Advocate Suicide: అనంతపురంలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం లేదని యువ అడ్వకేట్ ఆత్మహత్య...
25 October 2024, 10:18 IST
- Advocate Suicide: అనంతపురంలో విషాదఘటన చోటు చేసుకుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలమైన మహిళా న్యాయవాది ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న రుక్సానా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
అనంతపురంలో యువ న్యాయవాది ఆత్మహత్య
Advocate Suicide: ఎన్ని ప్రయత్నాలు చేసినా సరైన ఉద్యోగం లభించడం లేదనే ఆవేదనతో ఓ యువ న్యాయవాది ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అనంతపురం టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం సిద్ధరాంపురం గ్రామానికి చెందిన లాలూసాహెబ్‌కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పిల్లల చదువుల కోసం రెండేళ్ల క్రితం అనంతపురానికి వలస వచ్చిన లాలూ సాహెబ్ కోర్డు రోడ్డులోని ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. ఈ కుటుంబంలో పెద్ద కుమార్తె రుక్సానా (27) అనంతపురం జిల్లా కోర్టులో జూనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్నారు.
సీనియర్ న్యాయవాది ఎల్. ప్రభాకర్‌రెడ్డి వద్ద కొంత కాలంగా ప్రాక్టీస్ చేస్తున్న రుక్సానా అనంతపురం బార్ అసోసియేషన్‌లో యాక్టివ్‌గా ఉండేవారు. లాలూసాహెబ్ రెండో కుమార్తె ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా, మూడో కుమార్తె అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు.
న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న రుక్సానా కొంత కాలంగా ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. జీవితంలో కుదురుకోవాలని చేసే ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో జీవితంపై విరక్తి పెంచుకున్న రుక్సానా నెల రోజులుగా కోర్టుకు కూడా వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటున్నారు.
గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనపై అనంతపురం టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. శ్రీకృష్ణ దేవరాయ క్యాంపస్ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన రుక్సానాకు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్టు సహచర న్యాయవాదులు తెలిపారు. వృత్తిలో నిలదొక్కుకునే అవకాశాలు లభించకపోవడం, వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.