Scooter sales surge: స్కూటర్ల సేల్స్ పెరిగాయి.. మోటార్ సైకిళ్ల సేల్స్ తగ్గాయి..
05 January 2023, 23:07 IST
Scooter sales surge: భారతీయ ఆటో మొబైల్ మార్కెట్లో గత సంవత్సరం ద్విచక్ర వాహనాల అమ్మకాలు అంత ఆశాజనకంగా లేవు. అంతకుముందు సంవత్సరం(2021) డిసెంబర్ తో పోలిస్తే, గత సంవత్సరం(2022) డిసెంబర్ లో మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాలు 11% తగ్గాయి.
ప్రతీకాత్మక చిత్రం
Scooter sales surge: 2022 డిసెంబర్ లో భారత్ లో ఒకవైపు స్కూటర్ల అమ్మకాలు పెరగగా, మోటార్ సైకిళ్ల అమ్మకాలు తగ్గాయి. భారత్ లో నిజానికి మోటార్ సైకిల్ అమ్మకాలే ఎక్కువగా ఉంటాయి. కానీ, క్రమంగా వాటి సేల్స్ తగ్గుతుండగా, యాక్టివా, జూపిటర్, స్కూటీ, వెస్పా, యాక్సెస్ వంటి స్కూటర్ల అమ్మకాలు పెరుగుతున్నాయి.
Scooter sales surge: స్కూటర్ల సేల్స్ లో పెరుగుదల
ఈ ఆర్థిక సంవత్సరంలో మిగతా నెలలతో పోలిస్తే, 2022 డిసెంబర్ నెలలో స్కూటర్ సేల్స్ గణనీయంగా పెరిగాయి. మోటార్ సైకిళ్ల సేల్స్ తగ్గాయి. 2021 డిసెంబర్ తో పోలిస్తే, 2022 డిసెంబర్ లో స్కూటర్ సేల్స్ బాగా పెరిగాయని టీవీఎస్ మోటార్స్, హీరో మోటోకార్ప్, సుజుకీ తదితర సంస్థలు వెల్లడించాయి. మొత్తం దేశీయ టూ వీలర్ సేల్స్ లో స్కూటర్ల వాటా ఎక్కువగా ఉండడం 2018 ఆర్థిక సంవత్సరం తరువాత ఇదే ప్రథమం. ఆ సంవత్సరం స్కూటర్ల అమ్మకాలు 33.8% కాగా, 2022 ఏప్రిల్ - నవంబర్ కాలంలో స్కూటర్ల అమ్మకాలు 32.9%. హీరో మోటోకార్ప్ మోటార్ సైకిళ్ల అమ్మకాలు 2021 డిసెంబర్ తో పోలిస్తే, 2022 డిసెంబర్ నెలలో 6% తగ్గాయి. కానీ, ఇదే కాలానికి స్కూటర్ సేల్స్ మాత్రం 109% పెరిగాయి.
Scooter sales surge: కారణాలేంటి?
అర్బన్ ప్రాంతాల్లో అధికాదాయ వర్గాలు ఎక్కువగా స్కూటర్లను కొనుగోలు చేస్తారన్నది ఒక అధ్యయనం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మోటార్ సైకిల్ అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. కోవిడ్ ప్రతికూలతలు తగ్గుముఖం పట్టడంతో పాటు అర్బన్ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరగవడం, స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోవడం.. తదితర కారణాల వల్ల స్కూటర్ సేల్స్ పెరిగాయని భావిస్తున్నారు. స్కూటర్ సేల్స్ పెరుగుతున్న నేపథ్యంలో, అన్ని ద్విచక్ర వాహన తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ బైక్ లపై దృష్టి పెడుతున్నాయి. పెట్రోలు ధరలు పెరుగుతుండడంతో, సాధారణంగా రోజువారీగా ఎక్కువ దూరం ప్రయాణించని వారు విద్యుత్ ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేస్తున్నారు.