Ycp Rajyasabha Candidates: మూడు రాజ్యసభ స్థానాలకు పోటీ చేయనున్న వైసీపీ.. అసంతృప్తులతోనే అసలు భయం
09 February 2024, 9:53 IST
- Ycp Rajyasabha Candidates: రాజ్యసభ ఎన్నికల్లో పోటీ కోసం వైసీపీ ముగ్గురి పేర్లను ప్రకటించింది. ఖాళీ అయిన మూడు స్థానాల్ని దక్కించుకోవాలని భావిస్తున్నా.. అది ఎంత వరకు సాధ్యమనే సందేహాలు పార్టీలో ఉన్నాయి.
వైసీపీ రాజ్యసభ అభ్యర్థులతో సిఎం జగన్
Ycp Rajyasabha Candidates: రాజ్యసభ ఎన్నికల్లో ఖాళీ అవుతున్న మూడు స్థానాలను దక్కించుకోవాలని వైసీపీ కసరత్తు చేస్తోంది. గురువారం పార్టీ తరపున పోటీ చేసే ముగ్గురు అభ్యర్థుల్ని వైసీపీ ప్రకటించింది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులుగా గొల్ల బాబూరావు, మేడా రఘునాధరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలను వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఎంపిక చేశారు.
గురువారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎంను కలిసి గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభకు వెళుతున్న ముగ్గురు అభ్యర్ధులను జగన్ అభినందించారు.
వైసీపీ రాజ్యసభ అభ్యర్థులుగా మొదటి నుంచి వైవీ.సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు పేర్లు వినిపించాయి. ఆరణి శ్రీనివాసులు స్థానంలో అనూహ్యంగా మేడా రఘునాథ రెడ్డిని ఎంపిక చేశారు.
గొల్లబాబురావు ప్రస్తుతం పాయకారావుపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజ్యసభకు ఎంపిక చేసిన ముగ్గురు నాయకులు గురువారం అసెంబ్లీలో సిఎం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.ఈ నెల 12వ తేదీన పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఏపీలో ప్రస్తుతం మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వైసీపీ తరపున రాజ్యసభ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు మరో రెండు ఖాళీ కానున్నాయి. టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సిఎం రమేష్ తర్వాత బీజేపీలో చేరారు.
ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలం నేపథ్యంలో మూడు స్థానాలను దక్కించుకోవాలని వైసీపీ భావిస్తోంది. రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు లోక్‌సభ స్థానానికి పోటీ చేయనున్నారు. వేమిరెడ్డి స్థానంలో వైవీ.సుబ్బారెడ్డి, మేడా రఘునాథ రెడ్డిలను ఎంపిక చేశారు.
వైసీపీ అభ్యర్థులుగా తొలుత ఆరణి శ్రీనివాసులు పేరు తొలుత ప్రచారం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన బలిజ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాసులుకు ఇటీవల మార్పులు చేర్పుల్లో టిక్కెట్ కోల్పోయారు. చిత్తూరు ఎమ్మెల్యేగా తప్పించిన సమయంలో రాజ్యసభ హామీ ఇచ్చారు.
అయితే ఆయన స‌్థానంలో చివరి నిమిషంలో మేడా మల్లికార్జున రెడ్డి సోదరుడు మేడా మల్లికార్జున రెడ్డికి స్థానం కల్పించారు. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి స్థానంలో ఉమ్మడి కడప జడ్పీ ఛైర్మన్‌గా ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని సమన్వయకర్తగా నియిమించారు. ఈ క్రమంలో మేడా కుటుంబానికి బుజ్జగించేందుకు ఎంపీగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆరణి శ్రీనివాసులుకు మొండి చేయి చూపినట్టు తెలుస్తోంది.
మరోవైపు ఆరణి కుటుంబంలో ఇప్పటికే పార్టీలో సముచిత స్థానం కల్పించినట్టు వైసీపీ చెబుతోంది. ఆయన సమీప బంధువులకు గుంటూరులో టిక్కెట్లు ఖరారైనందున మేడా కుటుంబానికి అవకాశం కల్పించినట్లు చెబుతున్నారు.
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తనయుడైన ఉమ్మారెడ్డి వెంకటరమణ, ఆరణి శ్రీనివాసులుకు వియ్యంకుడు అవుతారు. ఉమ్మారెడ్డి వెంకటరమణ గుంటూరు నుంచి ఎన్నికల్లో పోటీ చేయనుండటంతోనే ఆరణి శ్రీనివాసులును పక్కన పెట్టారని వైసీపీ వర్గాలుచెబుతున్నాయి. ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి అవకాశం కల్పించరాదనే మేడాకు అవకాశం ఇచ్చినట్టు చెబుతున్నారు.
మరోవైపు ఆరణి స్థానంలో మేడా అవకాశం కల్పించడంపై విమర్శలు ఎదురవుతున్నాయి. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో సొంత సామాజికి వర్గానికే పెద్దపీట వేసుకున్నారని టీడీపీ ఆరోపించింది. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ కూడా భావిస్తోంది. ఈ క్రమంలో వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేలపై ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది.
ఇప్పటి వరకు 58 అసెంబ్లీ స్థానాలకు, 14 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారుచేస్తూ జగన్ ఇప్పటికి ఆరు జాబితాలు విడుదల చేశారు. సిటింగ్ ఎమ్మెల్యేల్లో 33 మందికి టికెట్ దక్కలేదు. టిక్కెట్లు రాని వారిలో కొందిరిని తమ వైపు తిప్పుకుంటే ఒక స్థానంలో గెలుపు ఖాయమని టీడీపీ భావిస్తోంది.
కాపుల్ని అణిచివేస్తున్నారన్న టీడీపీ
పదవులన్నీ తన సొంత సామాజిక వర్గానికి కట్టబెట్టి బడుగు, బలహీన వర్గాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అణిచి వేస్తున్నారని టీడీపీ ఆరోపించింది. రాష్ట్రం కంటే తన సామాజిక వర్గమే ఎక్కువని రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో జగన్ రెడ్డి నిరూపించారని అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు.
మూడు రాజ్యసభ సీట్లలో రెండు సొంత వర్గానికి కేటాయించడమేనా జగన్ రెడ్డి చెబుతున్న సామాజిక న్యాయమంటే? రాయలసీమలో ప్రధానమైన బలిజ సామాజిక వర్గానికి చెందిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ కు మొదట రాజ్యసభ సీటు ఇస్తున్నట్టు ప్రకటించారని తడి ఆరక ముందే ఆయనను తొలగించి సొంత సామాజిక వర్గానికి చెందిన మేడా రఘునాధ రెడ్డికి కేటాయించడం బలిజల గొంతు కోయడం కాదా? అని ప్రశ్నించారు.రాజం పేట లోక్ సభ సీటు కూడా సొంత సామాజిక వర్గానికే అప్పగించారు. ఇప్పుడు మరోసారి వంచించారని ఆరోపించారు.