Income Tax Returns: ఐటీఆర్ ఫామ్ 1, ఫామ్ 4 లను విడుదల చేసిన ఆదాయ పన్ను శాఖ
23 December 2023, 16:10 IST
- Income Tax Returns: 2024-25 మదింపు సంవత్సరానికి సంబంధించి ఇన్ కం టాక్స్ రిటర్న్స్ ఫామ్ 1, ఫామ్ 4(Income Tax Return form 1, form 4) లను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ ఐటీఆర్ ఫామ్స్ ను సాధారణంగా మార్చి నెల చివరలో లేదా, ఏప్రిల్ మొదటి వారంలో ప్రకటిస్తారు.
ప్రతీకాత్మక చిత్రం
Income Tax Returns: 2024-25 అసెస్‌మెంట్ ఈయర్ (AY) కోసం రూ. 50 లక్షల వరకు వార్షిక ఆదాయం కలిగిన వ్యక్తులు, సంస్థల కోసం ITR ఫామ్ 1, ఫామ్ 4 (Income Tax Return form 1, form 4) లను శనివారం ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసింది.
ఎవరి కోసం..
రూ. 50 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (HUF) , సంస్థలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 2023-మార్చి 2024) వృత్తివ్యాపారాల ద్వారా సంపాదిస్తున్న వారు ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి రిటర్న్‌లను దాఖలు చేయడం ప్రారంభించవచ్చు. ఈ ఐటీఆర్ ఫామ్స్ (ITR form 1, form 4) ను సాధారణంగా మార్చి నెల చివరలో లేదా, ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేస్తారు. కానీ ఈ సంవత్సరం డిసెంబర్ చివర్లోనే విడుదల చేయడం విశేషం.
సహజ్, సుగమ్
ITR ఫామ్ 1 (SAHAJ), ITR ఫామ్ 4 (SUGAM) అనేవి చిన్న తరహా, అలాగే, మధ్య తరహా పన్ను చెల్లింపుదారుల కోసం రూపొందించబడిన సరళీకృత ఫామ్‌లు. ఐటీ శాఖ శుక్రవారం అధికారికంగా ఈ ఫామ్‌లను నోటిఫై చేసింది. రూ. 50 లక్షల వరకు ఆదాయం ఉన్న భారత్ లో నివసిస్తున్న వ్యక్తులకు ఐటీఆర్ ఫామ్ 1 సహజ్ (Sahaj) వర్తిస్తుంది. అలాగే, వేతనం ద్వారా ఆదాయం పొందుతున్నవారు, ఒక ఇంటి నుంచి ఆదాయం ఉన్న వ్యక్తులు, వడ్డీల వంటి ఇతర ఆదాయ మార్గాలు ఉన్నవారు, రూ. 5 వేల వరకు వ్యవసాయ ఆదాయం ఉన్నవారు ఐటీఆర్ ఫామ్ 1 సహజ్ ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల ద్వారా రూ. 50 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారు ఫామ్ 4 ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
20 శాతం వృద్ధి
2023-24 ఆర్థిక సంవత్సరంలో, ఈ డిసెంబర్ 7వ తేదీ నాటికి రూ. 13,70,388 కోట్ల ప్రత్యక్ష పన్నులు వసూలు అయ్యాయని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, ఇది దాదాపు 20% అధికం. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2022-23) రూ. 11,35,754 కోట్ల ప్రత్యక్ష పన్నులు వసూలు అయ్యాయి.