తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kakinada Ggh Doctors: హౌస్‌ సర్జన్ నిర్వాకం.. డయాలసిస్‌ రోగికి మరో గ్రూప్‌ రక్తం ఎక్కించడంతో మృతి చెందిన యువతి

Kakinada GGH Doctors: హౌస్‌ సర్జన్ నిర్వాకం.. డయాలసిస్‌ రోగికి మరో గ్రూప్‌ రక్తం ఎక్కించడంతో మృతి చెందిన యువతి

28 November 2024, 10:32 IST

google News
    • Kakinada GGH Doctors: హౌస్‌ సర్జన్ నిర్లక్ష్యం కాకినాడా జిజిహెచ్‌లో యువతి ప్రాణాలను బలి తీసుకుంది. కిడ్నీ సమస్యతో డయాలసిస్‌ ‌పై ఉన్న యువతికి ఓ గ్రూపు బదులు మరో గ్రూప్ రక్తాన్ని ఎక్కించడంతో ప్రాణాలు కోల్పోయింది. యువతి ప్రాణాలకు ఖరీదు కట్టిన వైద్యులు రూ.3లక్షలు చెల్లించి చేతులు దులుపుకున్నారు. 
వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందిన యువతి
వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందిన యువతి

వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందిన యువతి

Kakinada GGH Doctors: కాకినాడలో వైద్యుల నిర్లక్ష్యానికి యువతి బలైంది. జిజిహెచ్‌లో డయాలసిస్‌ పొందుతున్న యువతికి ఓ పాజిటివ్‌ బ్లడ్‌  ఎక్కించాల్సి ఉండగా హౌస్‌ సర్జన్ నిర్లక్ష్యంతో ఏబీ పాజిటివ్‌  రక్తాన్ని ఎక్కించడంతో ప్రాణాలు కోల్పోయింది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.3లక్షల పరిహారం చెల్లించి చేతులు దులుపు కున్నారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న మహిళకు ఓ పాజిటివ్‌ గ్రూప్ రక్తం ఎక్కించాల్సి ఉండగా ఏబీ పాజిటివ్ గ్రూప్ రక్తాన్ని ఎక్కించడంతో  అస్వస్థతకు గురై ప్రాణాలు విడిచింది.

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం వలమూరుకు చెందిన పెద్దింట్లుకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. పెద్ద కుమార్తె భావన శిరీష(34) భర్త విజయ్‌ కుమార్ ఉపాధి నిమిత్తం కువైట్‌లో  ఉన్నారు. ఈ దంపతులకు పిల్లలు లేకపోవడంతో శిరీష తల్లి వద్దే ఉంటున్నారు.

నాలుగేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్న శిరీష అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత నెల 14న శిరీష అస్వస్థతకు గురి కావడంతో  మెరుగైన వైద్యం కోసం  ఈ నెల 4న  కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఎం 5 యూనిట్‌లో చికిత్స అందిస్తున్నారు.   ఆస్పత్రికి వచ్చే సమయానికి ఆమెకు రక్తం తక్కువగా ఉండ టంతో  ఓ పాజిటివ్ గ్రూపు ఎక్కించాలని వైద్యులు సూచించారు. 

బాధితురాలి రక్త నమూనాలను రోగి బంధువులు ఆస్పత్రి ఆవరణలో ఉన్న బ్లడ్‌ బ్యాంకులో  ఇచ్చినట్టు తెలిపారు.  మంగళవారం సాయంత్రం ఏఎంసీయూ-2లో విధుల్లో ఉన్న హౌససర్జన్ ఒకరు  బ్లడ్ బ్యాంకు నుంచి రక్తం తీసుకొచ్చి ఆమెకు ఎక్కించారు. ఆ సమయంలో బ్లడ్‌ బ్యాగ్‌పై ఏబీ పాజిటివ్ రాసి ఉండటాన్ని శిరీష బంధువులు గుర్తించి  ప్రశ్నించారు. తనకే చెబుతావా అంటూ హౌస్ సర్జన్ వారికి నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్టు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈలోగా మరో పీజీ వైద్యురాలు 'ఓ  పాజిటివ్‌  గ్రూపు రక్తాన్ని ఎక్కించేందుకు  తీసుకొచ్చారు. అప్పటికే మరో గ్రూప్‌  ఎక్కిస్తున్నారని శిరీష బంధువులు చెప్పడంతో ఆమె అవాక్కయ్యారు. 

శిరీషకు సగం ఎక్కిన 'ఏబీ పాజిటివ్' గ్రూపు బ్లడ్‌   ప్యాకెట్  తొలగించి ఓ పాజిటివ్‌ గ్రూప్‌ రక్తాన్ని ఎక్కించారు.  ఈ క్రమంలో రోగి బిగుసుకు పోవడంతో ఇన్ఫెక్షన్, రియాక్షన్ చూపకుండా, బీపీకి అనుగుణంగా చికిత్స అందిం చారు. ఆక్సిజన్ కూడా అందించకపోవడంతో తీవ్రమైన ఆయాసంతో బుధవారం ప్రాణాలు విడిచినట్టు చెబుతున్నారు. 

బుధవారం ఉదయం శిరీష మృతిచెందడంతో  విషయాన్ని ఆసుపత్రి ఉన్నతాధికారులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నిరసనకు దిగిన తెలుపుతున్న మృతురాలి తల్లి, బంధువులతో ఆసుపత్రి అధికారులు చర్చించారు. ఘటనపై  విచారణ జరిపి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. బాధితురాలి తల్లికి  నష్ట పరిహారంగా రూ.3 లక్షల చెక్కును అందించారు. 

తదుపరి వ్యాసం