Ysrcp Rajyasabha: మూడు రాజ్యసభ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన వైసీపీ
12 February 2024, 14:23 IST
- Ysrcp Rajyasabha: ఏపీలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల కోసం ముగ్గురు అభ్యర్థులు శాసనసభలో నామినేషన్లు దాఖలు చేశారు. అంతకుముందు ఎంపిక చేసిన అభ్యర్థులకు సిఎం జగన్ బి ఫారంలు అందచేశారు.
రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వైసీపీ అభ్యర్థులు
Ysrcp Rajyasabha: రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు అసెంబ్లీ ఆవరణలో నామినేషన్లు వేశారు. అంతకు ముందు సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డిలకు బిఫారంలు అందచేశారు.
రాజ్యసభకు ఎంపిక చేసినందుకు అభ్యర్థులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేలతో కలిసి శాసన సభా ప్రాంగణానికి చేరుకున్నారు. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున వైసిపి సభ్యులు గొల్ల బాబూరావు,వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాధరెడ్డిలు సోమవారం అసెంబ్లీలో రాజ్యసభ ఎంపి అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న శాసనసభ సంయుక్త కార్యదర్శి యం.విజయరాజు వద్ద వారి నామినేషన్లను దాఖలు చేశారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి పివి.సుబ్బారెడ్డి, ఉప కార్యదర్శి వనితా రాణి,అభ్యర్థులు తరపున రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాజ్యసభ ఎంపి విజయసాయి రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద రాజు, గడికోట శ్రీకాంత్ రెడ్డి, మేడా మల్లిఖార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైఎస్సార్‌సీపీలో అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. సీఎం జగన్ పేదల పెన్నిధి అని గొల్ల బాబూరావు తెలిపారు. సీఎం జగన్‌తోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు న్యాయం జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌నే సీఎం చేసుకోవాలని చెప్పారు. సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని మరో అభ్యర్థి మేడా రఘునాథరెడ్డి పేర్కొన్నారు.
ఇంకా తేలని రెబల్ ఎమ్మెల్యేల వ్యవహారం…
ఓ వైపు రాజ్యసభ ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో వైసీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు విచారణ నేటి విచారణకు రావడం లేదని వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు సమాచారం ఇచ్చారు.
మూడోసారి విచారణకు రావాలని నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. స్పీకర్ రెబల్ ఎమ్మెల్యేలపై వేటు వేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి తమకు రెండు వారాల గడువు కావాలని స్పీకర్‌కు లేఖలు రాశారు. నేటి విచారణకు హాజరు కాలేమని న్యాయవాదులతో సమాచారం పంపారు. ఆనం రామనారాయణ రెడ్డి మాత్రం రెండు సార్లు విచారణకు హాజరై తన వాదన వినిపించారు.
అటు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు మద్దాలి గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, వల్లభనేని వంశీలలో వాసుపల్లి గణేష్ మాత్రమే ఇప్పటి వరకు ఒక్కసారి విచారణకు హాజరయ్యారు. మిగిలిన వారు ఎవరు విచారణకు రాలేదు. దీంతో వారికి మూడో సారి నోటీసులు ఇచ్చారు. టీడీపీ రెబల్స్‌కు మరోసారి అవకాశం ఇస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో ఎన్నికల అనర్హత పిటితలషన్లపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.