Personal loan tips : అసలు పర్సనల్ లోన్ తీసుకోవడం మంచిదేనా? ఇవి కచ్చితంగా తెలుసుకోవాలి..
27 October 2024, 8:00 IST
- Personal Loan Dos and Don'ts : పర్సనల్ తీసుకోవడం మంచిదేనా? లేక మన మీద ఆర్థిక భారం మరింత పడుతుందా? అసలు పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఏం చూడాలి? మీ ప్రశ్నలకు సమాధాలను ఇక్కడ తెలుసుకోండి..
అసలు పర్సనల్ లోన్ తీసుకోవడం మంచిదేనా?
డబ్బు అవసరం ఎప్పుడు, ఎలా, ఏ విధంగా వస్తుందో ఎవరికి తెలియదు. ఆ సమయంలో చాలా మంది పర్సనల్ లోన్ తీసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే, అసలు పర్సనల్ లోన్ తీసుకోవడం మంచిదేనా? లేక మన మీద మరింత ఆర్థిక భారం పడుతుందా? వంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను ఇక్కడ తెలుసుకోండి..
పర్సనల్ లోన్ అంటే ఏంటి..
పర్సనల్ లోన్ అనేది బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల ద్వారా అందించే అసురక్షిత రుణం. దీనికి పూచీకత్తు అవసరం లేదు. అంటే అప్పు తీసుకోవడానికి మీరు ఎలాంటి ఆస్తులను తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు! తీసుకున్న రుణాన్ని ఒకటి నుంచి ఐదు సంవత్సరాల లోపు తిరిగి చెల్లించే ఆప్షన్ ఉంటుంది. సెక్యూర్డ్ రుణాలతో పోలిస్తే వ్యక్తిగత రుణాలు తరచుగా అధిక వడ్డీ రేట్లతో వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. అందుకే తెలివిగా వ్యవహరించడం చాలా అవసరం.
పర్సనల్ లోన్‌లో మంచి విషయాలు..
క్విక్ ఫండ్స్ యాక్సెస్: వ్యక్తిగత రుణాలను త్వరగా, తరచుగా కొన్ని రోజుల్లో ఆమోదిస్తారు. ఇవి అత్యవసర ఆర్థిక అవసరాలకు అద్భుతమైన ఆప్షన్‌గా మారుతాయి.
ఫ్లెక్సిబిలిటీ: వివాహానికి నిధులు సమకూర్చడం నుంచి వైద్య ఖర్చులను కవర్ చేయడం లేదా రుణాలను ఏకీకృతం చేయడం వరకు వివిధ ప్రయోజనాల కోసం ఈ పర్సనల్ లోన్స్‌ని ఉపయోగించవచ్చు.
ఏ పూచీకత్తు అవసరం లేదు: ఈ రుణాలు అన్సెక్యూర్డ్ కాబట్టి, మీరు మీ ఆస్తులను రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇది చాలా మంది రుణగ్రహీతలకు ఉపశమనం కలిగిస్తుంది.
ఫిక్స్డ్ వడ్డీ రేట్లు: పర్సనల్ లోన్స్‌లో వడ్డీ రేటు అధికంగా ఉంటుంది. కానీ అది ఫిక్స్‌డ్‌గా ఉండటం ప్లస్ పాయింట్. వడ్డీ రేట్లల్లో హెచ్చుతగ్గుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.
పర్సనల్ లోన్‌తో ఈ ఇబ్బందులు..
అధిక వడ్డీ రేట్లు: అసురక్షిత స్వభావం కారణంగా, వ్యక్తిగత రుణాలు తరచుగా సురక్షిత రుణాలతో పోలిస్తే.. అధిక వడ్డీ రేట్లను కలిగి ఉంటాయి. ఇది తిరిగి చెల్లించే మొత్తాలను పెంచడానికి దారితీస్తుంది.
క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం: పర్సనల్ లోన్ తీసుకోవడం మీ క్రెడిట్ స్కోర్ పై ప్రభావం చూపుతుంది! ప్రత్యేకించి మీరు సకాలంలో చెల్లింపులు చేయడంలో విఫలమైతే క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది.
ఫీస్, ఛార్జీలు: చాలా మంది రుణదాతలు ప్రాసెసింగ్ ఫీజులు, లేట్ ఫీజ్, ఫైన్, ముందస్తు చెల్లింపు ఛార్జీలను విధిస్తారు. ఇది మొత్తం ఖర్చును మరింత పెంచుతుంది.
అప్పుల ఊబి: తెలివిగా ఉండకపోతే, పర్సనల్ లోన్‌తో మీ అప్పులు మరింత పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. మరీ ముఖ్యంగా మీరు ఇప్పటికే అనేక వడ్డీలు తీసుకుని ఉంటే చాలా కష్టమవుతుంది.
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఇవి ఆలోచించుకోండి..
మీ ఆర్థిక పరిస్థితిని అంచనా వేయాలి: పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు, మీ ఆర్థిక పరిస్థితిపై మీకు అవగాహన ఉండాలి. మీ ఆదాయం, ఖర్చులు, ఇప్పటికే ఉన్న అప్పులను పరిగణనలోకి తీసుకోండి. మీరు ఎంత రుణం తీసుకొని తిరిగి చెల్లించగలరో నిర్ణయించుకోండి.
తక్కువ వడ్డీ రేట్ల కోసం ప్రయత్నించండి: రుణదాతల మధ్య వడ్డీ రేట్లు గణనీయంగా మారవచ్చు. మీ అవసరాలకు తగిన బెస్ట్ డిల్స్ని కనుగొనడానికి వివిధ బ్యాంకుల పర్సనల్ లోన్స్‌ని స్కాన్ చేయండి.
నిబంధనలు, షరతులను అర్థం చేసుకోండి: రుణ ఒప్పందాన్ని క్షుణ్ణంగా చదవండి. వడ్డీ రేట్లు, రీపేమెంట్ నిబంధనలు, రుణానికి సంబంధించిన ఏవైనా అదనపు రుసుముల ఉంటే, వాటిని అర్థం చేసుకోండి.
మీ రీపేమెంట్ని ముందే ప్లాన్ చేయండి: లోన్ తీసుకునే ముందు రీపేమెంట్ ప్లాన్స్ వేసుకోండి. నెలవారీ వాయిదాలు మీ బడ్జెట్‌కు ఎలా సరిపోతాయో చూసుకోండి. మీరు వాటిని ఒత్తిడి లేకుండా నిర్వహించగలరని నిర్ధారించుకోండి.
పర్సనల్ లోన్ విషయంలో ఇలా చేయకండి..
మీ అవసరానికి మించి అప్పు తీసుకోకండి: భవిష్యత్తు ఖర్చుల కోసం పెద్ద మొత్తంలో అప్పు తీసుకోవడం ఒక్కోసారి మంచి విషయం అనిపిస్తుంది. కానీ మీకు అవసరమైనది మాత్రమే తీసుకోండి. ఇది మీ చెల్లింపులను నిర్వహించదగినదిగా ఉంచుతుంది. అనవసరమైన రుణాన్ని నివారిస్తుంది.
ఖర్చులను విస్మరించవద్దు: ప్రాసెసింగ్ ఫీజులు, ఆలస్య చెల్లింపు ఛార్జీలు, ముందస్తు చెల్లింపు పెనాల్టీలు మీ రుణ వ్యయాన్ని గణనీయంగా పెంచుతాయి. మీ మొత్తం రుణ వ్యయంలో వీటిని పరిగణనలోకి తీసుకోవాలని నిర్ధారించుకోండి.
తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి: అన్ని అంశాలను అర్థం చేసుకోవడానికి మీరు సమయాన్ని తీసుకోండి. లేకపోతే మీపై ఆర్థిక ఒత్తిడి పెరగొచ్చు.
పేమెంట్స్ మిస్ అవ్వకండి: అధిక వడ్డీ రేట్లు ఉండే పర్సనల్ లోన్ రీపేమెంట్ని మిస్ అయితే, మీ మీద మరింత భారం పడుతుంది. అందుకే పేమెంట్స్‌ని అస్సలు మిస్ అవ్వకుండా ప్లాన్ చేసుకోండి.