Prakasam Crime: మేకప్ కోసం వచ్చి దోపిడీకి పాల్పడిన మహిళలు
07 September 2023, 11:36 IST
- Prakasam Crime: ప్రకాశం జిల్లాలో జరిగిన బ్యూటీ పార్లర్‌లో దోపిడీ కేసును పోలీసులు చేధించారు. మేకోవర్ కోసం వచ్చిన మహిళలు బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలిపై మత్తు మందు చల్లి నగలు దోపిడీ చేసినట్లు గుర్తించారు. దోపిడీ సూత్రధారితో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు.
ప్రకాశం జిల్లాలో దోపిడీని చేధించిన పోలీసులు
Prakasam Crime: మేక్ ఓవర్ అంటూ వచ్చి మహిళా బ్యూటిషయన్ ఇంట్లో చోరీకి పాల్పడిన నలుగురు మహిళలను ప్రకాశం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో రూ.11లక్షల రుపాయల విలువైన నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఒంగోలులోని పేర్నమిట్ట శ్రీకృష్ణనగర్‌లో షేక్ రజియా బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. భర్త షేక్ మీరా భక్షి ఉద్యోగం కోసం ఉదయాన్నే వెళ్లి రాత్రికి ఇంటికి వస్తాడు. ఆమె కుమార్తె కాలేజీకి వెళ్లి సాయంత్రం సమయంలో ఇంటికి వస్తుంది. ఈ క్రమంలో రజియాక పరిచయం ఉన్న దాసరి భాను అలియాస్ షేక్ భాను అనే యువతి పగటి పూట రజియా ఒక్కరే పార్లర్‌లో ఉంటుందని గ్రహించింది.
రజియా వద్ద సుమారు 10 లక్షల పైన విలువ చేసే ఆభరణాలు, నగదు ఉన్నాయనే విషయాలు తెలియడంతో దోపిడికి పథకం వేసింది. గతంలో నేరాలకు పాల్పడిన స్నేహితురాళ్లతో విషయం పంచుకుంది. భానుకు తెలిసిన ముండ్రు లక్ష్మి నవత @ నవ్య, కరణం మోహన దీప్తి @ దీప్తి, అలహరి అపర్ణలకు రజియా గురించి వివరించింది.
ముగ్గురు మహిళలు ఫిర్యాదుని ఏదో ఒక విధంగా నమ్మించి ఆమె వద్ద నుంచి బంగారు ఆభరణాలను నగదు దొంగిలించాలనే ఉద్దేశ్యంతో మంగళవారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో పార్లర్‌కు వచ్చారు. ముగ్గురు బ్యూటీ పార్లర్ సేవలు చేయించుకోవాలని నమ్మించి, మొదట ఇద్దరు మహిళలు ఐబ్రోస్ చేయించుకొని, ఆ తర్వాత మరొక మహిళ పెడిక్యుర్ చేస్తూ ఉండగా, మిగతా ఇద్దరు మహిళలు ఆమెను పట్టుకొని గుర్తు తెలియని ద్రావణం స్ప్రే చేశారు. ఆ తర్వాత క్లాత్ ను ఆమె ముఖం మీద అద్దారు.
కెమికల్ లాంటి ద్రవాన్ని ఆమె నోట్లో పోయటానికి ప్రయత్నించి, చంపుతామని బెదిరించారు. ఫిర్యాదిని స్పృహ తప్పే విధంగా చేసి, ఆమె మెడలో ఉన్న బంగారు ఆభరణాలు, చెవి కమ్మలు మరియు చేతికి ఉన్న ఉంగరములు దొంగిలించారు. ఇంటిలోని బీరువాను ఓపెన్ చేసి అందులో ఉన్న 10 సవరల బంగారం ఆభరణాలు, రూ.40,000/- ల నగదును దొంగతనం చేసి, చోరీ సొత్తుతో అక్కడ నుంచి పారిపోయినారు.
నిందితుల్లో ముండ్రు లక్ష్మి నవత అలియాస్ నవ్య, కరణం మోహన దీప్తి @ దీప్తి లు గతంలో ఇద్దరు యువకులతో కలసి పెళ్లూరు గ్రామంలో లో గల ఒక అపార్ట్ మెంట్‌లో ఇదే తరహా నేరం చేసినట్లు గుర్తించారు. కేసును అన్నికోణాల్లో దర్యాప్తు చేపట్టి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తన సిబ్బందితో ముద్దాయిలను అరెస్ట్ చేశారు.
చోరీ చేసిన 100 గ్రాముల బంగారు ఆభరణాలు, 40వేల నగదు రికవరీ చేశారు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ Cr.No.237/2021 U/Sec.392 IPC కేసులో 96 గ్రాములు బంగారాన్ని కూడా నిందితుల నుంచి రికవరీ చేశారు. రూ.11లక్షల విలువైనఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.