Minor Rape and Murder: అల్లూరి జిల్లా చింతపల్లిలో గిరిజన బాలికపై అత్యాచారం, హత్య.. వీడిన మిస్టరీ
11 January 2024, 13:42 IST
- Minor Rape and Murder: ఏజెన్సీ ప్రాంతంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసి.. విషయం బయటకు తెలుస్తుందని దారుణంగా హతమార్చిన ఘటన వెలుగు చూసింది. నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
గిరిజన బాలికపై అత్యాచారం, హత్య
Minor Rape and Murder: ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆమె విషయం బయటకు చెబుతుందనే అనుమానంతో దారుణ హత్యకు పాల్పడిన ఘటన పోలీసుల విచారణలో వెలుగు చూసింది. బాలికను ఇంట్లోనే ఉరేసి చంపి ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆపై ఎవరికైనా చెబుతుందనే అనుమానంతో చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నించారు. బాలిక తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లడంతో ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారానికి ఒడిగట్టి చంపేసినట్టు గుర్తించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకున్న కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను బుధవారం అరెస్టు చేసినట్లు చింతపల్లి అదనపు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు.
చింతపల్లి డివిజన్ పరిధిలోని గూడెంకొత్తవీధి మండలంలోని మారుమూల గ్రామానికి చెందిన బాలిక తల్లిదండ్రులు ఈనెల 2వ తేదీన వ్యవసాయ పనులకు వెళ్లారు. బాలిక ఒంటరిగా ఉండటం గమనించిన ఆటో డ్రైవర్ పాంగి రమేశ్ ఆమెను బెదిరించి మరో ఇంట్లోకి బలవంతంగా తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడు.
బాలికను లాక్కెళ్లడం కొందరు చిన్నారులు చూశారు. రమేశ్ తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు బాలిక తన బంధువుకు తెలిపింది. ఈ విషయం గ్రామంలో అందరికీ తెలిసిపోతుందని రమేశ్ భయపడ్డాడు. తన స్నేహితుడైన మరో ఆటోడ్రైవర్ సీతన్నకు జరిగిన విషయాన్ని చెప్పాడు. బాలిక తల్లిదండ్రులు ఇంటికి వచ్చేలోగా ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నారు.
మొదట రమేశ్ బాలిక ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత సీతన్న ఆమె ఇంట్లోకి వెళ్లారు. ప్రాణాలు తీస్తున్నాం కదా అనే ఉద్దేశంతో ఇద్దరూ కలిసి మరోసారి ఆమెపై అత్యాచారం చేశారు. ఆపై చీరతో గొంతుకు ముడి వేసి హత్య చేశారు. బాలిక చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించడానికి దూలానికి వేలాడదీసి పరారయ్యారు.
సాయంత్రం ఇంటికి వచ్చిన బాలిక తల్లిదండ్రులు కుమార్తె మృతి చెంది ఉండటంతో కన్నీరుమున్నీరయ్యారు. మరుసటి రోజు అంత్యక్రియల్లో భాగంగా మృతురాలికి స్నానం చేయిస్తుండగా శరీరంపై గాయాలు కనిపించడంతో తల్లిదండ్రులు అనుమానించారు. ఆ తర్వాత గ్రామంలో ఆటోడ్రైవర్ బాలికను లాక్కేళ్లడం గురించి చిన్నారులు చెప్పడంతో ఏదో జరిగి ఉంటుందని అనుమానించారు.
ఈనెల 5న గూడెంకొత్తవీధి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు గ్రామానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. ఖననం చేసిన మృతదేహాన్ని రెవెన్యూ అధికారులు, వైద్యుల సమక్షంలో బయటకు తీయించి పోస్టుమార్టం పూర్తి చేశారు. పోలీసుల దర్యాప్తుతో భయపడిన నిందితులు వీఆర్వో సాయంతో పోలీసుల ఎదుట లొంగిపోయారు. నిందితులపై పోక్సో కేసుతో పాటు అత్యాచారం, హత్య కేసులు నమోదు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు.