Pre Poll Surveys: ముందస్తు సర్వే నివేదికలతో రాజకీయ కలకలం..
18 April 2023, 14:57 IST
- Pre Poll Surveys: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పార్టీలన్ని ఎన్నికల మూడ్‌లోకి వచ్చేశాయి. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ రాష్ట్రానికి వంటి కార్యక్రమాలతో టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు సర్వే ఫలితాలు చర్చనీయాంశంగా మారాయి.
చంద్రబాబు, జగన్(ఫైల్ ఫొటో)
Pre Poll Surveys: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే క్షేత్ర స్థాయిలో ఓటర్ల మనోగతం మాత్రం వాటితో సంబంధం లేనట్లు సాగుతోందట. ఏపీలో మరో ఏడాదిలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఏ పార్టీకి అనుకూలంగా రాజకీయ వాతావరణం ఉందనే దానిపై పార్టీలు ముందస్తు సర్వేలు చేయిస్తున్నాయి. ఓటర్ల మనోగతాన్ని తెలుసుకోవడంతో పాటు నియోజక వర్గాల్లో ఎవరి సత్తా ఏమిటనే దానిపై అయా సంస్థలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి అంచనా వేస్తున్నాయి.
తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పలు సంస్థలతో ఎన్నికల సరళిపై సర్వేలు చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి పొలిటికల్ కన్సల్టెంట్‌గా ఉన్న రాబిన్ శర్మ బృందంతో పాటు మరో రెండు సంస్థలు ఏపీలో రాజకీయ వాతావరణంపై సర్వేలు చేసినట్లు తెలుస్తోంది. రాబిన్ శర్మ బృందం జరిపిన సర్వేల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే వచ్చే ఫలితాలు మధ్యస్తంగా ఉన్నా, జనసేనతో కలిసి పోటీ చేస్తే అధికారానికి చేరువ కావొచ్చని నివేదికలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నివేదిక పూర్తి సంతృప్తికరంగా లేకపోవడంతో వేరే బృందాలతో సర్వేలు చేయించినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఏపీలో ముందస్తు ఎన్నికల వాతావరణంపై లగడపాటి బృందం కూడా ఓ సర్వే నిర్వహించినట్లు చెబుతున్నారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సోదరుడు లగడపాటి మధు, ఫ్లాష్ టీమ్‌తో కలిసి ఈ సర్వే నిర్వహించినట్లు చెబుతున్నారు. లగడపాటి సర్వేలో ఫలితాలు వైసీపీకి అనుకూలంగా వెలువడినట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో వైసీపీకీ అనుకూల వాతావరణం ఉందనే నివేదికలు వెలువడినట్లు సమాచారం.
2019 ఎన్నికల్లో జగన్ గెలుపుకు కారణమైన అంశాలతో సంబంధం లేకుండా ఈసారి ఓటర్ల తీరు ఉంటుందని సర్వేల్లో వెల్లడైనట్లు చెబుతున్నారు. ప్రస్తుతం రాజకీయంగా అధికార పక్షానికి వ్యతిరేకంగా స్వరాలు వినిపిస్తున్నా, గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీకి ఓటర్లలో తిరుగులేని పట్టుందని చెబుతున్నారు. 2009, 2014,2019 ఎన్నికల్లో వరుసగా టీడీపీ గెలువని స్థానాల్లో మళ్లీ వైసీపీకే దక్కొచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 53 స్థానాల్లో టీడీపీకి వరుసగా మూడు ఎన్నికల్లో ఓటమి తప్పలేదని, అయా నియోజక వర్గాల్లో పట్టు దక్కించుకోవడం టీడీపీకి కష్టమని సర్వే నివేదికలు చెబుతున్నాయి.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణపై సర్వేలు చేసే ఆరా సంస్థ కూడా ఇటీవల నిర్వహించిన సర్వేలో వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వెలువడినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆరా సంస్థ ఢిల్లీకి చెందిన తమ క్లయింట్ కోసం నిర్వహించిన సర్వేలో వైసీపీ కూటమికి 101 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తుందని అంచనా వేసినట్లు చెబుతున్నారు. మరో 26 స్థానాల్లో ఫలితాలు అటుఇటుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జనసేన-టీడీపీ కూటమి బలం 47 స్థానాల నుంచి 70 స్థానాల్లోపు మాత్రమే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ముందస్తు ఎన్నికల ఫలితాలు వైసీపీకి అనుకూలంగా ఉండటంతో ఆ పార్టీ వర్గాల్లో హుషారుగా ఉన్నాయి.
మరోవైపు టీడీపీ మాత్రం ఎన్నికల సర్వేలు, వాటి ఫలితాలతో సంబంధం లేకుండా గెలుపుపై ధీమాతో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు బలపడిందని టీడీపీ నాయకులు చెబుతున్నారు. సంక్షేమ పథకాలు అందుకునే వారు, అందుకోని వారిలో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని టీడీపీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.