LIC Jeevan Utsav plan: ఎల్ఐసీ కొత్త ప్లాన్ ‘జీవన్ ఉత్సవ్’; బీమాతో పాటు జీవితాంతం ఆదాయం
07 December 2023, 14:55 IST
LIC Jeevan Utsav plan: ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల ‘జీవన్ ఉత్సవ్’ పేరుతో మరో కొత్త బీమా ప్లాన్ ను తీసుకువచ్చింది.
ప్రతీకాత్మక చిత్రం
LIC Jeevan Utsav plan: తక్కువ ప్రీమియం చెల్లింపు సంవత్సరాలతో, జీవిత కాల బీమా కవరేజ్ తో పాటు జీవితాంతం ఆదాయం అందించే జీవన్ ఉత్సవ్ బీమా ప్లాన్ ను ఎల్ఐసీ (LIC) ఆవిష్కరించింది.
నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్
ఈ జీవన్ ఉత్సవ్ (LIC Jeevan Utsav plan) నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్. ఈ ప్లాన్ లో ప్రీమియం చెల్లిస్తున్న సంవత్సరాలలో కూడా గ్యారెంటీ అడిషన్స్ ఉంటాయి. 90 రోజుల వయస్సు ఉన్న శిశువు నుంచి 65 సంవత్సరాల సీనియర్ సిటిజన్ వరకు ఈ ప్లాన్ తీసుకోవడానికి అర్హులే.
ఒకవేళ మరణిస్తే..
ఈ ప్లాన్ తీసుకుంటే, పాలసీ దారుడికి జీవితాంతం పాలసీ కవరేజ్ ఉంటుంది. పాలసీ దారుడు మరణించిన సందర్భంలో.. బీమా చేసిన మొత్తాన్ని, గ్యారెంటీ అడిషన్స్ తో సహా నామినీకి అందజేస్తారు. ఈ ప్లాన్ లో మెచ్యూరిటీ బెనిఫిట్స్ ఉండవు.
5 రైడర్స్..
ఈ ప్లాన్ తో 5 రైడర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిలో పాలసీ దారుడు యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ బెనిఫిట్ రైడర్ లేదా LIC యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్‌ని ఎంచుకోవచ్చు. అదనంగా, LIC కొత్త టర్మ్ అస్యూరెన్స్ రైడర్, LIC కొత్త క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ రైడర్, LIC ప్రీమియం మినహాయింపు బెనిఫిట్ రైడర్ లను అర్హత, షరతులకు లోబడి తీసుకోవచ్చు. వీటికోసం అదనంగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
ఈ ప్లాన్ వివరాలు ఇవే..
- ఇందులో జీవిత కాల బీమా కవరేజ్ తో పాటు జీవితాంతం ఆదాయం లభిస్తుంది.
- ఈ ప్లాన్ లో కనీసం ఐదేళ్ల పాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. గరిష్టంగా 16 ఏళ్ల పాటు చెల్లించవచ్చు.
- ప్రతీ పాలసీ సంవత్సరం ముగిసిన తరువాత బీమా చేసిన కనీసం మొత్తంలో ప్రతీ రూ. 1000 కి రూ. 40లను గ్యారెంటీ అడిషన్ గా జోడిస్తారు.
- ప్రీమియం చెల్లింపు సంవత్సరాలు ముగిసిన తరువాత, పాలసీ హోల్డర్ కు రెగ్యులర్ ఇన్ కం(Regular Income), ఫ్లెక్సి ఇన్ కం(Flexi Income) అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి.
- రెగ్యులర్ ఇన్ కం(Regular Income) ఆప్షన్ ను ఎంచుకుంటే, 3 లేదా 6 సంవత్సరాల డిఫర్మెంట్ పీరియడ్ ముగిసిన తరువాత ప్రతీ పాలసీ సంవత్సరం చివరలో ఇన్సూర్ చేసిన మొత్తంలో నుంచి 10% డబ్బును ఇస్తారు.
- ఫ్లెక్సి ఇన్ కం(Flexi Income) ఆప్షన్ ను ఎంచుకుంటే, డిఫర్మెంట్ పీరియడ్ ముగిసిన తరువాత ప్రతీ పాలసీ సంవత్సరం చివరలో ఇన్సూర్ చేసిన మొత్తంలో నుంచి 10% డబ్బును బేసిక్ సమ్ కు కలుపుతారు. ఆ మొత్తాన్ని నిబంధనల మేరకు ఎప్పుడైనా విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ మొత్తానికి ఎల్ఐసీ 5.5% వడ్డీ కూడా ఇస్తుంది.
- ఈ పాలసీపై పాలసీదారుడు లోన్ కూడా తీసుకోవచ్చు.