థ ‘ల్యూసిడ్ మోటార్స్ (Lucid Motors)’.. కొత్తగా మరో ఎలక్ట్రిక్ ఎస్ యూ వీని మార్కెట్లోకి తీసుకువస్తోంది. గ్రావిటీ (Gravity) పేరుతో వస్తున్న ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ 804 హార్స్ పవర్ శక్తిని ప్రొడ్యూస్ చేయగలదు.
ప్రతీకాత్మక చిత్రం
Lucid electric SUV: యుఎస్‌కు చెందిన ఈవీ తయారీ సంస్థ లూసిడ్ మోటార్స్ లాస్ ఏంజిల్స్ ఆటో షోలో ‘గ్రావిటీ (Gravity)’ అనే ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. ఇది సెవెన్ సీటర్ ఎస్ యూ వీ. ఈ అడ్వాన్స్ డ్ ఎలక్ట్రిక్ ఎస్ యూ వీ (electric SUV).. టెస్లా మోడల్ X, వోల్వో EX90 వంటి వాటితో మార్కెట్లో పోటీ పడనుంది. ఈ ఎస్ యూ వీ ధర 80,000 డాలర్ల వరకు ఉండే అవకాశం ఉంది. అంటే, మన కరెన్సీలో సుమారు రూ. 66 లక్షల వరకు ఉంటుంది.
7 సీటర్ ఎస్ యూ వీ
ఈ గ్రావిటీ ఎస్‌యూవీ 7 సీటర్ ( 7 seater electric SUV) అని లూసిడ్ మోటార్స్ తెలిపింది. ఈ కారు 5 మీటర్ల కంటే ఎక్కువ పొడవు, 2.2 మీటర్ల కంటే ఎక్కువ వెడల్పు, దాదాపు 1.7 మీటర్ల ఎత్తులో ఉంటుంది. రెండు వెనుక వరుసల సీట్లను మడతపెట్టడం ద్వారా లూసిడ్ గ్రావిటీ దాదాపు 3,200 లీటర్ల వరకు అదనపు బూట్ స్పేస్ ను పొందవచ్చు. ఈ కొత్త మోడల్ SUV 2.0 అని ల్యూసిడ్ పిలుస్తోంది. ఇది లగ్జరీ, పనితీరు, శ్రేణి, డిజైన్, స్పేస్ ల అత్యుత్తమ కాంబినేషన్ అని ల్యూసిడ్ వెల్లడించింది. ఈ కార్ డ్యాష్ బోర్డుపై 34-అంగుళాల భారీ టచ్ స్క్రీన్ ఉంటుంది. ఇది డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌గా పనిచేస్తుంది. అదనంగా, మరో పైలట్ ప్యానెల్ సెంట్రల్ కన్సోల్ కూడా ఉంటుంది.
700 కిమీల రేంజ్..
ఈ గ్రావిటీ బ్యాటరీ ప్యాక్ వివరాలను ల్యూసిడ్ ఇప్పటివరకు వెల్లడించలేదు. అయితే, ఇందులో కనీసం 88 కిలోవాట్ లేదా 118 కిలోవాట్ ల వరకు సామర్థ్యం ఉన్న బ్యాటరీ ప్యాక్ ఉండవచ్చని భావిస్తున్నారు. సింగిల్ చార్జింగ్ తో ఈ గ్రావిటీ ఎస్ యూ వీ గరిష్టంగా 708 కి.మీల దూరం ప్రయాణించగలదు. అలాగే, ఈ కారు జీరో నుంచి 96 కిమీల వేగాన్ని కేవలం 3.5 సెకన్లలో అందుకోగలదు.