Cars were sold in Pakistan in 2023: గత సంవత్సరం పాకిస్తాన్ లో అమ్ముడుపోయిన కార్ల సంఖ్య ఎంత తక్కువో తెలుసా..?
08 February 2024, 13:55 IST
Cars were sold in Pakistan in 2023: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ లో గత సంవత్సరం అమ్ముడుపోయిన కార్లు ఎన్నో తెలుస్తే ఆశ్చర్యానికి గురవుతారు. ఆర్థిక మాంద్యం, ఉగ్రవాద సమస్య, దారుణంగా పెరిగిన ద్రవ్యోల్బణం తదితర సమస్యలతో పాకిస్తాన్ ఇబ్బందులు పడుతోంది.
ప్రతీకాత్మక చిత్రం
పాకిస్తాన్ లో 2023 లో కార్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో కనిష్టానికి పడిపోయాయి. ముఖ్యంగా, అధిక ధరలు, పౌరుల్లో తగ్గిపోయిన ఆర్థిక స్థోమత, ఆర్థిక వ్యవస్థ పతనం వంటి కారణాల వల్ల ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు దాదాపు శూన్యమయ్యాయి. 1,300 సీసీ కంటే ఎక్కువ, 1,000 సీసీ- 1,300 సిసి మధ్య, 1,000 సీసీ కంటే తక్కువ విభాగాలలో అమ్మకాలు దారుణంగా పడిపోయాయి.
30 వేల కార్లు మాత్రమే..
పాకిస్తాన్ ఆటోమోటివ్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (PAMA) వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం, 2023లో పాకిస్తాన్ లో అమ్ముడయిన మొత్తం కార్ల సంఖ్య 30,662 మాత్రమే. 1,000 cc లోపు ఉన్న సెగ్మెంట్‌లో గరిష్టంగా 14,584 యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయి. సుజుకీ బోలాన్ (ఓమ్ని వ్యాన్), ఆల్టో వంటి మోడల్‌ల లో మాత్రమే కొంత సేల్స్ జరిగాయి. 1,000 cc సెగ్మెంట్‌లో, సుజుకీ కల్టస్ (సెలెరియో), వ్యాగన్ఆర్ వంటి మోడళ్లు కొంత ఎక్కువగా సేల్ అయ్యాయి. గతేడాది మొత్తంగా ఈ విభాగంలో 3,737 యూనిట్లు అమ్ముడయ్యాయి. మరియు 1,300 cc ప్లస్ విభాగంలో, హోండా సిటీ, హోండా సివిక్, సుజుకి స్విఫ్ట్, టయోటా కరోలా, టయోటా యారిస్ వంటి మోడల్స్ 12,341 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2022 తో అమ్ముడయిన కార్లతో పోలిస్తే, 2023 లో సగానికన్నా తక్కువ కార్లు అమ్ముడయ్యాయి. 2022 లో మొత్తం 68,912 యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి.
పాకిస్తాన్ ఆటోమోటివ్ పరిశ్రమ
పాకిస్తాన్‌లోని మొత్తం ఆటోమోటివ్ పరిశ్రమ కష్టాల్లో ఉండగా, ఎక్కువ నష్టపోయిన విభాగం కార్ల మార్కెట్. పెరుగుతున్న కార్ల ధరలు, పదేపదే ఉత్పత్తి షెడ్యూల్ సస్పెన్షన్‌లు, స్థానిక కరెన్సీ విలువ క్రాష్ కావడం కార్ల అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపింది. మరోవైపు, వడ్డీ రేట్లు కొత్త గరిష్టాలను తాకడంతో ఫైనాన్సింగ్ కూడా కార్ల అమ్మకాలకు సహాయపడలేదు.