Crypto prices under pressure: మరింత పతనమైన క్రిప్టోకరెన్సీ.. ఇప్పుడు కొనొచ్చా?
17 November 2022, 9:22 IST
- క్రిప్టోకరెన్సీ ఏడాదిక్రితం వరకు అద్భుతంగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు అందులో నాలుగో వంతుకు పడిపోయింది.
ఎఫ్‌టీఎక్స్ దివాళా అభ్యర్థనతో పతనమవుతూ వస్తున్న బిట్‌కాయిన్ సహా ఇతర క్రిప్టోకరెన్సీ
క్రిప్టోకరెన్సీలో అత్యంత ప్రాచుర్యం కలిగిన డిజిటల్ కాయిన్ బిట్‌కాయిన్ ధర నేడు 2 శాతం తగ్గి 16,588 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గ్లోబల్ క్రిప్టో మార్కెట్‌క్యాప్ 1 ట్రిలియన్ డాలర్ల మార్క్ దిగువన ఉంది. గడిచిన 24 గంటల్లో సుమారు 870 బిలియన్ డాలర్ల విలువ కోల్పోయిందని కాయిన్‌గెకో తెలిపింది.
మరోవైపు రెండో అత్యంత ప్రాచుర్యం కలిగినది, ఎథేరియం బ్లాక్‌చైన్ టెక్నాలజీపై పనిచేసే ఈథర్ విలువ కూడా 4 శాతం పడిపోయి 1,208 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
‘జెనెసిస్ విత్‌డ్రాయల్స్ నిలిపివేస్తున్నట్టు ప్రకటించాక చాలావరకు క్రిప్టోకరెన్సీలన్నీ పడిపోయాయి. బిట్‌కాయిన్ ప్రస్తుతం 16,700 డాలర్లకు దిగువన ట్రేడవుతోంది. మంగళవారం బిట్‌కాయిన్ పెరిగినప్పటికీ, తాజా ద్రవ్యోల్భణ వార్తల కారణంగా ఆ దూకుడు నిలబడలేదు. బిట్‌కాయిన్ (బీటీసీ) 17,622 డాలర్ల దిగువన సుస్థిరంగా నిలబడగలిగితే క్రమంగా కోలుకునే అవకాశం ఉంటుంది. గడిచిన 24 గంటల్లో ఈథర్ 3 శాతం పడిపోయింది. అమ్మకందారుల బలాన్ని ఈ లాావాదేవీలు చూపుతున్నాయి. అమ్మకాల ఒత్తిడి ఉధృతమైతే ఈథర్ 1,100 డాలర్లకు పడిపోవచ్చు. అందువల్ల ఈథర్ తిరిగి పుంజుకోవాలంటే కొనుగోలుదారులు దానిని 1,300 డాలర్ల స్థాయికి పుష్ చేయాల్సి ఉంటుంది..’ అని మడ్రెక్స్ సీఈవో, కో-ఫౌండర్ ఈదుల్ పటేల్ విశ్లేషించారు.
మరోవైపు డాజీ కాయిన్ ధర 2 శాతం పడిపోయి 0.08 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. షిబా ఐను కూడా ఒక శాతం పడిపోయింది. గడిచిన 24 గంటల్లో ఇతర క్రిప్టోకరెన్సీలు బినాన్స్ యూఎస్‌డీ, అవలాంచ్, సొలానా, టెథర్, ఎక్స్‌ఆర్‌పీ, టెరా, ట్రాన్, లైట్‌కాయిన్, ఏప్‌కాయిన్, పాలిగాన్, కార్డనో, స్టెల్లార్, చైన్ లింక్, యూనిస్వాప్, పోల్కాడాట్ ధరలు కూడా పడిపోయాయి.
క్రిప్టో బ్రోకరేజ్ జెనెసిస్ రెడెంప్షన్స్‌ను సస్పెండ్ చేసింది. అసాధారణ రీతిలో విత్‌డ్రాయల్ కోసం అభ్యర్థనలు రావడంతో ఈ పనిచేసింది. ఎఫ్‌టీఎక్స్ సంక్షోభం కారణంగా ఈ అభ్యర్థనలు పెరిగాయి. జెనెసిస్ గ్లోబల్ క్యాపిటల్ లిక్విడిటీకి మించి విత్‌డ్రాయల్స్ రావడంతో ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్టు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.
ఎఫ్‌టీఎక్స్ దివాళా రక్షణ కోసం శుక్రవారం దరఖాస్తు చేసుకుంది. ఈ పరిణామం క్రిప్టోకరెన్సీ పరిశ్రమను కుదిపేసింది. ఈ ఏడాదిలో అత్యంత భారీస్థాయిలో కుదుపునకు కారణమైంది. ఈ కారణంగా బిట్‌కాయిన్, ఇతర డిజిటల్ అసెట్స్ అన్నీ భారీగా పతనమయ్యాయి. ఎఫ్‌టీఎక్స్ దివాళా రక్షణ పిటిషన్ దాఖలు చేయడంతో క్రిప్టో కరెన్సీ హోల్డర్లు అమ్మకాలకు తెగబడ్డారు. దీంతో అన్ని ప్లాట్‌ఫామ్స్‌పైన క్రిప్టోకరెన్సీ కుప్పకూలుతూ వచ్చింది.
(ఈ ఆర్టికల్‌తో ప్రస్తావించిన అభిప్రాయాలు, సిఫారసులు అనలిస్టులు, బ్రోకింగ్ కంపెనీల అభిప్రాయాలు.. హెచ్‌టీ తెలుగువి కావు..)
టాపిక్