తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఎమ్మెల్సీ అనంతబాబుకు ఎందుకంత ధైర్యం....

ఎమ్మెల్సీ అనంతబాబుకు ఎందుకంత ధైర్యం....

HT Telugu Desk HT Telugu

22 May 2022, 16:32 IST

google News
    • కాకినాడ ఎమ్మెల్సీపై హత్యారోపణల వ్యవహారం వైసీపీకి రాజకీయంగా చుట్టుకుంటోంది. హత్య జరిగిన మూడ్రోజుల వరకు నిందితుల్ని పట్టుకునేందుకు కనీస ప్రయత్నాలు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎంత ధైర్యం, రాజకీయంగా ఎవరి అండదండలున్నాయనే చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది. తెలుగు సినిమాల్లో చూపినట్టు ఏజెన్సీ ప్రాంతాల్లో పెత్తందారుల అరాచకాల మాదిరి వ్యవహారశైలితో అనంతబాబు ఉంటారని జిల్లాలో ప్రచారంలో ఉంది.
ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డితో ఎమ్మెల్సీ అనంతబాబు
ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డితో ఎమ్మెల్సీ అనంతబాబు

ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డితో ఎమ్మెల్సీ అనంతబాబు

డ్రైవర్‌గా పనిచేసే యువకుడిని పుట్టినరోజు వేడుకల అంటూ తీసుకెళ్లిన ఎమ్మెల్సీ అర్ధరాత్రి శవంగా తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించడం, మృతుడి బంధువులు ఎదురు తిరగడంతో రెండ్రోజులుగా కోనసీమ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకోవడం తెలిసిందే. దళిత యువకుడిని ఎమ్మెల్సీ హత్య చేశారనే ఆరోపణలు, పోలీసుల నిష్క్రియపరత్వం, ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు విస్తృత చర్చ జరుగుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి హత్యారోపణల్ని ఖాతరు చేయకుండా శవాన్ని తీసుకొచ్చి బాధితుడి ఇంటి ముందు వదిలేయడం, ఆ తర్వాత ఏమి జరగనట్లు పెళ్లి వేడుకల్లో పాల్గొనడం, ఈ వ్యవహారం మొత్తాన్ని చిన్నది చేసేలా పోలీసులు, అధికార పార్టీ నాయకుల వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దళిత యువకుడిని హత్య చేశారంటూ రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినా అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, ఆఖరికి దళిత హోం మంత్రి తమకు సంబంధం లేనట్టు వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. కోనసీమలో బలమైన నేపథ్యం ఉన్న రాజకీయ కుటుంబం కావడంతోనే అనంతబాబు వ్యవహారంలో అధికార పార్టీ తాత్సరం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఎవరీ అనంతబాబు.....?

చిన్న వయసులోనే పెద్దల సభలో ఎంట్రీ ఇచ్చిన అనంతబాబు గోదావరి జిల్లాల్లో బలమైన సామాజిక వర్గానికి చెందిన రాజకీయ నాయకుడు. రాజకీయంగా కులబలం, అధికార పార్టీ ఎమ్మెల్సీ కావడంతో డ్రైవర్‌ హత్య జరిగినా ఏమి జరగనట్టే వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. తూర్పు గోదావరి జిల్లా మెట్ట ప్రాంతం నుంచి రంపచోడవరం ఏజన్సీ ప్రాంతానికి వీరి కుటుంబం వలస వెళ్లింది.

ఎమ్మెల్సీ అనంతబాబు తండ్రి అనంత చక్రరావుని ఏజెన్సీలో గిరిజనుల్ని దోచుకుంటున్నారనే అభియోగాలపై నక్సలైట్లు పలుమార్లు హెచ్చరించి చివరకు హత్య చేశారు. తండ్రి చనిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో వచ్చిన సానుభూతితో టీడీపీ తరుపున రాజకీయాల్లోకి ప్రవేశించారని చెబుతారు. మొదట అడ్డతీగల ప్రాంతంలో జడ్పీటీసీగా గెలిచాడు. అక్కడ పట్టు సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీపీ హోదా సాధించి క్రమంగా నియోజకవర్గ రాజకీయాల్లోకి ప్రవేశించాడు. 2005లో నకిలీ ఎస్టీ సర్టిఫికెట్‌తో ఎన్నికల్లో పోటీ చేశాడు. కోనలోవలో నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ తెచ్చుకుని పోటీచేసిన సమయంలో టీడీపీ వాళ్ళతో రాజీపడ్డాడు. ఆ సమయంలో అనంత ఉదయభాస్కర్‌ గిరిజనుడు కాదని సిపిఎం నాయకులు ఎదురుతిరిగారు. అప్పట్లో జిల్లా ఏజెన్సీ అధికారులుగా ఉన్న రోనాల్డ్‌రోస్‌, తూర్పు గోదావరి కలెక్టర్‌ గోపాలకృష్ణ ద్వివేదిలు అనంతబాబు కుల ధృవీకరణపై విచారణ జరిపి సర్టిఫికెట్ రద్దు చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో పట్టుకోల్పోకుండా ఉండటానికి తన చెప్పు చేతల్లో ఉండేవారిని రాజకీయంగా ప్రోత్సహించడం ప్రారంభించాడని చెబుతారు. గోదావరి జిల్లాల్లో ఉన్న అటవీ ప్రాంతం నుంచి కలప అక్రమ రవాణా, మహిళల మీద వేధింపులు సహా పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ ప్రాంతంలో రాజకీయ ప్రత్యర్థులు ఏజన్సీ వీరప్పన్‌గా విమర్శించేవారు.

<p>ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత ఏజెన్సీలో అడ్డు లేకుండా పోయింది.</p>

ఏజెన్సీ వీరప్పన్......రాజకీయంగా అండదండలు

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కీలకమైన ఇద్దరు నాయకులతో ఉన్న బంధుత్వంతో అనంతబాబు ఆడింది ఆటగా మారిందని ఆ ప్రాంతంలో ప్రచారంలో ఉంది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో మేనమామ జ్యోతుల నెహ్రూ, కాంగ్రెస్ పాలనలో మరో మేనమాట వరుపుల సుబ్బారావు ద్వారా వ్యవహారాలు చక్కబెట్టుకునేవాడు. నియోజక వర్గంలో పోటీ చేసే అవకాశం దక్కినా ఎస్టీ రిజర్వుడు స్థానం కావడంతో 2014లో వంతల రాజేశ్వరిని బలపరచి ఆమె గెలుపులో కీలకపాత్ర పోషించాడు. పిఏసి ఛైర్మన్‌ పదవి దక్కకపోవడంతో జ్యోతుల నెహ్రూ టీడీపీ తీర్ధం పుచ్చుకోవడంతో ఆయనతో రాజేశ్వరిని కూడా పార్టీ మారేందుకు సిద్ధమని చంద్రబాబుకు ప్రతిపాదించారు. ఫిరాయింపు విషయంలో రాజేశ్వరికి సంబంధం లేకుండా బేరం కుదుర్చుకుంటున్నారనే ప్రచారంతో రాజేశ్వరి నేరుగా టీడీపీ నాయకత్వంతో సంప్రదించి వైసీపీని వీడారు.రాజేశ్వరి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆమె లెటర్‌హెడ్‌లు కూడా అనంతబాబు దగ్గరే ఉండేవని ప్రచారం జరిగేది.

అంతకు ముందే ఎమ్మెల్యే లెటర్ హెడ్ సహా అన్నీ తన దగ్గరే ఉంచుకుని అధికారం చక్కబెడుతున్న తీరు మీద కథనాలు కూడా వచ్చాయి. అదంతా అతని మీద ఒత్తిడి పెంచి టీడీపీలో చేర్చుకోవడానికి ఏబీఎన్ వేసిన ఎత్తుగడ అనే వాదన కూడా వినిపించింది. రాజేశ్వరి టీడీపీలోకి వెళ్లిపోవడంతో నాగులపల్లి ధనలక్ష్మీ తెరపైకి వచ్చారు. నియోజక వర్గంలో ఆమె గెలుపుకోసం అనంతబాబే పనిచేశారని చెబుతారు. నియోజక వర్గంలో గట్టి పట్టు సాధించడంతో పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే డిసిసిబి ఛైర్మన్ పదవి దక్కింది. ఆ తర్వాత ఏకంగా ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్నారు. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలో పలు అక్రమాల్లో ఆరోపణలు ఎదుర్కొన్నా రాజకీయంగా పుష్కలంగా అండదండలు ఉండటంతో ఎవరేమి చేయలేరనే ధీమాతో వ్యవహరిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

చంద్రబాబు పరామర్శ....

వైసీపీ ఎమ్మెల్సీ అనంత‌బాబు కారు డ్రైవ‌ర్ సుబ్రహ్మణ్యం భార్యను టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఫోన్ లో ప‌రామ‌ర్శించారు. సుబ్రహ్మణ్యం మృతదేహానికి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం స్వగ్రామం గొల్లలమామిడాడలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్య అపర్ణను ఫోన్ ద్వారా పరామర్శించారు. బహిరంగంగా తిరుగుతున్న ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అపర్ణకు టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితులకు శిక్ష పడేవరకు టీడీపీ పోరాటం కొనసాగుతుందని హామీ ఇచ్చారు.

టాపిక్

తదుపరి వ్యాసం