తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Yurireddy On Ramoji: రామోజీ తుపాకీతో బెదిరించి సంతకాలు చేయించారన్న యూరీరెడ్డి

YuriReddy on Ramoji: రామోజీ తుపాకీతో బెదిరించి సంతకాలు చేయించారన్న యూరీరెడ్డి

Sarath chandra.B HT Telugu

17 October 2023, 13:58 IST

google News
    • YuriReddy on Ramoji: మార్గదర్శి చిట్‌‌ఫండ్స్‌ వ్యవహారంలో తుపాకీతో బెదిరించి సంతకాలు చేయాలని రామోజీరావు తమను ఒత్తిడి చేశారని  జీజే రెడ్డి తనయుడు యూరీ రెడ్డి ఆరోపించారు. చిట్‌ఫండ్స్‌ కంపెనీ ప్రమోటర్ అయిన తన తండ్రి షేర్లను బదలాయించడానికి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. 
రామోజీ బెదిరించారని ఆరోపించిన యూరీరెడ్డి
రామోజీ బెదిరించారని ఆరోపించిన యూరీరెడ్డి

రామోజీ బెదిరించారని ఆరోపించిన యూరీరెడ్డి

YuriReddy on Ramoji: మార్గదర్శి చిట్‌ఫండ్స్ కంపెనీ ప్రమోటర్లలో ఒకరైన జీజే రెడ్డి తనయుడు యూరీరెడ్డి రామోజీరావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. తుపాకీతో బెదిరించి తమను ఖాళీ కాగితాలపై సంతకాలు చేయాలని ఒత్తిడి చేశారని ఆరోపించారు. 2017లో డివిడెంట్‌ చెల్లింపు పేరుతో తమను నిర్బంధించి సంతకాలు తీసుకున్నారని చెప్పారు. తన న్యాయవాదితో కలిసి విజయవాడలో మీడియాతో మాట్లాడారు.

మార్గదర్శి చిట్స్ 1962లో ప్రారంభం అయ్యిందని, జీజే రెడ్డి అందులో ఫౌండర్ ప్రమోటర్‌గా ఉన్నారని యూరీరెడ్డి న్యాయవాది చెప్పారు. రూ.5000 తో రామోజీరావు మార్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభించారని, జీజే రెడ్డి 1985 లో మరణించారని చెప్పారు. మార్గదర్శి సంస్థలో తమకు షేర్లు ఉన్నాయనే విషయం యూరి రెడ్డి కి తెలియదని, మార్గదర్శిలో షేర్ల అంశం 2014లో పత్రికల ద్వారా యూరి రెడ్డి కి తెలిసిందని పేర్కొన్నారు.

2014లో కూడా జీజే రెడ్డికి మార్గదర్శిలో షేర్లు ఉన్నాయని, ఆర్వోసీలో విచారణ చేయిస్తే ఆయన పేరిటషేర్లు ఉన్నాయని తేలిందని చెప్పారు. మార్గదర్శి సంస్థలో 288 షేర్లు జీజే రెడ్డికి ఉన్నాయని, 1995 నుండి 2016 వరకు శైలజ కిరణ్ కి కేవలం 100 షేర్లు ఉన్నాయని వివరించారు. యూరిరెడ్డి కి ఆమె కంటే ఎక్కువగా తండ్రి నుంచి వచ్చినవి 288 షేర్లు ఉన్నాయని చెప్పారు.

అక్రమ బదలాయింపుపై యూరిరెడ్డి సిఐడికి ఫిర్యాదు చేశాక ఆక్టోబర్ 13 న కేసు నమోదు చేశారని వివరించారు. యూరి రెడ్డి ఆమోదం లేకుండా ఆయన పేరు మీద ఉన్న షేర్లు శైలజ కిరణ్ పెరు మీద మార్చారని, యూరిరెడ్డి కి షేర్లు బదలాయించాల్సిన అవసరం లేదన్నారు. తుపాకీతో బెదిరించి సంతకాలు పెట్టించి అక్రమంగా షేర్లు బదలాయించారని, ఇన్నాళ్లు ఈ వ్యవహారం మరుగున పడిపోయిందన్నారు.

రామోజీతో జరిగిన సమావేశంలో తమకు రావాల్సిన డివిడెంట్‌పై చర్చ జరిగిందని యూరిరెడ్డి చెప్పారు. ఇరుపక్షాల మధ్య చర్చల్లో డివిడెంట్‌ మీద చర్చించారని ఆ తర్వాత ప్రమోటర్ షేర్లను బదిలీ చేయాలని ఒత్తిడి చేశారని యూరిరెడ్డి ఆరోపించారు. షేర్ల బదలాయింపుకు తాను అంగీకరించలేదన్నారు. తన దగ్గర లాయర్, ఛార్టెడ్ అకౌంటెంట్ లేకుండా, రామోజీ రావు సామ్రాజ్యంలో బందీని చేసి సంతకాలు చేయాలని తనపై ఒత్తిడి చేశారన్నారు.

ఏడేళ్లుగా ఎందుకు బయటకు రాలేదని అంటే, సాధారణ లావాదేవీ అయితే, తనకు రెండు కోట్ల లాభం వస్తే తాను సంతోషించే వాడినని, తన సోదరుడు డాక్టర్‌గా ఉన్నారని వారికి భయపడి ఇన్నాళ్లు మాట్లాడలేదన్నారు. ప్రేగ్ నుంచి తన సోదరుడు కూడా వచ్చి రామోజీని కలిశారని చెప్పారు.

తమ తండ్రి చనిపోయాక మార్గదర్శి షేర్ల సంగతి తెలిసిందన్నారు. 2017లోనే ఆర్వోసికి తాను లేఖ రాశానని, తనకు సమాధానం రాలేదన్నారు. తనను గదిలో బంధించి గన్‌ పాయింట్‌లో బెదిరించడం వల్ల తాము ఏమి చేయలేకపోయామని వివరించారు. తనకు స్థానికంగా ఎవరి మద్దతు లేదని, 1997 లో నేను ఆర్ ఓ సి లో బాలన్స్ షీట్ తీసుకున్నపుడు షేర్ల సంగతి తెలిసిందన్నారు.

షేర్ల వ్యవహారంపై రామోజీరావు ని చాలా సార్లు అడిగానని, రామోజీరావు తనకు అబద్ధం చెప్పడం నచ్చలేదన్నారు. రామోజీరావు పాకెట్ మనీ అని అబద్ధం చెప్పారన్నారు. ఏపి సిఐడి చేస్తున్న దర్యాప్తు చేసిన తీరు మీద నమ్మకం తోనే ఎపి లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

డివిడెండ్, షేర్లు వ్యవహారంలో రెండు వేర్వేరు అంశాల కోసం రామోజీరావును కలిశానని చెప్పారు. ఈ ఘటనతో తాను తీవ్రంగా భయపడ్డానని చెప్పారు. తన న్యాయపోరాటం కొనసాగిస్తామన్నారు.

తదుపరి వ్యాసం