YSR Cheyuta : వైెస్సార్ చేయూత దరఖాస్తుల గడువు పొడిగింపు…..
10 September 2022, 10:39 IST
- వైఎస్సార్ చేయూత పథకం ద్వారా మహిళలకు ఆర్ధిక సాయం అందించే పథకానికి దరఖాస్తుల గడువును మరోసారి పొడిగించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పథకం ద్వారా కొత్త లబ్ది దారుల్ని ఎంపిక చేసేందుకు సెప్టెంబర్ 11 వరకు YSR Cheyuta గడువును పొడిగించారు.
వైఎస్సార్ చేయూత దరఖాస్తుల గడువు పొడిగింపు
45ఏళ్ల వయసు నిండిన మహిళలకు ఏపీ ప్రభుత్వం అందించే ఆర్థిక సాయానికి దరఖాస్తుల గడువు తేదీని మరోసారి పొడిగించారు. వైఎస్సార్ చేయూత పథకం కోసం దరఖాస్తులు సమర్పించడానికి సెప్టెంబర్ 11వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల్లోని 45-60 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏడాదికి రూ.18,750 రుపాయల ఆర్ధిక సాయం అందిస్తారు. నాలుగు విడతల్లో రూ.75వేల రుపాయల్ని మహిళల స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు విడతలుగా ఈ పథకం ద్వారా ఆర్ధిక లబ్ది కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25లక్షల మంది మహిళలకు రూ.9,179.67 కోట్ల రుపాయల్ని ప్రభుత్వం చెల్లించింది.
సెప్టెంబర్ 22న రాష్ట్ర ప్రభుత్వం మూడో విడత వైఎస్సార్ చేయూత పథకంలో లబ్దిదారులకు నిధులు విడుదల చేయనుంది. సెప్టెంబర్ 5 నుంచి కొత్త లబ్దిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తుదారులకు సమాచారం అందలేదనే ఉద్దేశంతో తొలుత 7వ తేదీ వరకు గడువు పొడిగించారు. తాజాగా ఈ గడువును మరోసారి పొడిగించారు. 11వ తేదీ లోపు అర్హులైన లబ్దిదారులు ప్రభుత్వ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పథకం అర్హతలు ఇవే…
చేయూత పథకంలో చేరాలని భావించే వారు కచ్చితంగా అర్హతులు కలిగి ఉండాలి. 45 ఏళ్ల వయసు తప్పనిసరి. అలాగే 60 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు పథకంలో చేరొచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు మాత్రమే జగన్ ప్రభుత్వం అందిస్తున్న ఈ చేయూత స్కీమ్ వర్తిస్తుంది. అలాగే ఆధార్ కార్డులోని వయసును ప్రామాణికంగా తీసుకుంటారు. అందువల్ల ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
కావాల్సిన డాక్యుమెంట్లు ఇవే…
వైఎస్సార్ చేయూత పథకంలో చేరాలని భావించే వారు కొన్ని డాక్యుమెంట్లను కచ్చితంగా కలిగి ఉండాలి. చిరునామా రుజువు, ఆధార్ కార్డ్ కుల ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, వయస్సు ధృవీకరణ, బ్యాంక్ ఖాతా పాస్‌బుక్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, మొబైల్ నంబర్, రేషన్ కార్డు ఉండాలి.