ChatGPT search engine: గూగుల్ కు పోటీగా.. చాట్ జీపీటీ నుంచి కొత్త సెర్చ్ ఇంజిన్ ‘సెర్చ్ జీపీటీ’
26 July 2024, 15:38 IST
సెర్చ్ ఇంజిన్ గా మార్కెట్లో ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్న గూగుల్ గట్టి పోటీ ఎదురవనుంది. చాట్ జీపీటీ ని రూపొందించిన ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చ్ ఇంజిన్ ను తీసుకువస్తోంది. ఈ సెర్చ్ ఇంజిన్ కు ‘సెర్చ్ జీపీటీ’ అనే పేరు పెట్టింది. ఇది పూర్తిగా ఏఐ ఆధారిత సెర్చ్ ఇంజిన్ అని ఓపెన్ ఏఐ స్పష్టం చేసింది.
గూగుల్ కు పోటీగా.. చాట్ జీపీటీ నుంచి కొత్త సెర్చ్ ఇంజిన్
గూగుల్ సెర్చ్ ఇంజిన్ కు పోటీగా ఏఐ ఆధారిత సెర్చ్ ఇంజిన్ రాబోతుంది. చాట్ జీపీటీ ని రూపొందించిన ఓపెన్ ఏఐ ఈ సెర్చ్ ఇంజిన్ ను తీసుకువస్తోంది. దీనిపై ఇన్నాళ్లుగా వస్తున్న పుకార్లకు ఓపెన్ ఏఐ ఫౌండర్ సామ్ ఆల్ట్ మాన్ ఫుల్ స్టాప్ పెట్టారు. త్వరలో సెర్చ్ జీపీటీ పేరుతో ఏఐ ఆధారిత సెర్చ్ ఇంజిన్ ను తీసుకువస్తున్నట్లు ప్రకటించారు.
త్వరలో అందరికీ అందుబాటులో
ఈ కొత్త సెర్చ్ ఇంజిన్ ప్రస్తుతం 'ప్రోటోటైప్' దశలో ఉంది. వెయిటింగ్ లిస్ట్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంది. అయితే భవిష్యత్తులో వినియోగదారులందరికీ ఇది అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. కొత్త సెర్చ్ ఫీచర్ ‘సెర్చ్ జీపీటీ (SearchGPT)’ గురించి ఓపెన్ఏఐ ఒక బ్లాగ్ పోస్ట్ లో వివరించింది. "మేము సెర్చ్ జీపీటీని పరీక్షిస్తున్నాము. ఇది మా ఏఐ నమూనాలను వెబ్ (web) నుండి లభించే సమాచారంతో మిళితం చేయడానికి రూపొందించిన కొత్త ప్రోటోటైప్ సెర్చ్ ఇంజిన్ (Search engine). ఇది మీకు స్పష్టమైన, వేగవంతమైన, సరైన సమాధానాలు ఇస్తుంది" అని వివరించారు.
గూగుల్ తరహాలోనే..
సెర్చ్ జీపీటీ (SearchGPT) ప్రారంభ పేజీ గూగుల్ (GOOGLE) ను పోలి ఉంటాయి. దీన్ని ఓపెన్ చేయగానే "మీరు దేని కోసం చూస్తున్నారు?" అనే సందేశం కనిపిస్తుంది. సెర్చ్ క్వైరీని ఎంటర్ చేసిన తరువాత, మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓవర్ వ్యూ ఫీచర్ తో సమాధానం లభిస్తుంది. కచ్చితమై సమాధానంతో పాటు, సంబంధిత సమాచారాన్ని కూడా ఈ ఏఐ ఆధారిత సెర్చ్ ఇంజిన్ అందిస్తుంది.
సోర్స్ వివరాలు కూడా..
అలాగే సమాచారం ఎక్కడి నుండి తీసుకున్నారో వివరిస్తూ 2-3 లైన్ల వివరణను కూడా ఈ సెర్చ్ జీపీటీ ఇస్తుంది. యూజర్లకు పేజీ యొక్క ఎడమ వైపున లింక్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ వారు ఓపెన్ఎఐ (openAI) ఉదహరించిన అన్ని లింక్ లను వీక్షించవచ్చు. మరింత వివరణాత్మక సమాచారం పొందవచ్చు. అదనంగా, చాట్ జీపీటీ (chatGPT) మాదిరిగానే, వినియోగదారులు మరింత సమాచారాన్ని పొందడానికి ఫాలో-అప్ ప్రశ్నలు కూడా అడగవచ్చు.