Credit Score vs Credit Report: క్రెడిట్ స్కోర్, క్రెడిట్ రిపోర్ట్ ల మధ్య తేడాలేంటి? రుణం పొందడంలో అవి ఎలా ఉపయోగపడతాయి?
25 November 2023, 16:55 IST
Credit Score vs Credit Report: క్రెడిట్ స్కోర్, క్రెడిట్ రిపోర్ట్ లు ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా ఏదైనా లోన్ తీసుకోవాలంటే, బ్యాంక్స్, లేదా ఇతర సంస్థలు లోన్ కోరుతున్నవారి క్రెడిట్ స్కోర్, క్రెడిట్ రిపోర్ట్ ల పైననే ఆధారపడుతున్నాయి. అయితే, ఈ రెండూ ఒకటి కాదు. వీటి మధ్య చాలా తేడాలున్నాయి.
ప్రతీకాత్మక చిత్రం
Credit Score vs Credit Report: రుణం ఇవ్వడానికి బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ సంస్థలు, ఇతర ఫైనాన్స్ సంస్థలు ఎక్కువగా క్రెడిట్ స్కోర్, క్రెడిట్ రిపోర్ట్ లపై ఆధారపడుతున్నాయి. చాలా మందికి వీటిపై అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. సరైన క్రెడిట్ మేనేజ్మెంట్ లేని కారణంగా రుణాలు పొందలేకపోతున్నారు.
What is a credit score?: క్రెడిట్ స్కోర్ అంటే?
వ్యక్తుల లేదా సంస్థల క్రెడిట్ స్కోర్ (credit score) సాధారణంగా 300 నుంచి 900 మధ్య ఉంటుంది. ఆ స్కోర్ ఆధారంగా మీకు రుణం ఇవ్వవచ్చో లేదో బ్యాంకులు, ఇతర సంస్థలు నిర్ణయిస్తాయి. అంటే, మీరు రుణం పొందే యోగ్యతను మీ క్రెడిట్ స్కోర్ నిర్ణయిస్తుంది. మీ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే, మీ క్రెడిట్ యోగ్యత అంత మెరుగ్గా ఉంటుంది. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే, రుణం పొందడానికి అంత తక్కువ అవకాశం ఉంటుంది. క్రెడిట్ స్కోర్ 750 కంటే ఎక్కువ ఉంటే మంచి క్రెడిట్ స్కోర్‌గా పరిగణిస్తారు.
క్రెడిట్ స్కోర్ ను ఇలా లెక్క గడ్తారు
మీ గత క్రెడిట్ చరిత్ర, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా, మీ క్రెడిట్ స్కోర్ ను లెక్కిస్తారు. క్రెడిట్ స్కోర్ ను లైసెన్స్ పొందిన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు గణిస్తాయి. అందుకు ఈ కింది అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. అవి
1. పేమెంట్ హిస్టరీ
2. క్రెడిట్ వినియోగం
3. ఎన్నేళ్లుగా క్రెడిట్ వినియోగిస్తున్నారనే సమాచారం
4. క్రెడిట్ మిక్స్
5. ఇటీవల తెరిచిన క్రెడిట్ ఖాతాల సంఖ్య
What is a credit report?: క్రెడిట్ రిపోర్ట్ అంటే?
క్రెడిట్ రిపోర్ట్ లేదా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (CIR) ఆధారంగానే క్రెడిట్ స్కోర్ ను గణిస్తారు. మీ పూర్తి ఆర్థిక వ్యవహారాల సమచారం క్రెడిట్ రిపోర్ట్ (credit report) ద్వారా తెలుస్తుంది. మీరు ఉపయోగిస్తున్న క్రెడిట్ కార్డ్‌ల సంఖ్య, మీ పేరుపై ఉన్న యాక్టివ్ లోన్స్, మీ ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాలు, మీరు దరఖాస్తు చేసిన రుణాల సంఖ్య, మీ లోన్ రీపేమెంట్ హిస్టరీ సమగ్రంగా ఈ క్రెడిట్ రిపోర్ట్ లో ఉంటుంది. క్రెడిట్ రిపోర్ట్ లో ఈ కింది అంశాలు ప్రధానంగా ఉంటాయి.
1. క్రెడిట్ స్కోర్
2. పేరు, వయస్సు, పాన్ నంబర్ వంటి వ్యక్తిగత సమాచారం
3. చిరునామా, మొబైల్ నంబర్, ఇమెయిల్ ID లు మొదలైన వివరాలు.
4. మీరు చేస్తున్న ఉద్యోగం, లేదా ఉపాధి, లేదా వ్యాపారం వివరాలు
5. వివిధ రుణాల చెల్లింపుల్లో జరిగిన జాప్యం, డీఫాల్ట్ రుణాలు.. తదితర సమాచారం.
6. క్రెడిట్ అకౌంట్ సమాచారం
7. క్రెడిట్ ఎంక్వైరీ సమాచారం
క్రెడిట్ రిపోర్ట్ తో ఏం చేయాలి?
క్రెడిట్ స్కోర్‌ను, క్రెడిట్ రిపోర్ట్ ను క్రమం తప్పకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే మీ లోన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ సులభతరం కావడమే కాకుండా లోన్ మొత్తంపై తక్కువ వడ్డీ రేటును పొందే అవకాశం ఉంటుంది. లోన్ ఇచ్చేముందు రుణ దరఖాస్తుదారుల రుణ యోగ్యత, విశ్వసనీయతలను తెలుసుకోవడానికి క్రెడిట్ రిపోర్ట్ పై ఎక్కువగా ఆధారపడ్తారు. క్రెడిట్ రిపోర్ట్ లో తేడాలు, తప్పులు ఏమైనా ఉంటే, సరి చేసుకోవడం మంచిది.