తెలుగు న్యూస్  /  బిజినెస్  /  2022 In Review: బిట్‌కాయిన్ ఈథర్ సహా చతికిలపడ్డ క్రిప్టోకరెన్సీ

2022 in Review: బిట్‌కాయిన్ ఈథర్ సహా చతికిలపడ్డ క్రిప్టోకరెన్సీ

HT Telugu Desk HT Telugu

27 December 2022, 9:27 IST

google News
    • బిట్‌కాయిన్, ఇథేరియం సహా 2022లో క్రిప్టోకరెన్సీలన్నీ భారీగా తమ విలువను కోల్పోయాయి. మదుపరులకు నష్టాలను మిగిల్చాయి.
2022లో భారీగా పతనమైన క్రిప్టో కరెన్సీ
2022లో భారీగా పతనమైన క్రిప్టో కరెన్సీ (REUTERS)

2022లో భారీగా పతనమైన క్రిప్టో కరెన్సీ

2022వ సంవత్సరం క్రిప్టోకరెన్సీ మదుపరులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. గడిచిన 12 నెలల్లో దాదాపు అన్ని క్రిప్టో కరెన్సీలు తమ విలువను భారీగా కోల్పోయాయి. ప్రపంచంలో అత్యధికంగా ప్రాచుర్యం కలిగిన క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ ఈ ఏడాది భారీగా పతనమైంది. ఏడాది ప్రారంభంలో 46,208 డాలర్లుగా ఉన్న బిట్‌కాయిన్ విలువ మే 10వ తేదీ నాటికి 30 వేల డాలర్లకు పడిపోయింది. ఆ తరువాత వేగంగా జూన్ 19 నాటికి 18,958కి పడిపోయింది.

అయితే సెప్టెంబరు 13 నాటికి 22,400 డాలర్లకు కోలుకున్నప్పటికీ… తిరిగి డిసెంబరు 21కి 16,840 డాలర్లకు పడిపోయింది. మొత్తంగా ఈ ఏడాది మార్చి 30వ తేదీన బిట్‌కాయిన్ విలువ గరిష్టంగా 47,456 డాలర్లుగా ఉంది. 

బాగా ప్రాచుర్యం పొందిన బిట్‌కాయిన్ పరిస్థితే ఇలా ఉంటే, ఇక మిగిలిన క్రిప్టోల పరిస్థితి కూడా ఇందుకు మినహాయింపేమీ లేదు. 

బిట్‌కాయిన్ తరహాలోనే ఈథర్ కూడా 2022లో తన విలువను భారీగా కోల్పోయింది. 2022 ప్రారంభంలో ఇథేరియం 3,677 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. జనవరి 25 నాటికి దాని విలువ 2,442 డాలర్లకు పడిపోయింది.  ఏప్రిల్ 5 నాటికి స్వల్పంగా రికవర్ అయి 3,520 డాలర్లకు చేరింది. కానీ ఆ తరువాత వరుసగా నష్టాలు చవిచూసింది. జూన్ 19న ఈథర్ 1,000 డాలర్లకు పడిపోయింది. తిరిగి ఆగస్టు 15 నాటికి 1,935 డాలర్లకు చేరింది. ప్రస్తుతం డిసెంబరు 21న ఈథర్ 1,210 డాలర్ల వద్ద తచ్చాడుతోంది.

ఇక మరో పాపులర్ క్రిప్టోకరెన్సీ అయిన పోల్కాడాట్ కూడా ఈ ఏడాది భారీగా పతనమైంది. జనవరిలో 26.70 డాలర్లుగా ఉన్న పోల్కా డాట్ విలువ ప్రస్తుతం డిసెంబరు 21న 4.52 డాలర్లకు పడిపోయింది. అంటే సుమారు 83 శాతం మేర విలువను కోల్పోయింది. జనవరి 4న 30 డాలర్లకు చేరిన పోల్కా డాట్ జనవరి 23 నాటికి 18 డాలర్లకు పడిపోయింది. అప్పటి నుంచి క్రమంగా పడిపోతూ మే 13న 8.30 డాలర్లకు చేరింది. ఇక ఈ ఏడాది రెండో అర్ధ సంవత్సరంలో పోల్కాడాట్ విలువ సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. సెప్టెంబరు 3న 7.29 డాలర్లుగా, నవంబరు 11న 6 డాలర్లుగా ఉంది.

బాగా పడిపోయిన మార్కెట్ క్యాపిటలైజేషన్

క్రిప్టోకరెన్సీల మొత్తం విలువ గడిచిన ఏడాదికాలంలో భారీగా పతనమైంది. జనవరి 1న క్రిప్టోకరెన్సీ మార్కెట్ క్యాప్ 2.24 ట్రిలియన్లుగా ఉంది. జూన్ మాసానికి అది 900 బిలియన్ డాలర్లకు పడిపోయింది. జూలైలో స్వల్పంగా కోలుకుని 1 ట్రిలిన్‌కు చేరినా తిరిగి డిసెంబరు 21కి 810 డాలర్లకు పతనమైంది. గత ఏడాది నవంబరులో 3 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న క్రిప్టో మార్కెట్ విలువ మూడింట రెండొంతులు పడిపోయింది. 

ఇండియాలో కూడా క్రిప్టోకరెన్సీ సెంటిమెంట్ బాగా బలహీనంగా ఉంది. 2022-23 బడ్జెట్ సమయంలో ఆర్థిక మంత్రి క్రిప్టోకరెన్సీ లావాదేవీలపై వచ్చే లాభాల్లో 30 శాతం పన్ను విధిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే క్రిప్టో లావాదేవీలపై 1 శాతం టీడీఎస్ విధిస్తున్నట్టు ప్రకటించారు. ఇది ఇన్వెస్టర్ల ఆసక్తిని దెబ్బతీసింది. అయితే వచ్చే ఏడాది కూడా క్రిప్టో ఇన్వెస్టర్లకు ఎలాంటి శుభవార్త వినిపించే పరిస్థితి కనిపించేలా లేదు. 

కాయిన్ స్విచ్ నివేదిక ప్రకారం ఇండియాలో 1.9 కోట్ల మంది క్రిప్టో యూజర్లు ఉన్నారని, వీరిలో 8 శాతం మంది మహిళలని చెప్పారు. 2022 సంవత్సరంలో క్రిప్టో యూజర్లలో 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉన్న వారి సంక్య 45 శాతంగా ఉంది. ఇక 26 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారి సంఖ్య 34 శాతంగా ఉంది. ఇక మన దేశంలో బాగా పాపులర్ అయిన క్రిప్టోకరెన్సీగా బిట్‌కాయిన్ నిలిచింది. మొత్తం క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 12.12 శాతం బిట్‌కాయిన్‌దే. తదుపరి డోజీకాయిన్ 11.54 శాతం, ఇథేరియం 9.43 శాతం, షిబా ఐను 6.92 శాతం, పాలిగాన్ 4.13 శాతం, కార్డానో 3.47 శాతం, రిపుల్ 2.57 శాతంగా ఉంది.

టాపిక్

తదుపరి వ్యాసం