తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hyundai Ipo : దేశంలో బాహుబలి ఐపీఓ హ్యుందాయ్.. 8 శాతం సబ్‌స్క్రైబ్, గ్రే మార్కెట్‌లో ధర పతనం!

Hyundai IPO : దేశంలో బాహుబలి ఐపీఓ హ్యుందాయ్.. 8 శాతం సబ్‌స్క్రైబ్, గ్రే మార్కెట్‌లో ధర పతనం!

Anand Sai HT Telugu

15 October 2024, 13:15 IST

google News
  • Hyundai Motor IPO Subscription Status : దేశంలోనే అతిపెద్ద ఐపీఓ హ్యుందాయ్ మోటార్ ఇండియా ప్రారంభమైంది. మెుదలైన వెంటనే 8 శాతం సబ్‌స్క్రైబ్ అయింది. అక్టోబర్ 17 వరకు ఇన్వెస్టర్లు ఈ ఇష్యూలో ఇన్వెస్ట్ చేయవచ్చు.

హ్యూందాయ్ ఐపీఓ
హ్యూందాయ్ ఐపీఓ

హ్యూందాయ్ ఐపీఓ

అతిపెద్ద ఐపీఓ అయిన హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీఓ అక్టోబర్ 15 మంగళవారం నుంచి పెట్టుబడులకు తెరుచుకుంది. బిఎస్ఇ డేటా ప్రకారం హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ మొదటి రోజు రాత్రి 11:09 గంటల వరకు 8 శాతం సబ్ స్క్రైబ్ అయింది. అక్టోబర్ 17 వరకు ఇన్వెస్టర్లు ఈ ఇష్యూలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఒక్కో షేరు ధరను రూ.1,865-1,960గా నిర్ణయించారు. దక్షిణ కొరియా ఆటోమొబైల్ తయారీ సంస్థ హ్యుందాయ్ భారతీయ విభాగమైన హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ తన ఐపీఓకు ఒక రోజు ముందు సోమవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుండి రూ .8,315 కోట్లు సేకరించింది.

ఈ ఐపీవో విలువ రూ.27,870 కోట్లు (సుమారు 3.3 బిలియన్ డాలర్లు). గతంలో ఎల్ఐసీ ఐపీవో పరిమాణం రూ.21,000 కోట్లుగా ఉండేది. భారత్లో పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ 2021 నవంబర్లో రూ.18,300 కోట్ల ఐపీఓను తీసుకొచ్చింది. కోల్ ఇండియా లిమిటెడ్ 2010 అక్టోబర్లో రూ.15,199 కోట్ల ఐపీఓను ప్రారంభించింది. 2008 జనవరిలో రిలయన్స్ పవర్ రూ.11,563 కోట్ల ఐపీఓను ప్రారంభించింది.

నివేదికల ప్రకారం గ్రే మార్కెట్లో రూ.40 ప్రీమియంతో కంపెనీ షేర్లు అందుబాటులో ఉన్నాయి. అంటే హ్యుందాయ్ మోటార్ షేరు 2 శాతం ప్రీమియంతో రూ.2000 వద్ద లిస్ట్ కావచ్చు. గ్రే మార్కెట్లో ఇప్పటివరకు ఈ స్టాక్ 92 శాతం పడిపోయింది. ఇది కూడా నెగిటివ్ లిస్టింగ్ కు సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. సెప్టెంబర్ 27న ఈ షేర్లు గ్రే మార్కెట్లో రూ.570 ధరకు లభ్యమయ్యాయి. అప్పటి నుంచి గ్రే మార్కెట్లో ఈ స్టాక్ ప్రతిరోజూ పతనమవుతోంది. (గ్రే మార్కెట్ అనేది ఒక సమాంతర అనధికారిక మార్కెట్‌గా ఉంది. ఇక్కడ పెట్టుబడిదారులు ఎక్స్ఛేంజీలలో అధికారిక జాబితాకు ముందు అప్లికేషన్లు లేదా షేర్ల కోసం వ్యాపారం చేస్తారు.)

న్యూ వరల్డ్ ఫండ్ ఇంక్, సింగపూర్ సర్కార్, ఫిడిలిటీ ఫండ్స్, బ్లాక్ రాక్ గ్లోబల్ ఫండ్స్, జేపీ మోర్గాన్ ఫండ్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి కంపెనీలు షేర్లను కేటాయించిన యాంకర్ ఇన్వెస్టర్లలో ఉన్నాయి. కంపెనీ ఐపీఓలో హ్యుందాయ్ మోటార్(ప్రమోటర్ సెల్లింగ్ షేర్ హోల్డర్) 142,194,700 ఈక్విటీ షేర్లను విక్రయించే అవకాశం ఉంది. ఈ ఐపీఓ పూర్తిగా ఓఎఫ్ఎస్‌పై ఆధారపడి ఉంటుంది.

1996లో భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ సంస్థ ఇప్పటికే వివిధ విభాగాల్లో 13 మోడళ్లను విక్రయించింది. రెండు దశాబ్దాల తర్వాత ఒక వాహన తయారీ సంస్థ తన ఐపీఓను తీసుకురావడంతో అందరికీ ఆసక్తి నెలకొంది. అంతకుముందు జపాన్ ఆటోమొబైల్ తయారీ సంస్థ మారుతి సుజుకి 2003లో ఐపీఓను తీసుకొచ్చింది. ఈక్విటీ షేర్ల లిస్టింగ్ ద్వారా కంపెనీ విజిబిలిటీ, బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని, షేర్లకు లిక్విడిటీ, పబ్లిక్ మార్కెట్ లభిస్తుందని హ్యుందాయ్ భావిస్తోంది. ఈ భారీ ఐపీఓతో హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశంలో తమ వాహనాలకు ఉన్న బలమైన డిమాండ్‌ను చూపించాలనుకుంటోంది. ఈ ఆఫర్ ద్వారా ఇన్వెస్టర్ల ఆసక్తి గణనీయంగా పెరుగుతుందని కంపెనీ భావిస్తోంది.

తదుపరి వ్యాసం